ఉపాధ్యాయపర్వం-38: - రామ్మోహన్ రావు తుమ్మూరి


 రాస్పల్లి కాగజ్ నగర్ నుండి తూర్పు దిశలో 16  కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం.రెండు మూడు వందల ఇండ్లున్నాయనుకుంటాను.ఇప్పుడు తెలియదు గానీ 1998 లో అయితే అన్నీ గుడిసెలు,గూన పెంకుల ఇళ్లే. బస్టాండుల నుండి ఊళ్లోకి వెళ్లే దారిలో కొన్ని ఇళ్లున్నాయి.అవి దాటగానే చిన్న వాగు.వాగవతల ఎత్తు మీద రాస్పల్లి.బడి ఊరికి ఉత్తర దిశలో చివరగా ఉంది.నేను చెప్పేది ఇప్పుడున్న బడి సంగతి కాదు.పాతబడి.నేను పిరధానోపాధ్యాయుని గా చేరిన ప్రాథమికోన్నత పాఠశాల.అప్పుడు ఒకటి నుండి ఏడవ తరగతి వరకు ఉండేది.

మరునాడు బడికి వెళ్లగానే నాకు రెండు చేతులా పని దొరికిందనుకున్నాను. ఉన్నపళంగా బడిని మార్చలేమ పోయిన ఉన్నదాన్నే తీర్చి దిద్దాలనుకున్నాను.నాతోపాటు నలుగురం టీచర్లం.ఇద్దరో ముగ్గులో విద్యావలంటీర్లు.ఒక అటెండరు.నాకు గుర్తున్నంతవరకు నేను వెళ్లిన కొత్తలో స్కూలులో పిల్లల సంఖ్య నూటా యాభై లోపే.అదీ నెలనెలా ఇచ్చే బియ్యం కోసమని అర్థం అయింది.ఊళ్లో పిల్లలు లేరా? అంటే ఉన్నారు.కాని బడికి రారు.

పోనీ బడికి వస్తే చాలినన్ని తరగతి గదులున్నాయా లేవు.బెంచీలు లేవు.కింద కూచోవడమే.కాళ్లు విరిగిన పాత కుర్చీలు,బెంచీలు ఓ మూలకు ఆ రూములోనే ఉన్నాయి.స్టాఫ్ రూమదే.హెచ్చెమ్ రూమదే.అదృష్టం కొద్దీ హెచ్చెమ్ కు ఒక టేబులు కుర్చీ ఉన్నాయి. అయితే నేను పోగానే నాకు కంపరమెత్తించిన విషయం హెచ్చెమ్ కుర్చీమీద పైకప్పునుండి తాళ్లతో కట్టిన అటకలాంటి బూజుపట్టిన ఉయ్యాల .

దానినిండా ఆస్కూలు మొదలైన నాటినుండి గవర్నమెంటు సప్లై చేసిన చార్టులు.ముడితే ముప్పై కిలోల దుమ్ము 

రాలుతుంది.టీచర్ల నడిగాను.ఆ చార్టులు వాడేవేనా ? అని లేదు సార్ అవన్నీ పాడై పోయాయి.అన్నారు. మా అదృష్టం కొద్దీ ఆ స్కూలుకు అటెండరు న్నాడు. భూమయ్య అతని పేరు. పిలిచా ను .ముందా ఉయ్యాల తీసి వాకిట్లో పడేయమన్నాను.అది చంద్రబాబు నాయుడు గారి జన్మ భూమి జమానా.

జన్మభూమి కార్య క్రమం మొదలు పెట్టాను.అవన్నీ వాకిట్లో పడేసి పనికి వచ్చేవేమన్నా ఉంటే చూడండని టీచర్లకు చెప్పాను.అవును మరచిపోయాను టీచర్ల పేర్లు చెప్పలేదు కదా.ఒక్క మాలతి టీచరు గురించే చెప్పాను.ఆ టీచరు కాకుండా నా కంటే కొన్ని రోజుల ముందే జాయినయిన స్కూల్ అసిస్టెంట్ ప్రొబేషనరీ అనూరాధ మేడం,ఎసిజీటి ప్రొబేషనరీ బడుగు శ్రీనివాస్ సారు.సరే అందరం కలిసి ఉన్నంతలో బడిని కొంచెం తేట పరచుకున్నాం.పాడైపోయిన చార్టులన్నీ

పరశురామ ప్రీతి చేశాం.మొత్తానికి ఈ సారెవరో గమ్మత్తుగా ఉన్నాడే అని మాత్రం ఊరివాళ్లకు అనిపించి ఉండవచ్చు.కాని ఆ ఊరికి ఊరు ఆ తరువాత నాకు అత్యంత ప్రియంగా మార్చడానికి కొన్ని నెలలు పట్టింది.అందుకు ఆ ఊరి ప్రెసిడెంటు కమల గారి అల్లుడు గజ్జి వాసుదేవు గారు.బడిని తొవ్వకు తీసుకు రావాలన్న నా ఆసక్తికి ఆయన ఆశయం తోడైంది.(సశేషం)