226.మా ఇంటి దేవతలకు పురస్కారం::--బెలగాం భీమేశ్వరరావు,9989537835.

 శ్రీ రావి రంగారావు సాహిత్య పీఠం, గుంటూరు వారు జనరంజక కవి ప్రతిభా పురస్కారాల కోసం
పుస్తకాలను ఆహ్వానించారు. కవిత్వం తో పాటు
బాలగేయ సంపుటిలను కూడా ఆహ్వానించారు.
ఆ పురస్కారం కోసం నేను 2017లో విశాలాంధ్ర
వారు ప్రచురించిన 'మా ఇంటి దేవతలు' బాలగేయ
సంపుటిని 2019 జనరంజక కవి ప్రతిభా పురస్కారానికి పంపించాను.పురస్కారానికి అది ఎంపికయింది.పురస్కారం తీసుకోడానికి ఫిబ్రవరి 11న గుంటూరు రమ్మన్నారు.
పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ కవి
శ్రీ సిరికి స్వామినాయుడు గారి పుస్తకం "మట్టిరంగు బొమ్మలు" కూడా  కవితాసంపుటిల
విభాగంలో జనరంజక కవి ప్రతిభా పురస్కారానికి
ఎంపికయింది. ఇద్దరం కలిసి పురస్కారాలందు
కోడానికి వెళ్ళాలనుకున్నాం.అనివార్య కారణాల
వల్ల సిరికి స్వామినాయుడు గారు రాలేకపోయారు.నేనొక్కడినే వెళ్ళాను. ఫిబ్రవరి 11
ఉదయం గుంటూరు చేరాను.బస ఏర్పాటు చేసిన
హోటల్ కి చేరాను.నేను వెళ్ళిన తరువాత కొంత
సేపటికి గణేష్ పత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు
సత్యనారాయణ గుప్తా గారు వచ్చారు.ఆయన 
ఆనాడు జరగబోయే పురస్కార ప్రదానోత్సవ
కార్యక్రమానికి ప్రత్యేక అతిథి! ఆ తరువాత మరి
కొంత సేపటికి సభానిర్వాహకులు శ్రీ వడలి రాధాకృష్ణ గారు వచ్చారు. ఆయన ప్రముఖ
కథారచయిత!ఆ ఇద్దరితో మాట్లాడుతుండగా
పురస్కార ప్రదాత డా.రావి రంగారావు గారు
వచ్చారు.బాధ్యతగా హోటల్ సదుపాయాలు
గూర్చి అడిగి తెలుసుకున్నారు. చక్కని ఆతిథ్య
మిచ్చారు.సాయంత్రం సభకు వచ్చేయండని 
కోరారు.సాయంత్రం గం.5.00 కు బయలుదేరి
బృందావన గార్డెన్స్ , శ్రీ వేంకటేశ్వరస్వామి 
దేవాలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికకు
చేరుకున్నాం.రంగారావు గారిని కలిసి పక్కనే ఉన్న
అన్నమయ గ్రంధాలయానికి  వెళ్ళాం.చాలా పెద్ద గ్రంధాలయమది.అన్ని రంగాలకు సంబంధించిన
పుస్తకాలు కొలువై ఉన్నాయి. అందుబాటులో
ఉన్న నా పుస్తకాలు కొన్నిటిని ఇచ్చాను.మిత్రులు
సిరికి స్వామినాయుడు గారి"మట్టి రంగు బొమ్మలు"కవితా సంపుటిని కూడా అందజేశాను.
కొంత సేపు గడిపి అక్కడ నుంచి సభాప్రాంగణానికి
వచ్చాం.సభకు డా.రావి అరుణ గారు స్వాగతం
పలికారు. శ్రీ చిటిపోతు మస్తానయ్య గారు జ్యోతి
ప్రజ్వలనం చేశారు. సభాధ్యక్షులుగా డా.రావి 
రంగారావు గారు వ్యవహరించారు.ముఖ్య అతిథిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ పొట్లూరి
హరికృష్ణ గారు వచ్చారు. విశిష్ట అతిథిగా ప్రముఖ
సాహిత్య విమర్శకులు డా.పి.వి.సుబ్బారావు గారు
వచ్చారు. ప్రత్యేక అతిథిగా గణేష్ పత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా
గారు వచ్చారు. మట్టి రంగు బొమ్మలు వచన కవితల సంపుటి రచయిత శ్రీ సిరికి స్వామి నాయుడు గారు సభకు రాలేనందున ఆయన
పురస్కార మొత్తం రు.2000 లు నా ద్వారా పంపించారు. నల్ల చామంతి వచన కవితల సంపుటి రచయిత శ్రీ చిత్తలూరి సత్యనారాయణ
గారికి, సవ్వడి(గజళ్ళు)రచయిత్రి శ్రీమతి భైరి
ఇందిర గారికి , మా ఇంటి దేవతలు బాలగేయ
సంపుటి రచయిత నైన నాకు జనరంజక కవి 
ప్రతిభా పురస్కారాలందజేశారు.సభాధ్యక్షులు,
పురస్కార ప్రదాత డా.రావి రంగారావు గారు మాట్లాడుతూ ప్రజలకు అవగాహన అయ్యేలా
కవిత్వం ఉండాలని అప్పుడే ప్రజలకు చేరగలదని
ఆ దిశగా కవులను ప్రోత్సహించాలనే ఆశయంతో
జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు
చేశామన్నారు. కవిత్వం జనానికి చేరవలసిన 
అవసరాన్ని అతిధులు వివరించారు. సభానిర్వహణ శ్రీ వడలి రాధాకృష్ణ గారు చేసి ఆద్యంతం రక్తికట్టించారు.శ్రీమతి వి.ఏ.కె.సుజాత
గారి వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ
సందర్భంగా మా ఇంటి దేవతలు లోని గేయాలను
కొన్నిటిని సభలో వినిపించాను.మర్నాడు ఉదయం పార్వతీపురం బయలుదేరాను.2019 లో జనవరి నెలాఖరులో ఐ.టి.డి.ఏ.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేసిన మూడవ బావగారు రావిపల్లి నాగభూషణరావు పదవీ విరమణ చేశారు.ఆ సందర్భంగా తోణంగి ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభ జరిపి
మా బావగారిని మా చెల్లి మీరాబాయిని అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు సత్కరించారు. అక్కడ విద్యార్థుల స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది.ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా పనిచేస్తే విద్యార్థుల ఆదరాభిమానాలకు కొలతుండదనిపించింది.ఆ సంఘటన కథ రాయవలసిన అంశమనిపించింది. 2019 లో జట్టు ట్రస్ట్ వారు నిర్వహించిన ప్రకృతి
వ్యవసాయ గీతాల పోటీలో నేను రాసిన "నేలను కాపాడుదాం"అన్న గీతానికి రాష్ట్ర స్థాయి ద్వితీయ బహుమతి వచ్చింది.  (సశేషం)