ఉపాధ్యాయపర్వం-20: రామ్మోహన్ రావు తుమ్మూరి

అవగాహన అనేది అధ్యయనంలో చాలా ముఖ్యమైన విషయం.నాకు బియ్యెడ్ చేసినప్పుడు ఈ విషయం చాలా స్పష్టంగా అవగతమైంది.ఫ్రెష్ విద్యార్థులకు నాకు ఈ విషయంలో తేడా ఏమిటో తెలుసు.వాళ్లంతా డిగ్రీ కాగానే బియ్యెడ్ చేసి ఉంటే టీచర్ ఉద్యోగానికి
అర్హత వస్తుంది,కనుక చేద్దాం అనే దృష్టితో చేరిన వారే దాదాపుగా.నాది కూడా ఉద్దేశం అదే అయినా అవగాహన విషయానికి వచ్చేసరికి 
ముఖ్యంగా క్లాస్ రూం లో సైకాలజీ, ఫిలాసఫీల ఆవశ్యకత ఏమిటి?
సబ్జెక్టు బోధనలో సబ్జెక్టు కు సంబంధించిన విషయపరిజ్ఞానం 
ఏ విధంగా తోడ్పడుతుంది?పాఠ్యాంశ వివరణలో కళా నైపుణ్యాలు ఎలా ఉపకరిస్తాయి.ఇవన్నీ మిగతా వారికంటే నాకు కాస్తా ఎక్కువగానే తెలిసిఉండటానికి నా వ్యక్తిగత అనుభవాలు కారణమయ్యాయి. సైకాలజీ విషయానికి వస్తే అవగాహనకు నాకు తోడ్పడినవి నేను చదివిన అనేక పుస్తకాలు.చదువుకునే రోజుల్లో చందమామతో మొదలైన నా పత్రికా పఠనం ఆ తరువాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రభూమి,
స్వాతి వంటి వారపత్రికలు,ఇందులో కొన్నిటి దీపావళి అనుబంధాలు, యువ,జ్యోతి,విపుల,చతుర,స్వాతి మంత్లీ,ఆంధ్రభూమి మంత్లీ,అపన (అపరాధ పరిశోధన),ఇండియా టుడే (తెలుగు)రచన ఇలా దాదాపు తెలుగులో వచ్చిన పత్రికలు చదివి ఉండటం,వీటికి తోడు అనేక నవలలు
కూడా క్లబ్ లైబ్రరీలో తెచ్చుకుని చదవటం,ఒక ఎత్తైతే నేను  నాటకాలు వేసిన రోజుల్లో మనవి కాని పాత్రలు పోషించటం,అనేక సన్నివేశాల్లో అనేక పాత్రోచిత ,సందర్భోచిత హావభావాలు ప్రకటించడం వివిధ మనస్తత్త్వాల గురించి తెలుకునేందుకు బాగా ఉపయోగపడ్డాయి.ఇక ఫిలాసఫీలో వచ్చే వాదాలు తత్వవేత్తల గురించి కూడా కొంత చదివి ఉండటంతో లెక్చరర్లు చెప్పే విషయం బాగా బుర్రకెక్కేది.అప్పుడప్పడూ క్లాసు రూముల్లో లెక్చరర్ల ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలకు అటు బోధకులు,ఇటు సహ శిక్షణార్థులు చాలా సంతోషపడటం 
నాకు తెలుసు. 
        ఇక్కడో చిన్న ఉదంతం చెప్పాలి.ఉష వాళ్ల తల్లికి మేనమామ మాడుగుల వెంకటశాస్త్రి హనుమకొండలో ఉంటారు.ఆయన రిటైర్డు గజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్.మంచి విద్యా వేత్తను గాక తత్త్వశాస్త్రం మీద బాగా అవగాహన ఉన్నవారు.రమణమహర్షి,జిడ్డుకృష్ణమూర్తి,రజనీష్ వంటివారిని కలుసుకొన వారి ఉపన్యాసాలు ప్రత్యక్షంగా విని ఉన్నవారు.వారే నాకు జేకే గురించి చెప్పేవారు.చాలా సంవత్సరాలు ఆయన చెన్నైలోని అడయారు ఆశ్రమానికి వెళ్లి జేకే ప్రసంగాలు విని వచ్చేవారు. పెళ్లయిన కొత్తలో చాలా సార్లు హనుమకొండలో వాళ్లింటికి పలు సందర్భాలలో వెళ్లటం ఆయనకు నా లాగానే ముచ్చట్లు చెప్పే అలవాటుం డటం నాకు అరబిందో,జేకే,వివేకానంద మొదలైన విషయాల గురించిన అవగా హన కొంత కలిగింది.అయితే గమ్మత్తుగా నేను బియ్యెడ్ చేసినప్పుడు ఐడియలిజం,నేచురలిజం,ఎగ్జిస్టెన్షియలిజంమొదలైన వాదాల గురించి చెప్పినప్పుడు ఆయా వాదాలకు చెంది తత్త్వవేత్తల గురించి కూడా చెప్పటం జరుగుతుంది.అలా అప్పటివరకున్న తత్త్వవేత్తలతో పాటు కొత్తగా జిడ్డు కృష్ణమూర్తిని కూడా చేర్చారని ఫిలాసఫీ లెక్చరరు గోపాలరావుగారు చెప్పారు.ఆయన చాలా సిన్సియరుగా నాకాయన గురించి తెలియదు. తెలుసుకుని చెబుతాను అన్నారు.నేను ఆయనను కలిసి  జేకే గురించి సమాచారం నేనిస్తానని చెప్పి అక్కడే ఉన్న యం.వి.శాస్త్రి( ఉష వాళ్ల తాతయ్య) దగ్గర కూర్చొని నోట్స్ తయారు చేసి ఇచ్చాను.ఆయన సంతోషించడ నాకో పీరియడ్ తీసుకునే అవకాశం కల్పించారు.వారి సహృదయతకు నా జోహార్ల.ఇదిగో నేను వాటినే కార్యకారణ సంబందాలుగా పేర్కొంటాను.
