ఉపాధ్యాయపర్వం-37: రామ్మోహన్ రావు , తుమ్మూరి


 పౌనూరు బదిలీ ఆర్డర్ మీదనే నన్ను ZPSS Girls నుండి రిలీవ్ చేశారు.ఆ ఆర్డరు పట్టుకుని ఆదిలాబాదు వెళ్లి రాస్పల్లి కి మార్పించుకుని రావడంలో ఓ వారం రోజులు త్రిశంకు స్వర్గంలో ఉన్నాను.ఎట్టకేలకు ఆర్డరు కాగజ్ నగర్ మండలాఫీసులో MPDO ఆఫీసులో చూపించి అక్కడి నుండి రాస్పల్లి కి వెళ్లే సరికి నాలుగు దాటింది.వర్షాకాలం కావడం,అదీకాక అది అప్పర్ ప్రైమరీ స్కూలు ఛుట్టీ గంట కొట్టేసారు.అక్కడ ఆరోజు ఇంచార్జ్ H.M.గా మాలతి టీచరున్నారు.బయలు దేరడానికి సిద్దమైన వాళ్లు నన్ను చూడగానే రండి రండి అంటూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు.H.M.విజయకుమార్ సార్ ఆ రోజు రాలేదో లేక అంతకు ముందే మేడం కు ఛార్జ్ అప్పజెప్పి రిలీవయ్యారో గుర్తు లేదు.మొత్తానికి నేనే సెల్ఫ్ జాయినింగ్ అయి వెంటనే బయలు దేరాను.ఆ ఊరును సరస్వతి మేడం ఎందుకు వద్దని క్యాన్సిల్ చేసుకున్నారో అర్థమయింది.బస్టాండునుండి ఊళ్లోకి ఓ కిలోమీటరు దూరముంటుంది.అది పల్లెటూళ్లలో సహజమే.కాని రాస్పల్లి ఊళ్లోకి వెళ్లాలంటే ఓ వాగుదాటాలి.అది తప్ప వేరే మార్గం లేదు.వర్షాకాలం వచ్చిందంట తక్కువలో తక్కువ మోకాళ్లు దాటే వరద.మొగవాళ్లు ప్యాంట్లు మీదికి లాక్కొని దాటుతారు సరే.ఆడవాళ్లకు చాలా ఇబ్బంది.దానికి తోడు మోకాళ్ల నొప్పులు వంటివి ఉంటే ఇక నరకమే.ఆ ఊరు డెవలప్ కాకపోవడానికి సగం ఆ వాగే కారణం.నాకైతే మళ్లీ మా మానేరు చూసినంత సంబ్రమైంది.మాలతి టీచరు నాకు ముందే పరిచయం. అందరికంటే చిన్నతమ్ముడు (నం.6)కు చదువు చెప్పిన టీచరామె.నేను రావటంతో టీచరు చాలా సంతోష పడ్డారు.కాకపోతే బడిని చూడగానే నాకు చాలా బాధనిపించింది.ఎప్పుడో తాతల కాలం నాటి రేకుల షెడ్డు.కుర్చీలు లేవు, బెంచీలు లేవు నల్లబల్ల లేవు.

అప్పుడు నాకేం పద్యం గుర్తుకు వచ్చుంటుందో మీరూహించగలరు. కరుణశ్రీ గుర్తుకు వచ్చారు. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు అని.సరే వాగు వస్తే దాటడం కష్టమని తాళాలు వేసి బస్టాండుకు బయలు దేరాం. బస్టాండులో బస్సు కోసం ఎదురు తెన్నులు.పల్లెటూరి బడి గురించి ఒక్క మాటలో చెప్పేది కాదు.ఒక్కరోజులో అయ్యేది కాదు.ముఖ్యంగా రాస్పల్లి గురించి చాలా చెప్పాలి.మెల్లగా చెబుతాను.(సశేషం)