ఉపాధ్యాయపర్వం-24: రామ్మోహన్ రావు తుమ్మూరి


             ఒక పని జరగడానికి అనేక హేతువులుంటాయి.అలాగే జరగక పోవడానికి కూడా.దాన్నే మన వాళ్లు కాలం కలిసి రావడం అని అంటూం టారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెత.
ఆ డి.ఎస్.సీ.లో అందరికి రూ.390/-
కన్సాలిడేటెడ్ పోస్టింగులు వచ్చి రెండేళ్ల తరువాత బేసిక్ పే స్థిరపడితే నా విషయంలో గమ్మత్తు జరిగింది. అందరిలాగా కాకుండా నాకు అడహాక్ పోస్ట్ అపాయింట్ మెంట్ వచ్చి ఆ తరువాత చిన్న ప్రయత్నంతో బ్యాక్లాగ్ పోస్టు దొరికి డైరెక్టుగా స్కేలుపోస్ట్ వచ్చింది.అయితే దీని వెనుక చాంతాడంత కథ ఉన్నది.ఎందరో సహృదయుల తోడ్పాటు ఉన్నది. అదంతా మీతో పంచుకుంటే నాకు సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు
మరొక్కసారి ఫేస్ బుక్ ద్వారా తెలియ జెప్పినట్లవుతుంది.మనిషికి అన్నిటికన్నా కృతజ్ఞత చాలా అవసరం.నాకు శ్లోకం తెలియదు కాని మా తిరుమల శ్రీనివాసాచార్య గారు చాలా సార్లు రామాయణ శ్లోకం చదివి కృతజ్ఞత ఎంత గొప్పదో చెప్పటం విన్నాను. ఇప్పుడు మళ్లీ ఇంటర్వూ జరిగిన సందర్భానికి వెళదాం.
       క్రితం ఎపిసోడ్ లో ఎంప్లాయ్ మెంట్ ఆఫీసు గురించి మా పెండ్యాల మధుసూదన్ మామగారి గురించి కొంత చెప్పటం జరిగింది.అందులో ఆయన చేసిన సహాయం గురించి చెప్పాను కానీ 
ఆయన గురించి చెప్పలేదు.ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి అని మీరడగవచ్చు. నేను చెప్పేదంతా చదివిన తరువాత మీరు ఆశ్చర్య పోతారు.అవును.ఆయన బంధు మిత్రులందరికీ కొరకరాన కొయ్య. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఉండి కూడా ఎవరికీ,చివరికి తన స్వంత పిల్లలకు కూడా గవర్నమెంటు ఉద్యోగం ఇప్పించలేదు.ఏనాడూ ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడం మాట అటుంచి చాయకూడా తాగలేదు.తోటి ఉద్యోగులకు ఆయన అంటే పడేది కాదు.రూల్స్ వ్యతిరేకంగా ఏ పనీ చేయనిచ్చేవాడు కాదు.మినిస్టర్ల రెకమెండేషనలను కూడా ఖాతరు చేసేవాడు కాదు.నిజాయితీ నిఖార్సైన రూపం అంటే ఆయనే.పాపం ఆయన అనుభవాలను రిటైర్మెంట్ తరువాత పుస్తక రూపంలో తీసుకురావాల నుకున్నారు.ఇంగ్లీషులో రాసిన నోట్స్ నాకు చూపించారొకసారి. కలెక్టర్లను, అనేక మంది జిల్లా అధికారులను ఎదిరించి జీవితమంతా ఎవరూ మెచ్చని మనిషిగా గడిపారు. నిజాయితీగా ఉండటం అంటాం కానీ 
ఆయనను చూసిన తరువాత అది ఎంత కత్తి మీది సామో అర్థమయింది. కానీ అదెంత తృప్తినిస్తుందో నా ఉద్యోగ జీవితం లో నేను చవి చూశాను.నాది సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ కనుక అదే తత్త్వం నాకు మంచి గుర్తింపునిచ్చింది.
ఆ విషయంలో నాకు ఆయన ఆదర్శం.
ఆయన వల్ల మేలు పొందిన అర్హులైన 
అభ్యర్థులకు ఆయన ఎవరో  తెలిసే అవకాశం లేదు.ఆయన ప్రముఖ పాత్రికేయులు పెండ్యాల వామన్ రావుగారి స్వంత తమ్ముడు.చరిత్రకెక్కని మహనీయుల్లో పెండ్యాల మధుసూదన్ రావు ఒకరు అని చెప్పే అవకాశం నాకు ఇన్ని రోజులకు లభించింది.
          ఇక నా ఇంటర్వ్యూ సంగతి. 1988 నవంబరు నెలలో అనుకుంటా ఇంటర్వ్యూ ఉందని ఎలిజిబుల్ క్యాండెట్స్ పిలుపు వచ్చింది.అందరితో  పాటు నాకు వచ్చింది.
