199.డా.యన్.మంగాదేవి బాలసాహిత్య పురస్కారం(మొదటి భాగం):: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.


:శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్,గుంటూరు వారు బాలల కోసం నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా 1994 లో డా.యన్.మంగాదేవి బాలసాహిత్య పురస్కారాన్ని నెలకొల్పడం జరిగింది. ప్రతి ఏటా బాలసాహిత్య జగత్తులో కృషి చేసే వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి పురస్కార ప్రదానం గావించడం ఆనవాయితీగా వస్తూంది. శ్రీ మహీదర నళినీమోహన్,శ్రీ ఏడిద కామేశ్వరరావు, శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్,శ్రీమతి డి.సుజాతాదేవి, శ్రీ కలువ కొలను సదానంద,డా.వెలగా వెంకటప్పయ్య, శ్రీమతి మనోరమా జాఫా, శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి,డా.రావూరి భరద్వాజ, శ్రీ రెడ్డి రాఘవయ్య,శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు,శ్రీ చొక్కాపు వెంకటరమణ,శ్రీ దాసరి వెంకట రమణ,వసుంధర, శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు, శ్రీ బాలి,శ్రీ గీతాసుబ్బారావు గారలు
ఈ ప్రతిష్టాత్మక బాలసాహిత్య పురస్కారమందు
కున్నారు.2015 సంవత్సరానికి గాను నన్ను ఎంపిక చేసినట్టు డా.యన్.మంగాదేవి గారు
ఫోన్ లో తెలియపరిచారు.ఆ తరువాత నవంబరు
14 తేదీతో అన్ని వివరాలతో లేఖ అందింది.ఈ
పురస్కారానికి గాను రు.25,000 లు నగదు,
జ్ఞాపిక బహూకరించబడతాయని పేర్కొన్నారు.
2015 డిశంబరు 10 న గుంటూరు,శ్యామలానగర్ లోని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ లో నిర్వహించబడే బాలల లలిత కళా ఉత్సవం లో ప్రదానం చేయబడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఆలూమగలిద్దరు పురస్కార ప్రదానో
త్సవానికి రావలసినదిగా మంగాదేవి మేడం గారు
కోరారు.డిశంబరు 9న పార్వతీపురం నుంచి 
బయలుదేరి 10వ తేదీ ఉదయం గం.7.30 కి
గుంటూరు చేరాం.ట్రైన్ దిగగానే బాలకుటీర్ వారి
తరుపున డా.నాగభైరవ ఆదినారాయణ గారు
మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఒక హోటల్  లో
దింపారు.10గం.కి వచ్చి 'చేతన ఛారిటబుల్ ట్రస్ట్'
కి తీసుకు వెళ్తామన్నారు.గం.10 లకు మేం
సిద్ధంగా ఉన్నాం.డా.నాగభైరవ ఆదినారాయణ
గారు వచ్చారు.మమ్మల్ని కారులో చేతనకు
తీసుకు వెళ్ళారు.చేతన ఒక అద్భుత ప్రపంచం.
బాలల కోసం వెల్లివిరిసిన ఆనందలోకం.ప్రశాంతత కు, నిర్మలత్వానికి, వికాసానికి మారు పేరే 'చేతన'ని
పించింది.అక్కడున్న ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి పువ్వు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి.ఆ ప్రాంతం ఒక మ్యూజియంలా అనిపించింది.
