విస్మృతి కాని ఓ స్మృతి: రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

ఓ అందమైన నృత్యాన్నో – చిత్రాన్నో చూసినపుడు, ఓ శ్రావ్య గీతాన్ని విన్నపుడో ఎదలోని స్మృతుల కడలి కదలి వాటి అనుభూతి (జ్ఞాపకాన్ని) మన కళ్ళముందుకు వస్తుంది.  అనుభూతి సాంద్రత ప్రాముఖ్యతల్ని బట్టి ఓకో సారి మనసు ఆనంద తరంగమైతే ఒకోసారి విషాద వీచికౌ వుతుంది. ఏమైనా స్మృతి పరిమళం ఆహ్లాదించదగినదే. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే – కొన్ని రోజుల క్రితం ఎఫ్.బి.లో మన్నెం శారదగారు గీసిన ఒక చిత్రాన్ని చూశాను. దాంతో నా బాల్యంలోని ఓ అనుభూతి అనుభవం మీతో
పంచుకోవాలనిపించింది. 


నాకప్పుడు 9-10 ఏళ్ళుంటాయేమో. నేను అమ్మమ్మగారింట్లో అవనిగడ్డలో ఉన్నాను.  అవనిగడ్డకు పక్కనో అరటి లంక అనే చిన్న ఊరు ఉంది. దానికి ఆనుకుని పారే కృష్ణానది అలల మీద నుండి వచ్చే గాలి విన్యాసాలనవలోకిస్తూ  అనుభూతిస్తూంటుందా ఊరు. 


ప్రతి యేటా కృష్ణమ్మ ఉధృత రూపాన్ని చవి చూస్తూ – ఆ ఊర్లో మా పిన్ని (అమ్మ చెల్లెలు) కుటుంబం వుండేది. వారికి వ్యవసాయం, పాడి వుండేది. మా అమ్మమ్మా వాళ్ళకి పాడి లేదు.  రోజూ పాలు పెరుగు, మజ్జిగలు మా పిన్నిగారింటి నుండి వచ్చేవి. మా అమ్మగారికి ఆరోగ్యం  సరిగా లేనందున మా పిన్నిగారు అమ్మకు తోడుగా ఉన్నారు. ఒక రోజు మా అక్క (పిన్ని కూతురు)  పాలు, పెరుగు తెచ్చి “వరద వస్తుందంటున్నారు రెండు మూడు రోజులు రావటం కుదరదేమో” అని చెప్పటం నేను విన్నాను.  దాంతో వరద వచ్చినపుడు అక్కడ నేనుంటే – అన్న ఆలోచన, ఉత్కంఠ, ఉబలాటం పెరిగిపోయి అందరినీ ఒప్పించి నేను మా అక్కతో అరటి లంక వెళ్ళాను. ఆ రాత్రి తుఫాను మొదలై మరుసటి సాయంత్రం వేళ చుట్టం వచ్చినట్లు కృష్ణ వరద నీరు మెల్లమెల్లగా చప్పుడు చేయకనే పాక్కుంటూ ప్రవేశించి పెరటిని చేరింది. పెరటి గట్టును తాకిన అలలు చెమ్మచెక్కలాడుకున్నాయి. పైకి లేచాయి. గట్టు పైకి తొంగి తొంగి చూస్తుండగానే పెరడంతా నీటితో నిండి పోయింది. ఆకాశానికి అద్దంలా మారింది పెరడు. గుమ్మం ముందు ఎత్తైన అరుగు మీద కూర్చుని ఆ వరద నీటిని చోద్యంగా చూశాను. నేను చోద్యపడుతూ నీళ్ళలో గంతులేస్తుంటే అక్క కోప్పడి లోపలికి ఫో – అని అరిచింది. అరుగు మీద కూర్చుని  కిందకి జారేసిన నా అరికాళ్ళకు ఆ నీళ్ళు గిలిగింతలు పెట్టాయి. అభిషేకం చేశాయి. 


ఓ పక్కన చిరుజల్లు. ముసిరిన మబ్బు. చీకటి వెలుగు పెనవేసుకున్నట్టు నీలి మబ్బులో మెరుపు తీగలు, మేళంలా ఉరుములు. ఒక పక్క భయం, మరో పక్క కుతూహలం. అప్పుడే అక్క పండు మిరపకాయ పచ్చడి, ముద్దపప్పు నెయ్యి వేసి కలిపిన అన్నం పళ్ళెం తెచ్చిచ్చింది. ఆ సమయంలో అలా వేడి వేడి అన్నం తింటుంటే ఎంత బాగుందో... చెప్పలేను. అదో గొప్ప ఆనందం. అన్నం తినటం అయిపోయేటప్పటికి కృష్ణ నీరు నా పాదాల పైకి వచ్చేసింది. ఆ నీటిలో కాళ్ళు ఆడిస్తుంటే వచ్చిన తపతపా శబ్దం,వింటుంటే చిందే నీటిని చూస్తుంటే బలే సరదా అనిపించింది.


