227.స్వాతంత్ర్య పోరాట యోధుల గేయకథలు: బెలగాం భీమేశ్వరరావు,9989537835.

 భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన
యోధులను పిల్లలకు పరిచయం చెయ్యాలనే
ఉద్దేశ్యం తో 2016 నుంచి అపుడపుడు గేయకథలు అల్లాను.భారత దేశ తొలి స్వాతంత్య్ర పోరాటానికి జేగంట కొట్టిన ఝాన్సీ రాణి లక్ష్మీ
బాయితో ఆరంభించాను.ధీరవనిత పేరుతో 
2016 జూన్ నెల మొలక పిల్లల పత్రికలో ఝాన్సీ
లక్ష్మీ బాయి గేయకథ వచ్చింది.అది మొదలు
అప్పుడప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల 
గేయకథలు రాస్తున్నాను.ఒక పుస్తకానికి సరిపోయే
గేయకథలు రాయాలని నా సంకల్పం.2019 లో
కూడా కొన్ని గేయకథలు ఆ తరహా లోనివి వచ్చాయి.పోరాటశిఖరం పేరుతో భగత్ సింగ్
గేయకథ రాశాను.అది మే 24 అల పత్రికలో
వచ్చింది.//దాస్యవిముక్తి కొరకు/ప్రాణాలు ఒడ్డాడు/అమర వీరుల లోన/శిఖరాన నిలిచాడు//
పార్లమెంటునందు/బాంబులను విసిరాడు/ఆంగ్ల
పాలకులందు దడను కలిగించాడు//వందేమాతర
మనుచు/ఉరికంబమెక్కాడు/విప్లవానికి అతడు/
సంకేతమయ్యాడు//దేశభక్తికి అతడు/చిరునామా
అయ్యాడు/చిరస్మరణీయుడిగ/మనలోనె ఉన్నాడు//అతడి పేరును వినుము/వీర భగత్
సింగ్ రా/పోరాట బాటలకు/ఆదర్శవంతుడురా//అదే నెలలో అదే పత్రికలో 26న తెలుగు వీరుడు పేరుతో మరొక గేయకథ వచ్చింది.//మన్య ప్రాంత
ప్రజలు/పడుతున్న బాధలను/రూపు మాపగ అతడు/విల్లు చేపట్టాడు//కొండలను ఎక్కాడు/
కోనలను చుట్టాడు/గిరిజనుల నెల్లరిని/చైతన్య
పరిచాడు//మన్య సైన్యమునేమొ/తయారు చేశాడు//ఆంగ్ల పాలకులను/హడలు గొట్టించాడు//పోలీసు ఠాణాల/దాడులను చేశాడు/తుపాకు లెన్నిటినో/సమకూర్చుకున్నాడు//మన్య విప్లవాన్ని/ముమ్మరం చేశాడు/ఆంగ్ల ప్రభుత కతడు/అగ్ని
జ్వాలయ్యాడు//అదుపు చేయగ లేక/ఆంగ్లేయ
సైన్యము/దొంగ చాటున నక్కి/హతమార్చెనతడిని//స్వాతంత్ర్య కాంక్షను/రగిలించె నతడురా/గిరిజనుల కష్టాలు/తొలగించె
గలిగెరా//హతుడు ఎవరో కాదు/మన తెలుగు
వీరుడే/అతడి పేరు తెలుసుకో/అల్లూరి సీతారామరాజు//ఇంకొక గేయకథ అదే పత్రికలో
అదే నెల 31న వచ్చింది. పేరు:ధైర్యశాలి
//వట్టి మాటల వల్ల/స్వేచ్ఛ రాదన్నాడు/గట్టి దెబ్బను కొట్టి/సాధించమన్నాడు//వైస్రాయ్ ఇర్విన్/పయనించు రైలుకే/బాంబు విసిరి అతడు/తెగువ చూపించాడు//నిజమైన వీరుడిగ/
ధీరుడై నిలిచాడు/రివాల్వర్ చేపట్టి/ఎదురు తిరిగా
డతడు//పోలీసు కాల్పుల్లో/ఒడలు చిల్లులు పడగ/పగతురకు చిక్కక/పేల్చుకొని ఒరిగాడు//
చంద్రశేఖర అజాదని/ఆయననె అంటారు/చావుకే
స్వాగతం/సొంతముగ పలికాడు//మరోగేయకథ
ఉక్కు మనిషి పేరుతో అదే సంవత్సరం జూన్
2న అల పత్రిక లోనే వచ్చింది.//న్యాయవాదిగ 
అతడు/కడు పేరు పొందాడు/స్వాతంత్ర్య సిద్ధికై/
తన వృత్తి నొదిలాడు//ఉద్యమాలకు అతడు/
ఊపిరిని పోశాడు/కార్యదీక్షను పూని/ధీరుడే
అయ్యాడు//స్వాతంత్ర్య మొచ్చాక/ఉప ప్రధాని అయ్యాడు/సంస్థానాలన్నిటిని/భారత్ లో కలిపాడు//దేశ సమైక్యత నతడు/సాధించగలిగాడు/ఉక్కుమనిషిగ అతడు/అనిపించుకున్నాడు//దేశ సమగ్రత కతడు/
నిలువెత్తు చిహ్నం/వల్లభాయ్ పటేల్/అతడి
నామధేయం//ఇలాంటి గేయకథలు పాతిక
వరకు రాశాను.మరికొందరివి రాయవలసి ఉంది.
పిల్లలకు ఆనాటి నాయకుల త్యాగాలు, సాహసాలు,వారి నిష్కళంక దేశభక్తి తెలియవలసిన అవసరముందని భావిస్తున్నాను.
(సశేషం)