స్వార్ధమెరుగని ఒక పవిత్ర జీవి నిర్మించే ఒక స్వప్న
సాకార నిర్మాణమది.ఆ పవిత్ర జీవే డా.యన్.మంగాదేవి గారు! బాలల పట్ల, విద్య పట్ల, వృద్ధుల పట్ల ఆమెకున్న ఆశయాలు చేతన
ఆవరణంలో అడుగడుగునా కనిపిస్తాయి.శ్రీమతి
మరుద్వతి మేడం గారు దగ్గరుండి అవన్నీ 
చూపించారు.ఆ సమయంలోనే సాయంత్రం సభకు
అతిధులైన శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉప
కులపతి ఆచార్య శ్రీమతి వి.దుర్గాభవాని గారు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 
శ్రీ కె.శివారెడ్డి గారు వచ్చారు.అందరం కలసి
భారత రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం గారు ప్రసంగించిన వేదిక వద్దకు వెళ్ళాం.ఫోటోలు 
దిగాం.చేతలకు చిహ్నమైన చేతి వేళ్ళ నిర్మాణం
ఆకట్టుకుంంది.ఆ వేళ్ళ మధ్య పచ్చిక నిరంతర
వికాసానికి గుర్తుగా అనిపించింది. చేతన పరిసరాలలోని పచ్చని చెట్లను,మొక్కలను
చూస్తుంటే మంగమ్మ గారికి చెట్ల పెంపకం మీద
ఉన్న శ్రద్ధ అవగతమవుతుంది.అవన్నీ చూశాక
సంగీత భవనానికి తీసుకు వెళ్ళారు.అక్కడున్న పిల్లలు వివిధ రకాల సంగీత నైపుణ్యాలను వినిపించారు.అక్కడ నుంచి ఒక పెద్ద హాలులోకి  వెళ్ళాం.అక్కడ పిల్లలు చేసిన కళాకృతులు చూసి నివ్వెర పడ్డాం.అవన్నీ వ్యర్ధ పదార్థాలు అనిపించ దగిన ఎండిపోయిన చెట్ల అవశేషాలు, రాలిపోయిన కొబ్బరి మట్టలు,ఎండిపోయిన కొబ్బరి కాయలు ఇంకా అనేక వ్యర్ధ వస్తువులతో తయారయ్యావే.అవి చూశాక మధ్యాహ్నం భోజనాలకు రెల్లు గడ్డితో తయారయ్యే కుటీరానికి తీసుకు వెళ్ళారు.ఆ కుటీరం ఒక తాటిచెట్టు చుట్టూ కట్టారు.బయట నుంచి చూస్తే అది ఒక
అందమైన దృశ్యం గా కనిపిస్తాది.ఎండపడి వచ్చిన
మా అందరకూ ఆ కుటీరం చలువ పందిరిలా సేద
తీర్చింది.కమ్మని వంటకాలతో భోజనాలయ్యాక కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాం.ఆ తరువాత మమ్మల్ని చెట్ల నీడకు తీసుకువెళ్ళారు.వెళ్తున్న
దారిలో ఒక బస్సు చూశాం.దాని మీద సంచార పాఠశాల అని ఉంది. బడికి రాలేని సంచార జాతుల పిల్లల కోసం ఆ బస్సును ఏర్పాటు చేశారు.లోపలికి వెళ్ళి చూశాను. తరగతి గదిని పోలి ఉంది. విద్యా సంబంధమైన బొమ్మలు చిత్రించి ఉన్నాయి.ఆ బస్సు సంచార పిల్లలున్న దగ్గరకు వెళ్తుంది.బస్సు లోనే పాఠాలను టీచర్లు చెబుతారు.మంగమ్మ గారి ఆలోచనకు శాల్యూట్ చేయాలి.అంతలో రెండు వందల మంది పిల్లలు ఆ ప్రాంతానికి వచ్చి చేరారు.అక్కడ అతిథులచే సందేశాలిచ్చే కార్యక్రమం నిర్వహించారు. నేను రచయితగా ఎలా మారానో చెప్పాను.చదువు విలువ, పుస్తక పఠనం ఆవశ్యకత చెప్పాను.ఆ తరువాత మమ్మల్ని బసకు తీసుకు వచ్చారు.సమయం మూడయింది.గం.5.30 ని.కు వచ్చి పురస్కార ప్రదానోత్సవం జరుగబోయే  శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్ కి తీసుకు వెళ్తానని చెప్పారు డా.నాగభైరవ ఆదినారాయణ గారు.ఆ సమయానికి తయారై సార్ కోసం ఎదురు చూస్తున్నాం.(సశేషం)