ఉపాధ్యాయపర్వము-29: రామ్మోహన్ రావు తుమ్మూరి

 SSC పరీక్షల వాల్యుయేషన్ కాగానే ఒంటిపూటబళ్లు ,స్కూలు వార్షిక పరీక్షలు. అవి కాగానే ఎండాకాలం సెలవులు మొదలయ్యాయి.అమ్మయ్య . కాగజ్ నగర్ వచ్చి పడ్డాను.మళ్లీ జూన్లో బళ్లు తెరిచేదాకా పురస్తు.ఉద్యోగం బాగానే ఉంది కాని చాలా దూరం.ఎంత లేదన్నా 180 కిలోమీటర్లు. రావడం పోవడం ఇబ్బంది.సరే అన్నీ కావాలనుకుంటే ఎలా తప్పదులే కొన్నాళ్లు అనుకున్నాను.

       అయితే సెలవులకు ముందొకసారి కాగజ్ నగర్ వచ్చినపుడు ఓ గమ్మత్తు జరిగింది.ఆ రోజు కూరగాయలకని మార్కెట్ కు వెళుతున్నాను.తొవ్వలో మురళీధర్ సార్ కలిసారు.కుశల ప్రశ్నల తరువాత ఆయన ఓ తియ్యని కబురు నా చెవులో వేశారు.అదేమిటంటే కాగజ్ నగర్ జెడ్పీలో ఒక టీచరు ఆదిలాబాద్ ఏరియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు.మ్యూచువల్ ట్రై చేయండి అని.ఆయన పేరు సనావుల్లాఖాన్. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మస్జిద్ లో ఉంటున్నారు.వెంటనే కలవండి అని కూడా చెప్పారు. సారుకు ధన్యవాదాలు చెప్పి కూరగాయలు ఇంట్లో పడేసి సైకిలందుకుని మస్జిద్ కు వెళ్లాను. ఆయన్ని కలిసి నా వివరాలు చెప్పి నేను మ్యూచువల్ ఇస్తాను.అని చెప్పగానే ఆయన సరే అన్నారు.మరునాడు వాళ్ల స్కూలుకు వెళ్లి వాళ్ల హెడ్ మాస్టర్ సుగుణాకర్ రావు సారును కలిసాను.ఆయన మా సర్సిల్క్ కొలీగ్ లక్ష్మణరావు గారి తమ్ముడు.నా బియ్యెడ్ అప్లికేషన్ మీద అటెస్టేషన్ రెండు సార్లు ఆయనే చేశారు.వాళ్ల అబ్బాయిలు మా మేడం వాళ్ల స్టూడెంట్స్.ఆయనకు సనావుల్లాగారి విషయం చెప్పి మీరు ఒప్పుకంటే మేము ట్రై చేసుకుంటాం అన్నాను.అందుకు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు.అలా అప్లికేషన్ ఫార్వర్డ్ చేయించి కప్పర్లకు వెళ్లగాన మా హఫీజ్ సారుకు చెప్తే ఆయన కూడా ఆమోదించారు.అలా సెలవులకు ముందే తతంగం జరిగింది.

ముందు మురళీధర్ సార్ గురించి చెప్పాలె(సశేషం)