సంక్రాంతి సంబరం ...:--డా.కె.ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ _506004

 ఇది ఇప్పటి మాట కాదు ,
ఏభయి ఏళ్ళ ..
క్రితం నాటి మాట !
పక్కా పల్లెటూరిలో 
పసితనాన్ని ,
బహు సరదాగా ,
గడిపిన కాలం నాటి మాట !
నా బాల్యాన్ని ,
ఒకమారు ,
రీవైన్డ్ చేసుకుంటే ,
గుర్తుకొచ్చే ,
గొప్పరోజు ,
అదే _
జనవరిలో వచ్చే ,
పంటల పండగ రోజు !
సరదాల సంక్రాంతి రోజు !!
అప్పట్లో నాకు 
తెలీదుకానీ ,
నేను _
భోగి పండగ రోజు 
పుట్టానట !
పెద్దక్క ...
ఇదే విషయం ,
పదే ...పదే ...,
గుర్తు చెస్తుండేది నాకు !
ఎందు చేతనంటే ,
అధికారిక రికార్డుల్లో 
నేను పుట్టింది,
జూన్ నెలలో మరి !
ఇంతకీ ..నేను ,
చెప్పొచ్చేదేమిటంటే ,
సంక్రాంతి కి __అమ్మ ,
కొత్త బట్టలు 
కొట్టించేది నాకు !
అదే ,సంవత్సరానికొకమారు ,
ఆ ..బట్టల సువాసన,
బహు గమ్మత్తుగా ..
ఉండేది !
తెల్లవారిందో లేదో ,
బోగి పండుగ రోజున ,
తలంటు స్నానాలతో,
కుంకుడుకాయలరసం ,
కళ్లల్లో పడ్డ ,
పిల్లల ఏడ్పులతో,
రకరకాల,
రణగొణ ధ్వనులతో,
గ్రామమంతా ...
సందడి ..సందడిగా ,
చైతన్యవంతంగా,
వుంటుండేది !
అమ్మకు _
ఆఖరి సంతానంగా ,
నాకు _
ప్రేమతోపాటు,
అన్నీ ...
ప్రత్యేకంగానే ఉండేవి !
తలస్నానం,
కొత్తబట్టలు ,
క్షీరాన్నం ,
పిండివంటలు,
ఉన్నదాంట్లో _అమ్మ,
తృప్తిగా వండిపెట్టి,
మాలో ఆనందాన్ని,
రెట్టింపు చేసేది !!
సంక్రాంతి రోజు ,
ఊళ్లో ...పిల్లలకు ,
ఆటలపోటీలు,
పెద్దలకు _
ఊరి చివర 
వ ళ్లు గగుర్పొడిచే ,
కోడిపందాలు,
జీవితంలో ,
మరచిపోలేని,
మదుర స్మృతులు !!
అంత మాత్రమేకాదు ,
సాయంత్రం ..
గ్రామంలో,
తప్పనిసరిగా ,
యువకుల 
నాటక ప్రదర్శన,
ప్రైజులు గెలుచుకున్న 
పిల్లలకు,
బహుమతి ప్రదానం,
అతిధుల 
ఉపన్యాసాలూ ,
ఊరంతా ...
సంబరాలతో 
మారుమ్రోగిపోయేది !
ఇప్పుడు _
సంక్రాంతి ..
సంగతేమోగానీ,
గ్రామమంతా,
కొనితెచ్చుకున్న,
సంకర సంస్కృతిలో,
మునిగి తేలుతోంది !!
అటు గ్రామము కాని 
ఇటు నగరమూ కాని ,
వాతావరణంలో,
భిన్నమైన రీతుల్లో,
దిశానిర్ధేశం లేని ,
జీవన శైలిలో ,
యువత _నేడు,
ముక్కుతూ _
మూలుగుతున్నది !
అందుకే _
గతాన్ని ప్రతిక్షణం 
తలుచుకుంటూ,
మనసులోనే 
సంక్రాంతిని,
మనసారా ...
జరుపుకుంటుంటాను !
నా జన్మభూమిని ,
తనివితీరా,
తలచుకుంటూ ,
ఎదురుగా 
నిలబెట్టుకుంటుంటాను !!
అప్పుడూ,
ఇప్పుడూ ,
ఎప్పుడూ,
సంక్రాంతి అంటే 
'అమ్మ '.
కొత్తబట్టలు అంటే ,
గుర్తుకొచ్చేది ,
'అమ్మ '.
అమ్మతోనే ,నాకు 
సంక్రాంతి,
అందకుండా పొయింది !
గంగిరెద్దులానే ,
సంక్రాంతి కూడా,
కానరానిదైపోయింది !!