కొత్త సంసారం లాగా కొత్తబడి అనే సరికి అన్నీ కావలిసిందే.గంట దగ్గరినుంచి మొదలుపెడితే గడియారం దాకా అన్నీ ఏర్పరచుకోవలసిందే.అడ్మిషన్ రిజిస్టరు,ఫీజు రిజిస్టరు, స్కాలర్ షిప్ రిజిస్టరు,మార్కుల రిజిస్టరు,లైబ్రరీ,పూర్ ఫండ్,నోటీసు ఇలా అనేక రిజిష్టర్లు పెట్టి వాటిలో ఎంట్రీలు చేయించే వారు.ఒకటి నా రాత బాగుంటుందని,రెండవది నాకు పని తెలుస్తందని నా చేతనే రాయించేవారు.ఒక్క పేబిల్ రిజిస్టరు మాత్రం H.M. గారు చూసుకునే వారు.ఆమెకు కొత్తే అయినా మేడం వాళ్ల సారు కాలేజీ ప్రివ్సిపాలు కావడంతో ఆయన సహకారంతో ఆమె ఆ పని చూసుకునేవారు. ఇవి కాకుండా శ్రీనివాసరావు సారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్లాన్ చేసేవారు.టీచర్స్ డే నాడు సెల్ఫ్ గవర్నమెంటు డే,పంద్రాగస్టు,ఛబ్బీస్ జనవరి దేశభక్తి గీతాలుమొదలైనవి.స్కూల్ డేకు డ్యాన్సులు చేయించటం ఇలా చాలా చేయించే వారు.ఆయన సారథి గానే ఉంటూ నాతో యుద్ధం చేయించే వారు.స్కూల్లో మైకు కోసం నన్ను హైదరాబాదు పంపి ఆహుజా పబ్లిక్ అడ్రస్ సిస్టం తెప్పించారు.ఇది స్కూలు సంగతి ఐతే సాహిత్య విషయంలో కూడా మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుతున్న వాళ్లం.పద్యాలు రాయడానిక ప్రేరణ కూడా ఆయనే.ఏదో సమస్య ఇచ్చి దాన్ని పూరించమనే వారు. అలా ఓ ఉపాధ్యాయ దినం సందర్భంగా వారం రోజుల ముందే పాటరాయమన్నారు.అప్పుడు రాసిన గేయంవందనం గురువర్యులకుఅభివందనం ఆచార్య వరులకుసుందరోపాధ్యాయ దిన సం-దర్భమున శుభ వందనంఅందముగ అఆ లు నేర్పీపొందిక ఎక్కాలు నేర్పీఆటలూ పాటలను నేర్పినఆర్యులకు అభివందనంరమ్యముగ రాయుటను నేర్పీముచ్చటగ మాటాడనేర్పీనీతులూ నియమములు నేర్పినగురువులకు ప్రియవందనంచక్కగా శాస్త్రముల నేర్పీబహుళముగ భాషలను నేర్పీచదువు సంస్కారములు నేర్పినఒజ్జలకు గురువందనంఅని రాసి చూపిస్తే చాలా సంతోషపడిపిల్లలచేత పాడించారు. కాగజ్ నగర్ తెలుగు సాహితీ సదస్సు లో చేరి సమావేశాలకు హాజరవటం ఆ స్కూల్లో పని చేసినంత కాలం బాగా కలిసి తిరిగాం.ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తీర్చి దిద్దిన వారిలో వారొకరు.మిగతా లేడీ టీచర్సందరికీ నేనంటే అదరమే.చిన్న చిన్న తగవులు వచ్చినా అవన్నీ తాటాకు మంటలే.ఎనిమిదేళ్ల తరువాత నాకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది.ఆదే స్కూల్లో S.A.కంటిన్యూ అయే అవకాశం వచ్చినట్లే వచ్చి తప్పి పోయింది.అయ్యో అని బాధపడ్డాను కాని అదీ మన మంచికే అని రాస్పల్లికిఅప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరుగా వెళ్లిన తరువాత అర్థమయింది.ఇంత చేసిన శ్రీనివాసరావు సారు అంతం విషాదాంతమవటమే ఇప్పటికీ దీర్ణించకోలేని విషయం(సశేషం)
ఉపాధ్యాయపర్వము-34: - రామ్మోహన్ రావు తుమ్మూరి