గొప్ప ఆలోచన (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 రాజవరం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం ఆ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, తమకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన గురువులు ఆత్మీయంగా కలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ‌ బ్యాచ్ విద్యార్థులు తమకు చిన్నప్పటి నుంచి ఎంతో శ్రద్ధతో విద్య నేర్పిన గురువుల పుణ్యమా అని గొప్ప గొప్ప ఉద్యోగాలలో స్థిరపడినవారు. 

 

      ఆనాటి ఆత్మీయ సమ్మేళనం ప్రత్యేకత ఓ గొప్ప సెలబ్రిటీకి ప్రత్యేక సన్మానం. ఎవరా సెలబ్రిటీ తప్పక చూడాలనే కుతూహలం ఊళ్ళో చాలామందికి కలిగింది. ఆరోజు రానే వచ్చింది. ఎంతోమంది పూర్వ విద్యార్థులతో పాటు ఆనాటి ఉపాధ్యాయులూ వచ్చారు. ఆ సెలబ్రిటీని చూడటానికి ఊళ్ళో చాలామంది వచ్చారు. కార్యక్రమం మొదలైంది. ఆ పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను, ఆ పాఠశాలలతో, ఉపాధ్యాయులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తదనంతరం ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి తగిన బహుమతులను అందజేశారు. అయితే ఎవరా సెలబ్రిటీ అనే సందేహం చాలామందికి కలిగింది. ఎంతైనా సెలబ్రిటీ కదా! పిలిచినా ఇలాంటి కార్యక్రమాలకు ఎలా వస్తారు? అని కొందరు అనుకున్నారు. ఆలస్యంగా వస్తారేమో అని కొందరు అనుకున్నారు. ఉపాధ్యాయుల తర్వాత నాన్ టీచింగ్ వాళ్ళనూ సన్మానించారు. ఆ తర్వాత వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని వండిపెట్టిన కమలమ్మ, సీతమ్మలను ఘనంగా సత్కరించారు. 

 

       ఆనాటి ఆ కార్యక్రమ నిర్వాహకుడు అయిన సతీశ్వర్ మాట్లాడుతూ "మా అన్నపూర్ణమ్మలను ఎంత పొగిడినా తక్కువే. మధ్యాహ్నం వేళ కమ్మగా వంటలు వండటమే కాదు ప్రేమగా మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థికి కొసరి కొసరి వడ్డించేవారు. ఇంటివద్ద మాకు ఇష్టం లేని కూరలను కూడా మా వంటవాళ్ళు వండితే ఇష్టంగా తినేవాళ్ళం. కారణం కమ్మగా వండటమే కాదు, ఆ కూరగాయలు ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తాయో చెప్పి మరీ తినేలా చేసేవారు. వారి ప్రేమ వల్ల అప్పుడు మేమెంతో ఆరోగ్యంగా ఉన్నాము. క్రమం తప్పకుండా కోడిగుడ్లనే కాదు, రకరకాల పళ్ళను తినిపించేవారు. వారికొచ్చే డబ్బులెన్నో కానీ అదనంగా డబ్బులు కలుపుకొని అంత మంచి భోజనాన్ని పెట్టిన వీరికి మేము ఏమిచ్చినా ఋణం తీరదు. వారి పుణ్యమా అని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాఠశాలకు గైర్హాజరు తగ్గింది. ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది, చాలామంది ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడినారు. ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వర్తిస్తూ, పదిమంది మంచి కోసం నిరంతరం కృషి చేసేవారే నిజమైన సెలబ్రిటీలు. మా సెలబ్రిటీలు ఈ అన్నపూర్ణమ్మలు ఇద్దరే." అన్నాడు. వాళ్ళందరూ కలిసి కమలమ్మ, సీతమ్మలకు రెండు లక్షల రూపాయల చెక్కు అందజేశారు. సంతోషంతో చప్పట్లు కొట్టారంతా. ఆ వంటవాళ్ళు ఆ బహుమతిని తమ సొంతానికి వాడుకోండా విద్యార్థుల ఆరోగ్యం కోసమే ఖర్చు పెడతామని ప్రకటించారు. ఎడతెరిపి లేని చప్పట్లు మారుమోగాయి.