ఉపాధ్యాయపర్వము-41: - రామ్మోహన్ రావు తుమ్మూరి

 బడి వాగివతల ఉంటే బాగుండేదని చెరిన రోజునుండీ నాకు మనసులో గుంజాటన.ఆ విషయం స్కూల్ కమిటీ ఛైర్మన్ గజ్జి వాసుదేవ్ గారితో చాలా సార్లు అనటం జరిగింది.బస్టాండులో గ్రామీణ బ్యాంకు ఉండేది.స్కూలుకు సంబంధించిన ఖాతా ఒకటి అందులో తెరిచాము.జాయింట్ ఖాతా.స్కూల్లకు ఏవైనా నిధులు వస్తే అందులో పడేవి.
ఆ బ్యాంకు పక్కనే బడి ఉంటే  ఉపాధ్యాయులకు  వాగు దాటే ఇబ్బంది తప్పుతుంది గదా అని .బ్యాంకు కెదురుగా పాడుబడిన రేకుల నిర్మాణం
ఉండేది.అది ఒకప్పుడు సిర్పూర్ పేపరు మిల్లు వారి గోడవున్ గా ఉండేది.దాన్ని బాగు చేయిస్తే అది వాడుకోవచ్చు గదాఅని సూచించాను.విని ఊరుకున్నాడు.కానీ ఆయన మనసులో అదో ఆలోచన ఉన్నట్టు నాకనిపించింది.ఆ ఆలోచన ఏమిటో కొంత కాలానికి గాని అర్థం కాలేదు.నా యోచనను మరో రూపంలో కార్యాచరణంలోకి తీసుకున వచ్చారు.
అదేమిటో తెలుగు సీరియల్లో సస్పెన్స్ లాగా తరువాత చెబుతాను.
ఈ లోగా మర్చిపోక ముందు మరో విషయం చెప్పాలి.బస్టాండుల గ్రామీణ బ్యాంకు ఉందని చెప్పానుగదా.ఆ బ్యాంకు మేనేజర్ గారితో మంచి పరిచయమేర్పడింది.విద్యా వలంటీర్ల జీతాలు పడ్డప్పుడు,స్కూలు ఫండ్స్ పడినప్పుడు బ్యాంకుకు వెళ్లటమే గాక 
బస్సు కోసం వెయిట్ చేసినప్పుడో, బస్సులో కలిసి ప్రయాణం చేసినప్పుడో
ఏవో కబుర్లు చెప్పుకునే వారం.నేనో హెడ్ మాస్టరును,ఆయనో బ్యాంకు మేనేజరు.అంతే.ఇద్దరమూ సాహిత్య ప్రేమికులమైనా ఆ విషయం అక్కడ ఉన్నన్ని నాళ్లు తెలియదు.కాని గమ్మత్తుగా నేను రిటైరయి,ఆయన కూడా రిటైరయి హైదరాబాదులో స్థిర పడిన తరువాత ఒక రోజు చిక్కడ పల్లిలో కలుసుకున్నాం.ఒకర్నొకరం గుర్తు పట్టి పలుకరించుకున్నాం.
 అయితే  ఆ సందర్భం ఏమిటంటే డా .సామల సదాశివ గారి మరణానంతరం నా సంపాదకత్వంలో సదాశివ స్మృతి సుధ వెలువడింది.అది కాగజ్ నగర్ లో ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆవిష్కరణ జరిగింది.ఆ పుస్తకాన్ని ఒక రోజు హైదరాబాదులో డా.జయధీర్ తిరుమల రావుగారికిచ్చాను.అది చూసి ఆయనదాన్ని హైదరాబాదులో మరోసారి విడుదల చేద్దామన్నారు.నిర్వహణ బాధ్యతంతా ఆయనే తీసుకున్నారు. ఇద్దరం కలిసి ఆహ్వాన పత్రం తయారు చేశాం.దాని ప్రింటింగుకు మేమిద్దరం చిక్కడ పల్లి సందులో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ముందు నిలబడి ఉన్నప్పుడు ఈ బ్యాంకు మేనేజర్ గారు కలిసారు.ఆయన జయధీర్ తిరుమల రావు గారికి మంచి మిత్రులన్న సంగతి నా కప్పుడు తెలిసింది.వాళ్లిద్దరూ మాట్లాడుకునే మాటల్లో మేనేజరు గారు పత్రికలకు వ్యాసాలు రాస్తారని తెలిసింది.తిరుమల రావు గారి ద్వారా మేనేజరుగారికి నా సంగతి తెలిపింది.
