బాలసాహిత్యం ---59 (1)- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252

ప్రముఖ బాలసాహిత్యవేత్త డీకే చదువులు బాబు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పెద్దపసుపుల గ్రామంలో 1 జూన్ 1967 న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి దస్తగిరమ్మ, కాసీం సాహెబ్ లు. చదువులు బాబు గారు ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ తన సొంత గ్రామమైన  పెద్దపసుపుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగించారు. తన డిగ్రీ చదువు (బి.ఏ )ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివారు. టి.టి. సి ( సెకండరీ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు ) పాసై తర్వాత కాలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఇడి ట్రైనింగ్ కోర్సును పూర్తి చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎం.ఏ (తెలుగు లిటరేచర్) పూర్తిచేశారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా వైయస్సార్ కడప జిల్లా  ప్రొద్దుటూరులో పనిచేస్తున్నారు. 1986లో వీరు మొదటి రచన " బల్లి తన పాటెరుగదు" అనే బాలల కథ బొమ్మరిల్లులో ప్రచురింపబడింది.  తర్వాత కాలంలో  వీరు వ్రాసిన  బాలల కథలు 500కు పైగా వివిధ పత్రికలలో ప్రచురిత మయ్యాయి. 100కు పైగా కవితలు, గేయాలు, వ్యాసాలు,50కి పైగా కవితలు, సాంఘిక కథలు చందమామ, బొమ్మరిల్లు,  బాలమిత్ర బాలభారతి, బాలజ్యోతి, బాలభారతం, ఈనాడు, సాక్షి , ప్రజాశక్తి, వార్త ,  ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ,ఆంధ్రజ్యోతి, స్వాతి, విశాఖ సంస్కృతి, చదువు విజ్ఞానం  మొదలైన పత్రికల్లో ప్రచురిత  మయ్యాయి.  తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 6, 7 తరగతుల విద్యార్థులకు రచనలు చేశారు.465 మంది కవులు, రచయితల పరిచయాలతో కడప జిల్లా సాహితీమూర్తులు గ్రంథ రచనలో పాల్గొన్నారు. ఇక నాటకాలు విషయానికి వస్తే చిన్నారి మనసు, నేనూ బడికి పోతా, నవలోకం, మర్మలోకం, ఆకుపచ్చ ఆయుధం వంటి రచనలు చేశారు.  త్యాగశీలి, శిల్ప సుందరి, కామ రూపిణి వంటి నవలలు రాశారు. మహారాష్ట్రలోని 3, 5, 6 తరగతుల తెలుగు విద్యార్థులకు వీరిచే వ్రాయబడిన'  కనువిప్పు, పిల్లలు జాగ్రత్త, అవకాశం-- మొదలగు రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. చదువులు బాబు గారు ప్రచురించిన పుస్తకాల విషయాని కొస్తే 1. బాలల కథలు 2. విజయ రహస్యం  3. బంగారు రెక్కలు 4. అప్పు నిప్పు, 5. చిన్నారి మనసు, 6. కోతి - కొంగ, 7. కోతి - కంకణం 8. రాజన్న తెలివి 9. మాయ విసనకర్ర 10. పిల్లల స్వర్గం లాంటి 19 పుస్తకాలను ప్రచురించారు. చదువులు బాబుగారు బాలసాహిత్య సాంస్కృతిక సేవాసమితిని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు వివిధ సందర్భాలలో, సందర్భాన్ని బట్టి కథారచన, గేయ రచన, చిత్రలేఖనము మొదలగు పోటీలను  నిర్వహిస్తూ విజేతలకు బాల సాహిత్య పుస్తకాలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తున్నారు. వేసవి శిక్షణా శిబిరాలలో విద్యార్థులకు కథారచన గేయ రచనలలో శిక్షణ ఇస్తున్నారు. కడప బాల రత్నాలు పత్రికకు ఎడిటోరియల్ 
బోర్డు సభ్యుడిగా సేవలందించారు. ( సశేషం )