ఇప్పటిలాగా కాకుండా అప్పుడ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన వారికే ఉద్యోగాలు వస్తాయి.అందులో రిజర్వేషన్లు కూడా ఉన్నాయేమో తెలీదు.మన భవిష్యత్తు మన తెలివితే టలకన్నా వారి నిర్ణయం మీదనే ఆధారపడి ఉండటం కాదనలేని సత్యం. నాకు చూడబోతే ఆ డిఎస్సీ తప్పితే జీవితంలో ఇక మళ్లీ అవకాశం లేదు.ఎలా జరిగితే అలా జరుగు తుందని ఉన్నా. కాకపోతే నా విషయం తెలిసిన మిత్రుడు ఇంట్లో కూచుంట ఉద్యోగమెట్ల వస్తది.ఏదైనా ప్రయత్నం చెయ్యక పోతే ఎట్లా.కనీసం నీ సంగతి వాళ్లకు తెలియాలికదా  అని అన్నారు.
జెడ్పీ ఛైర్మన్ కు నీ పరిస్థితి తెలిస్తే ఉపయోగం ఉండవచ్చు.
నిజమే కాని ఆయనకు నా గురించి ఎవరు చెబుతారు.నా కెవ్వరు తెలియదు అన్నాను.అప్పుడాయన ఒక మార్గం చెప్పారు.ఆయన మిత్రునికి స్థానికంగా ఉన్న డాక్టరు ఒకాయన మంచి మిత్రులు.ఆ డాక్టరు గారికి ఛైర్మన్ గారు సన్నిహితులు.కనుక ప్రయత్నం చేసి చూద్దాం.అని నన్ను తన మిత్రుని దగ్గరకు తీసుకున వెళ్లి నా పరిస్థితి చెప్పి, ఆయననను ఒప్పించిన డాక్టరుగారికి చెప్పించారు.ఢాక్టరు గారు కూడా సహృదయంతో స్పందించి జెడ్పీ ఛైర్మన్ ఒకటి రెండు రోజుల్లో ఇక్కడి వచ్చేదుంది ఆయన వచ్చినపుడు ననిన్ను పిలిపించ నీ గురించి నీ మింగరే ఆయనకు నీ పరిస్థితి వివరించి అవకాశం ఉంటే సహాయం చేయమని చెబుతాను. అన్నారు. అన్నచ్లుగానే ఛైర్మన్ గారు వచ్చిన రోజున పరిస్థితి వివరించారు. ఆయన చూద్దాం అన్నారు.
సరే సెలెక్షన్ కమిటీలో మరో సభ్యుడు 
మా క్లాస్ మేటుకు పరిచయం అట. నాక్లాస్ అప్పటికే సీనియర్ టీచరు అనుకోకుండ అదే సమయానికి కాగజ్నగర్ లో జరిగే నృత్యంతో శిక్షణా కార్యక్రమానికి వచ్చాడు.నన్ను కలవడానికి వచ్చినపుడ నా విషయం తెలిసి నేను ఆ కమిటీ సభ్యునికి చెబుతాను అన్నాడు.ఏదీ నేను అనుకునేద కాదు.నా ప్రమేయం నామ మాత్రంగానే ఉన్నా దైవం మీద భారం వేసి ఇంటర్వ్యూకు వెళ్లాను.మొదట వెళ్లిన వారు బయటకు రాగానే వాళ్లను అందరూ అడగటం మొదలు పెట్టారు
ఏమడుగుతున్నారని.వాళ్లంతా చెప్పిన విషయం ఏమిటంటే సబ్జెక్టు ప్రశ్నలు ఫర్వా లేదు డిఇఓ గారు ఏదైనా పద్యం చదవమంటున్నాడు పద్యాలెవడికి గుర్తుంటాయిరా అని పద్యాలు చదవలేక బయటకు వచ్చిన వాళ్లు బాధపడుతున్నారు.ఇంతలో నా గురించి తెలిసిన వాళ్లు గబగబా వచ్చి ఒకపద్యం చెప్పండి ఏదైనా ఈలోగా బట్టీ పడతాం అని వేమన పద్యమో సమతా పద్యమో రాసుకుని వెళ్లారు.నాకు పద్యం అడుగుతున్నారనగా సగం బలం వచ్చింది.అమ్మయ్య ఫరవాలేదు. అనుకున్నా.మొత్తానికి వాళ్లడిగిన సైన్సు ప్రశ్నలకు జవాబిచ్చాను.పద్యం కూడా చదివాను. ఇంటర్వ్యూ పరంగా నాకు తృప్తి ఉన్నా అదొక్కటే  కాదు కదా!(సశేషం)