ఉపాధ్యాయపర్వం-39: రామ్మోహన్ రావు తుమ్మూరి

 
ఇంతకీ బడి పూర్తి స్వరూపం మీకు చెప్పలేదు కదా.సిమెంటు రేకుల షెడ్డులో రెండు గదులు ఒక వరండా.ఈ రేకులషెడ్డును ఎప్పుడో కాగజ్ నగర్లోని పేపర్ మిల్ యాజమాన్యం వాళ్ల అవసరాలకో లేక పల్లెలోని పిల్లల చదువు కొరకో కట్టించినదని విన్నాను.అయితే దాని ప్రక్కనే ప్రభుత్వము వారు కట్టించిన ఒక పెద్దగది దాని ముందు ఒక వరండా ఉన్నాయి.రేకుల షెడ్డులో నేలంతా గచ్చుదే.కాని సర్కారు నిర్మాణం మాత్రం మట్టినేల.ఈ లోగా శుక్రవారం వచ్చింది.యధా ప్రకారంగా ఆ మట్టి నేల పెద్ద గదంతా మధ్యాహ్నం ఇంటర్వెల్ తరువాత ఆడపిల్లలు,పెండ మట్టి కలిపి అలుకటం చూశాను.ఒకందుకు సంతోషించాను.బడిని ఇంటిలాగా భావిస్తున్నారని.మరొక విధంగా బడిసమయంలో విద్య నేర్చుకునే సమయంలో ఈ పనులు చేయవలసి వస్తుందే అని బాధపడ్డాను.అయితే మరో విషయం కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు మగ పిల్లలు కూడా తోడ్పడుతున్నారు బకెట్లు తో నీళ్లు తేవడం,పేడ తీసుకురావటం, పుట్టమన్ను తేవటం.ఇంకా తెలిసిందేమిటంటే ఓ వారం ఆరవ తరగతి డ్యూటీ ఐతే మరో వారం ఏడవ తరగతి డ్యూటీ.శ్రమ విభజనకు సంతోషించాను.నేను ముఖ్యంగా గమనించిన విషయం పిల్లలందరూ ఇళ్లల్లో వ్యవసాయపు పనులకలవాటు పడ్డ వారు కనుక ఇలాంటి పనులకు వెనుక ముందాడే వారు కాదు.అంతే గాక దాదాపు పిల్లలంతా చాలా చురుకైన వాళ్లే.వాళ్లకు తగిన శిక్షణ దొరికితే సానదేరిన రత్నాలవుతారని పించింది.ఓ వారం లోపల బడి పరిసరాలను కాస్త మెరుగు పరచినా  క్లాసు రూములు సరిపోక ఇబ్బంది అనిపించింది.ఒకే గదిలో అటొక టీచరు
ఇటొక టీచరు పాఠాలు చెప్పడం కష్టమే గనుక.ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పాఠశాల కమిటీ ఛైర్మన్ తాలూకు మనిషి గజ్జి వాసుదేవు గారు వచ్చారు.విషయం చెప్పి ప్రక్కనే ఖాళీగా ఉన్న ఫారెస్ట్ డిపార్టుమెంటు కు చెందిన ఇంటిని వాడుకుంటే ఎలా ఉంటుందని అడిగాను.అందులో ఎవరూ ఉండరని తెలిసింది.అదీ గాక అది సర్కారు వారి నిర్మాణమే.పెంకుటిల్లే  అనుకోండి.సరే అవన్నీ ఊరి సర్పంచ్ అదుపాజ్ఞలలో ఉండేవే గనుక ఆయన ఒప్పుకున్నారు.
అదీ మట్టి నేలనే.సరే పిల్లల్ని పురమా యించి ఆ ఇంటిని శుభ్రం చేయించి,అలికించి తరగతి గదులకు వాడుకోవటం మొదలెట్టాము.అలా ముందు కొంత అకామొడేషన్ సమస్య ను సాధించుకోగలిగాను.ఇక తరువాత బడికి రాని పిల్లల సంగతి.
ఇదో చిత్రమైన సమస్య. పేర్లుంటాయి. రిజిస్టర్లో.పిల్లలు మాత్రం బడికి రారు.ఎప్పుడో బియ్యం ఇచ్చేముందు రెండు మూడు రోజులు తల్లులు పిల్లల్ని దిగబెట్టి పోయేవారు.అక్కడికీ మా టీచర్లు కాస్తా గట్టిగానే మందలించే వారు.ఇలా అయితే అంటే అటెండెన్స్ లేకపోతే బియ్యం ఇవ్వమని.ఎంత చెప్పినా కొంత మంది లొల్లికి దిగేవారు.
గమనించాను.ఒక నెల.ఇక ఇది పని కాదని లీజరు పీరియడ్లలో ఎవడో ఓ పిల్లడ్ని తీసుకుని ఇల్లిల్లూ తిరగటం. పిల్లల్ని సముదాయించటం,తల్లి దండ్రుల్ని పిల్లలను పంపించే విధంగా మంచి మాటలతో ఒప్పించటం.చిత్రంగా రెండు మూడు నెలల్లో మా టీచర్లంతా ఆశ్చర్య పోయే విధంగా స్ట్రెంత్ పెరిగింది.అయితే దానికి ముఖ్య కారణం మాత్రం నా శాంతి మార్గమే.ఏ రోజూ ఏ పిల్లల్ని కానీ తల్లిదండ్రుల్ని కానీప్రేమ పూర్వకంగానే పలుకరించా ను.కోపగిస్తే లాభం లేదని నాకు మొదటి నాలుగైదు రోజుల్లోనే అర్థమయింది. అసలు సగం మంది పిల్లలు బడికి రాక పోవడానికి గతంలో కొందరి చిరాకేనని తెలిసింది.సరే రెండు సమస్యలకు కొద్దో గొప్పో కొంత పరిష్కారం దొరికింది.ఇక పిల్లలకు బడి అంటే ఇష్టం ఏర్పడాలంటే ఆటలూ పాటలూ కావాలి.వాటి మీద శ్రద్ధ చూపమని మా టీచర్లకు చెప్పాను.అంతే పిల్లలు ఉత్సాహంగా బడికి రావటం గమనించాను. రాస్పల్లి పాఠశాల నా ఉపాధ్యాయ జీవితానికి ప్రయోగశాల అని చెప్పవచ్చు.(సశేషం)