200.డా.యన్. మంగాదేవి బాలసాహిత్యపురస్కారం(రెండవ భాగం)::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.


సమయపాలన పాటించే వ్యక్తి డా.నాగభైరవ
ఆదినారాయణ గారు.అన్న సమయానికి వచ్చారు.మమ్మల్ని బాలకుటీర్ కి తీసుకు వెళ్ళారు.ప్రవేశ ద్వారం వద్ద కారు ఆగింది. కారు
దిగి ఆశ్చర్యపోయాం.యూనిఫామ్ తో ఉన్న
విద్యార్థులు రెండు వరుసలుగా నిలబడి పూలజల్లులతో స్వాగతం పలికారు.ఆ స్వాగతం
స్వీకరించి పాఠశాల రిసెప్షన్ గదిలో కూర్చున్నాం.
టీ బిస్కెట్ ఇచ్చారు. అక్కడున్న అందరూ
డా.యన్.మంగాదేవి గారి కోసం ఎదురు 
చూస్తున్నాం.అంతలో ఒకామె గది లోకి వచ్చి మమ్మల్ని పలకరించి మా ఎదురుగా కూర్చుని"మంగమ్మ కోసం మీరు ఎదురు చూస్తున్నారా?ఇంకా ఆమె రాలేదా?"అన్నారు.
ఔనన్నాం.ఆమె గలగలా నవ్వుతూ"నేనే ఆ మంగమ్మను!"అన్నారు. అవాక్కయ్యాం.వెంటనే
తేరుకుని నిలబడి నమస్కారం చేశాం.ఆ హాలులో
తిరుగుతున్న అందరు టీచర్ల లాగే ఆమె కూడా యూనిఫామ్ లో ఉన్నారు. ఆమె నిరాడంబరతకు
కలుపుగోలుతనానికి నివ్వెర పడ్డాం.ఐదు నిముషాలలో ఆమె మాకెంతో ఆప్తురాలయ్యారు.
మా అందరిలో కలిసిపోయారు. చాలా ఆశ్చర్యం
కలిగింది.సాయంత్రం గం.6 కి సభ ఆరంభమయింది. సభలో వెయ్యి మందికి పైగా
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉన్నారు.సభ 
ఒక పండగనే తలపించింది. శ్రీ వేంకటేశ్వర బాల
కుటీర్ అధ్యక్షులు శ్రీ పాలడుగు లక్ష్మణరావు,
ఎఫ్. సి.ఏ.గారు సభకు అధ్యక్షులుగా వ్యవహరించారు.మాలతీ ప్రమదా సాహితీ
పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి                 శ్రీమతి పి.సత్యవతి గారికి శ్రీ పద్మావతి మహిళా
విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీమతి
వి.దుర్గాభవాని గారి ద్వారా అందజేశారు. డా.యన్.మంగాదేవి బాలసాహిత్య పురస్కారాన్ని
గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ ఎస్.ఎం.
రఫీ గారి ద్వారా నాకందజేశారు.ప్రతిభాపల్లవం
పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి బోర్డ్
సి.ఇ.ఓ.శ్రీ జాస్తి కృష్ణ కిషోర్ గారు చి.కొత్తపల్లి
కిరణ్మయికి అందజేశారు. విద్యార్థుల మధ్య 
జరిగిన రాష్ట్ర స్థాయి సంగీత చిత్రలేఖనం పోటీల
విజేతలకు యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ రీజనల్
ప్రోగ్రాం డైరెక్టర్ డా.సయ్యద్ సాదిక్ జిలానీ గారు,
డా.తేళ్ల నళిని, డా.వెంకట్ గారలు అందజేశారు.
కార్యక్రమంలో ముఖ్య వక్తగా వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కె.శివారెడ్డి గారు, డా.యన్.మంగాదేవి గారు,కృష్ణవేణి మేడం గారు మరుద్వతి మేడం గారు,డా.నాగభైరవ ఆదినారాయణ గారు,జయశ్రీ మేడం గారలు పాల్గొన్నారు.సభ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదయింది.డిన్నర్ అయ్యాక మంగాదేవి గారికి కృతజ్ఞతలు చెప్పి హోటల్ కి బయలుదేరుతుంటే ఆమె ఎంతో ఆప్యాయంగా ' మీరు ఒరిజినల్ చిల్డ్రన్ రైటర్ !మీకే మేము థాంక్స్ చెప్పాలి ' అన్నారు.ఆ మాటకు మళ్ళీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. భార్యాభర్తలు ఇద్దరం ఆమె ఆశీస్సులు అందుకొని బసకు వచ్చేశాం.మర్నాడు ఉదయం డా.నాగభైరవ ఆదినారాయణ గారు మమ్మల్ని
రైల్వే స్టేషన్ వరకు దిగబెట్టారు.మా వల్ల మీకు
శ్రమ కలిగిందని ఆయనతో అంటే " మీరు మాకు
అతిథులు. మీరు ఆ మాటనకూడదు.అది మా
బాధ్యత! "అన్నారు. అంత మంచి మనస్తత్వం
ఆయనిది! ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ప్లాట్
ఫారం వైపు కదిలాం!(సశేషం)