   వవవ.   వ.    ఇదంతా చూసి నాకు నా సన్నిహిత మిత్ర వర్గం అప్పట్లో పెట్టిన నిక్ నేమ్ ఏమిటో తెలుసా ? ‘ప్రొఫెసర్’.అదో సరదా.ఇక  లెక్కలు,సైన్సు గురించి కూడా కొంత అదనపు అనుభవం నాకు నా సర్సిల్క్ ఉద్యోగం వల్ల ఏర్పడింది. మరో విషయం విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా నాకు నా ట్యుటోరియల్ కాలేజీలో అనుభవమే. అలాగే రికార్డ్‌లా ప్రిపరేషన్ గురించిన అవగాహన కూడా మా శ్రీమతి బియ్యెడ్ ట్రెయినింగ్ పుణ్యమా అని తెలుసు.మరో 
ముఖ్యమైన పాయింట్ .మాకు అప్పుడు మాత్రం బియ్యెడ్ టీచింగంతా ఆంగ్లమా ధ్యమంలోనే జరిగేది. టెక్స్ట్ పుస్తకాలు ఇంగ్లీషులోనే ఉండేవి. పరీక్షలు రాయటం మాత్రం ఐచ్ఛికం.డిగ్రీ దాకా తెలుగు మీడియం చదివి వచ్చిన విద్యార్థులకు అదికూడా కొంత ఆటంకం
గానే ఉండేది.నాకు మా కంపెనీ మిత్రుల వల్ల ఆ బెరుకు పోయి మంచి డ్రాఫ్టింగ్అలవాటు అయి ఉన్నందువల్ల బాగా ఉపకరించింది. నేను ఆంగ్ల మాధ్యమం లోనే పరీక్షలు రాశాను. To be very frank  టెక్ట్స్ బుక్స్ గాని నోట్స్ గాని పెద్దగా చదవలేదు.ఏదో తిరగేసి వాణ్ంతే.అందుకే ప్రతి పరీక్షకు బ్లాంక్ మైండ్ తో పోయి మినిమమ్ నలభై పేజీల దాకా సమాధానాలు రాసింది మాత్రం నిజం.నా జీవితంలో నేను అబద్ధమాడకున్నా అబద్ధాలకోరునని మిత్రులనుకునే అవకాశం నా పరీక్షలు 
కలిపించాయి.పరీక్షకు ముందు మిత్రులడిగే వారు బాగా చదివారా అని.నేను చదవకుండా చదివానని అనలేక ఏం చదవలేదు అనేవాణ్ని.తీరా పరీక్షహాలుకు వెళ్లిన తరువాత దించిన తల ఎత్తకుండా మూడు గంటల సేపు రాయడం చూచి చదవకుండా ఎలా రాస్తాడు అనుకునే వారు. కాని అవగాహన కలిగి ఉంటే జవాబులు రాయడం లోని సౌలభ్యం వారికి నేనెలా చెప్పగలను.ప్రశ్న చూడగానే జవాబు దానంతటదే ధారగా వచ్చేది.ఇదిగో ఇప్పుడు ఈ ముచ్చట్లు రాస్తున్నట్టే.ఏది ఏమయితేనేం సంతృప్తికరంగా పరీక్షలు రాశానని మాత్రం చెప్పగలను .పాసవటం మాత్రం ఖాయం అనుకున్నాను. థియరీలో హయ్యర్ సెకండ్,ప్రాక్టికల్స్ టాప్ మార్క్స్ తో ఫస్ట్ క్లాసులో పాసవటం ఎంతో ఆనందాన్నిచ్చింది.డిగ్రీ పరీక్షల న్యూనతా భావాన్ని ఇది తొలగించింది.చూసితుండగానే తొమ్మిది పది నెలల్లోబియ్యెడ్ అవటం కాగజ్ నగర్ వచ్చిపడటం అయ్యింది.తరువాత బాలభారతి ఉద్యోగిప ఊసులు(సశేషం)