ఇదీ విషయం: -- జగదీశ్ యామిజాల

నాకు తెలిసిన ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఓ పండగరోజున వాకిట్లోకొచ్చే బిచ్చగాడెవరైనా కావచ్చు అతనిని ఇంట్లోకి పిలిచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అన్నం పెట్టి అనంతరం యాభై ఒక్క రూపాయలు దక్షిణగా తాంబూలం, ఓ నాలుగు మూరల పంచ, ఓ తుండుగుడ్డ ఇచ్చి పంపడం అలవాటు. 


అలాగే ఓ పండక్కి ఓ ముగ్గురు బిచ్చగాళ్ళు వస్తే వాళ్ళకు తన అలవాటు ప్రకారం అతిథి సత్కారాలు చేసి పంపారు. పైగా అన్నంకూడా తన భార్యతోనే వడ్డిస్తాడాయన. 


ఆయనకున్న ఈ అలవాటు నాకు తెలిసిన విషయమే. 


ఓ పండగకు ముగ్గురు బిచ్చగాళ్ళు ఆయన ఆతిథ్యం స్వీకరించడం తెలిసి వారిని ఒక్కొక్కరినే పిలిచి పలకరించాను. "ఏంటీ ఆ పెద్దాయన ఇంటికి వెళ్ళి వస్తున్నావుగా? ఆతిథ్యం ఎలా ఉంది?" అని అడిగాను.


దానికి అతని జవాబు "అన్నం అంతా బాగానే ఉంది. కానీ వొట్టి పిసినారండి. నాలుగు మూరల పంచ కాకుండా ఎనిమిది మూరల పంచ, ఓ పెద్ద తుండుగుడ్డ, నూటొక్క రూపాయలు ఇస్తే ఆయన సొమ్మేమైనా తరిగిపోతుందా?" అని పెదవి విరిచాడు.


ఆ తర్వాత రెండో వ్యక్తిని అడిగాను ఆతిథ్యమెలా ఉందని?


దానికి అతని జవాబు "అన్నం రుచిగానే ఉందికానీ మరీ యాభై ఒక్క రూపాయలే ఇచ్చాడు. తుండుగుడ్డ ఇంకాస్త మంచిదిస్తే బాగుండేది?" అంటూ నీరసంగా కదిలాడు.


ఇక మూడో బిచ్చగాడిని ప్రశ్నించాను. 


దానికి అతను "పరవాలేదులెండి. వాళ్ళావిడతో వడ్డించారన్నం. అది ఆనందమే కానీ తుండుగుడ్డ ఓ మోస్తరుగా ఉందయ్యా. మిగతా ఇళ్ళ వాళ్ళకంటే నయంలెండి. ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టి అన్నంపెట్టాడాయన" అన్నాడు.


అందుకే అంటారు గుర్తెరిగి ఆతిథ్య మివ్వాలని.