ఉపాధ్యాయపర్వం-36: రామ్మోహన్ రావు తుమ్మూరి

 
రాస్పల్లికి పోయే ముందు ఒకటి రెండు ముచట్లు ఈ బడి గురించి చెప్పి అక్కడి  విషయానికి వెళదాం.ఈ రోజు క్రిస్మస్ గనుక ఆ స్కూల్‌లో పనిచేసిన సౌభాగ్య తిలక టీచరుగా మొదలు పెడతాను.
నేను చూచిన వేల మందిలో నెమ్మదిని మనిషి అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి ఆమె.నోటినుండి వచ్చిందీ రానిదీ తెలిసేది కాదు.ముఖం మీద మోనాలిసా నవ్వు.స్పష్టాస్పష్టంగా ఉండే ఆ నవ్వు సంతరించుకోవాలంటే ఏ వ్యక్తినీ కలలో సైతం ద్వేషించకుండా ఉండాలి.మోనాలిసా అంటే గుర్తుకు వచ్చింది.నా ప్యారిస్ ట్రిప్ లో లియొనార్డో డావిన్సీ గీచిన ఒరిజినల్ మోనాలిసా గీచిన ప్రపంచ ప్రసిద్ధ తైలవర్ణ చిత్ర సందర్శన సన్నివేశం ఒక్కసారిగా కనుల ముందు కదలాడింది.నెపోలియన్ బోనపార్టే నివసించిన రాజభవనం లూవర్ మ్యూజియంగా రూపొందించారు.అందులో అనేక పాలరాతి శిల్పాలు నెపోలియన్ దర్బారు వగైరా చాలా ఉన్నాయి.వాటన్నిటితో పాటు ఒక హాలులో మోనాలిసా మాతృక చిత్రపటం ఉంది.మామూలు మన ఫోటో సైజులో ఉంది.చాంతాడంత క్యూ .మన తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం లాగే అక్కడ ఎక్కువ సేపు నిలబడటానికి లేదు.కార్యకర్తలు మర్యాదగా ముందుకు కదలండని సైగలు చేస్తుంటారు.అది కూడా ఒక కేసులో పెట్టబడి ఉంటుంది.రెండు నిమిషాల్లో ఆ చిత్రం గొప్పదనం చూడాలంటే కుదరదు.అందులో అక్కడ సెల్ఫీలు దిగాలన్న ఆత్రుత.నాకదీ కుదరలేదు.కాని ఒక్క చూపు ఆ చిత్రం వైపు చూడగలిగాను తదేకంగా.అదో అద్భుతం.అది నవ్వు అవునా కాదా !ఇప్పటికీ ప్రపంచానికి సందేహమే.కాని ఒక నిశ్చల నిర్మోహ,నిరాడంబర దృక్కు కనిపిస్తుంది.
        అదిగో అలాంటి వ్యక్తి ఆమే.ఆమె కాగజ్ నగర్ సీనియర్ టీచర్ ఐజక్ సారు కోడలు.ఐజక్ సారును చూస్తే మనుషులను మనఃపూర్వకంగా ప్రేమించే వాళ్లకు ఉదాహరణగా కనిపిస్తారు.భూతద్దం తో చూచినా ఎక్కడా ద్వేషం గానీ ఈసూ అసూయలు గానీ కనిపించవు.పోనీ మనిషి సుందరుడా ! కాకపోవచ్చు బక్క చిక్కిన 
నలుపు రంగు ముదుసలి.కాని ఆయన మాట తీపి.మనసు వెన్న.మమత వెన్నెల.ఆ సౌందర్యం ఆత్మగత సౌందర్యం.దాని ముందు దేహ సౌందర్యం నిలబడదు.ఎన్నో సార్లు ఇంటికి పిలిస్తే వెళ్లాము అందరం.ఏండ్లు గడచినా ఆ కుటుంబం కురిపించిన ప్రేమ జల్లు తడి ఇంకా ఆరిపోలేదు.నిఖార్సైన క్రిస్టియన్.
 తండ్రికి తగ్గ తనయుడు మా టీచరు వాళ్ల భర్త.టీచరు వాళ్ల మరిది పెళ్లి నిశ్చయమైన సందర్భంగా వెళ్లామొక సారి.ఫంక్షన్ లో పాల్గొన్న సన్నివేశం మరచి పోలేక పోవడానిక కారణం ఆత్మీయత.ఇక్కడితో ఆపేయగలిగితే చాలా సంతోషించే వాణ్ని.ఆమె ఉంటే మొన్న మొన్న నే రిటైరయి ఉండే వారేమో.మంచి వారిని తొందరగా తీసికెళతాడెందుకో దేవుడు.ఏదో అనారోగ్యంతో సౌభాగ్య తిలక పై లోకానికి వెళ్లిందన్న వార్త చాలా ఏండ్ల క్రిందటిదే కావచ్చు .కాని ఇప్పటికీ బాధాకరం.
ఆమెన్.
      కాని గోయింగ్ పర్సన్ ఆ టీచరు.ఆమె నుంచి నేను ఏమి నేర్చుకున్నానో ఏమో తెలియదు కాని మనిషి ఉందో లేదో అన్నట్టుగ తనపని తాను చేసుకుని పోయే కర్తవ్య పరాయణి.ఈ క్రిస్మస్ రోజు రెండు దశాబ్దాల తరువాత ఆమెకు మరొక్క సారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
(సశేషం)