వృత్తి నిర్వహణలో ఉన్నప్పుడు ఎవరి దారి వారిది.అలా ఆ రోజునుంచీ చాలా సాహిత్య సమావేశాల్లో కలుసుకున్నాం.
ఆయన మంచి సాహిత్య విశ్లేషణ చేస్తూ వ్యాసాలు రాయటమే గాక ఇటీవల కథలు కూడా చాలానే రాశారు.నాకు తెలుసు ఇంతకీ ఆయన పేరు చెప్పండి అని మీరంటారని.ఆయన పేరు బి.నర్సన్.నిజం చెప్పాలంటే రాస్పల్లిలో పనిచేసినప్పుడు నాకాయన పేరు కూడా తెలీదు.జీవితంలో కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి.వారు నా పుస్తకాల మీద సమీక్షలు కూడా రాశారు.
అలా రాస్పల్లి తలచుకున్నప్పుడు ఇది కూడా ఒక మంచి యాదిగా ఉంటుంది.
 ఇక మళ్లీ రాస్పల్లి బడికి వద్దాం. వాసుదేవు గారు మంచి కార్యశీలి. ఎక్కువగా మాట్లాడరు.జంపాలపై పలికే రాజకీయ నాయకుడు కాదు.పని చేసి చూపించిన తరువాతే మాట్లాడే మనిషి.
ఓ రోజు బడికి వచ్చారు.బడి ని హైస్కూలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.దాని గురించిన వివరాలు కనక్కొమ్మన్నారు.నేను కాగజ్ నగర్ లో తెలుసుకుంటే నాకు అందరూ చింత గూడ హెడ్ మాస్టరును కలువండి.ఆ స్కూలు ఇటీవలే అప్గ్రేడయింది అన్నారు. సరే నేను అక్కడికి వెళ్లాను.అక్కడ హెడ్ మాస్టరు రాజ్ భావ్ సారు.అంతకు ముందే పరిచయం.సార్ కు విషయం చెబితే 
ఓ దానికి లంబా చౌడా ప్రొసీజరుంటుంది.చాలా కాయితాలు పెట్టి అప్లికేషను లక్సెట్టి పేట డిప్యూటీ డీ.ఇ.ఓ.కు సబ్మిట్ చేయాలన్నారు.నాకు ఒక సెట్ ఆ అప్లికేషన్ కాపీ ఈయమని అడిగాను.ఆయన వెతికి పెడతాను. మళ్లీ రమ్మనన్నారు.ఒకటికి రెండు సార్లు వెళ్లి ఆయన వెంబడి పడి ఓ సెట్ తెచ్చాను.దాదాపు ముప్పై నలభై enclosures ఉన్నాయి.ముందుగా 8th Class కోసం అప్లై చేయాలని తెలిసింది.రూ.13,500/-కట్టాలి. వాసుదేవు గారికి చెప్పాను.మీరు అప్లికేషన్ తయారు చేయండి  నేను డబ్బులు సిద్ధం చేస్తానన్నారు.చాలా తిప్పలు పడి మండలాఫీసులో ప్రసాద్ గారి సలహాలు తీసుకున అప్లికేషన్ నాలుగో ఐదో సెట్లు చేసాను. వాసుదేవన గారు డబ్బు ఇచ్చారు.తీసుకున వెళ్లి లక్సెట్టి పేటలో సబ్మిట్ చేసి వచ్చాను.ఆ సంవత్సరం  ఏడవ తరగతి పాసయిన విద్యార్థులను బయటకు వెళ్ల నీయకుండా అక్కడే ఉంచి తరగతులు ప్రారంభించాం.(సశేషం)
1.బి.నర్సన్ .