201.మలుపు తిప్పే పిలుపు(మొదటి భాగం):బెలగాం భీమేశ్వరరావు,9989537835.

2015 లో రెండు బాలసాహిత్య పురస్కారాలు,
శ్రీకాకుళంలో తెలుగు రక్షణ వేదిక 
వారిచే నిర్వహించబడిన 'తెలుగు భాషాదినోత్సవ'
సందర్భంగా ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు శ్రీ
పొట్లూరి హరికృష్ణ గారి ద్వారా 'తెలుగు భాషా
భూషణ' పురస్కారం అందుకోడం నాకు ఆనందం
కలిగించడం కంటే బాధ్యతనే పెంచిందని భావించాను.అదే సంవత్సరం శ్రీ రావూరి భరద్వాజ కళాపీఠం,చిలకలూరిపేట, గుంటూరు
వారు జాతీయ బాలసాహిత్య సదస్సుకు
పిలిచారు.ఆ సదస్సులో ' బాలసాహిత్యాభివృద్ధికి
సూచనలు 'అనే అంశంపై జరిగిన సమావేశానికి
అధ్యక్షత వహించడం,పత్రసమర్పణ చేయడం
జరిగింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పరిశోధన నిమిత్తం శ్రీ ఎం.సింహాచలం నాయుడు అనే పరిశోధక విద్యార్థి
వచ్చి నా రచనలు తీసుకు వెళ్ళారు.అక్కడ
నా రచనలను వచన సాహిత్యం, గేయ సాహిత్యం
అనే రెండు విభాగాలుగా విభజించి వచన సాహిత్యమనిపించదగిన కథలు,నవలలు,జీవిత
చరిత్రలు,నాటికలు, వ్యాసాలను ఎం.సింహాచలం
నాయుడు గారికి, గేయాలను గేయకథలను 
పద్యాలను మరొక పరిశోధన విద్యార్ధి శ్రీ చింతల
రమేష్ గారికి అప్పజెప్పారు.ఈ సంఘటనలన్నీ
నన్ను ప్రోత్సహించాయి.2015 డిశంబరు రెండవ
వారంలో పార్వతీపురం లో ఉన్న జట్టు భావ సమాఖ్య వ్యవస్థాపకులు శ్రీ డి.పారినాయుడు గారు ఫోన్ చేసి" ఒక పుస్తకం మీచే రాయించాలను
కుంటున్నాం, తోటపల్లిలో ఉన్న అనుబంధ సంస్థకు
మీరొస్తే వివరాలు మాట్లాడుకుందా"మని కోరారు.
వెళ్లి ఆయనను కలిశాను.తోటపల్లి మాష్టారి 
స్వగ్రామం. అక్కడ జట్టుకు అనుబంధంగా
ప్రకృతి ఆది దేవో భవ పేరుతో ఒక ప్రయోగ 
వ్యవసాయ క్షేత్రాన్ని అక్కడ నెలకొల్పారు.ఆయన ఆలోచనల నుంచి పుట్టిన ' అన్నపూర్ణ అర యెకరా
పంటల నమూనా ' ప్రయోగశాల అది! జాతీయ
అంతర్జాతీయ స్థాయిలో ఆ నమూనా గుర్తింపు
పొందింది. ఆ నమూనా నేపథ్యంలో బాలల కోసం
రైతుల కోసం ఒక నవల రాయమని పారినాయుడు గారు కోరారు.నేను అయోమయంలో పడ్డాను.వ్యవసాయంతో
నాకంతగా పరిచయం లేదని అన్నాను.(సశేషం)