అక్క లాంతరు వెలిగించి(అప్పట్లో కరెంటు లేదు ) గుమ్మం మీద పెడుతూ – మళ్ళీ సందె ముగ్గేయటం ఎప్పుడో అనుకుంది. 


అక్క భోజనం చేస్తుండగానే వరద నీరు గడపని చేరి లోపలికి తొంగి చూడటం ప్రారంభించింది.  పెరటి గుమ్మం వైపు ముందున్న గది భోజనాల గది. దానికి ఆనుకుని ఉన్న పడక గది ఎత్తుగా ఉంది. అయినా ప్రతి యేటా వరద సమయంలో కింది సామానంతా అటక మీదికి ఎక్కించటం అలవాటైన అక్క ఇప్పుడూ అదే పని చేసింది. కరెంటు లేని కాలం. గుడ్డి దీపాలు. బాగా చీకటి పడింది. టైం ఎంతైందో తెలియదు. వరద నీరు భోజనాల గదిలోకి వచ్చేసింది. అక్క అక్కడే ఉంది. నేను మాత్రం ఎత్తుగా వున్న పడక గది గుమ్మం మీద కూచున్నాను. 


అప్పుడో వింత చప్పుడు మొదలైంది. అర్థం కాలేదు అదేంటో.... అక్క చెప్పింది – అది – వరద నీరు గది గోడలకి కొట్టుకుంటూండడం వల్ల వస్తున్న శబ్దమని.


తల వాకిట్లో మా బాబాయి వాళ్ళున్నారు. ఏవో మాటలు వినిపించి అటు వెళ్ళాను. ప్రభుత్వం పంపిన పడవ వచ్చింది. దాన్ని బాబాయి ఇంటి వసారా గుంజకి కట్టేశారు. ఎందుకని అంటే – వరద బాగా పెరిగితే వాటిల్లో ఎక్కి అవనిగడ్డ వెళ్ళటానికి – అని చెప్పారు. వర్షం పెద్దదైంది. అక్క, బాబాయి నిద్రకు జోగుతున్న నన్ను చూసి  పోయి పడుకో.  అవసరమైతే లేపుతాం అన్నారు. నిద్ర  నన్నావహించేసింది. మెలకువ వచ్చేసరికి ఉదయమైపోయింది. వరద పెరుగుతుందని తొందరగా అందరం పడవ ఎక్కాలి – నీవు ముందు వెళ్ళు మళ్ళీ ఈసారి పడవలో మేం వస్తాం అన్నారు.  పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఆడ వాళ్ళని పడవలో ఎక్కించారు. బాబాయి గుంజకు కట్టిన పడవ తాళ్ళను విప్పేశారు. వెదురు గడ పట్టుకుని ఓ వ్యక్తి పడవను ఒకవైపు నుంచున్నాడు. పిల్లల నుద్దేశించి నీళ్ళలోకి చేతులు పెట్టద్దన్నాడు. ఎందుకో అర్థం కాక కాస్త కోపం వచ్చింది సరదా పోతుందని. 


రోజూ అందరూ నడిచే దారివెంటే పడవ సాగింది. దారికి రెండు వైపులా చిన్నవి పెద్దవి తాటిచెట్లు. ఈతచెట్లు - ఇలా ఏవేవో రకరకాల చెట్లున్నాయి. వాటిని చూస్తున్న నేను ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. పడవకు మూరెడు దూరంలో ఓ పాము వెడుతోంది.  నా పక్కనున్నామె పుట్టల్లోకి నీళ్ళెళ్లి పాములిలా బయటకు వస్తాయి. భయపడకు వాటి దారినవి పోతాయి అంది. 


ఇంకోచోట చిన్న తాటి చెట్టు. దానికి పరచు కొన్నట్టున్న తాటాకులపై రెండు కోళ్ళు. సీతాఫలం చెట్టు మీద పిల్లులు పడవవాడు గడకర్ర సాయంతో పడవను ముందుకు తోస్తుంటే పడవ సాగుతోంది. ఎప్పుడైనా పడవలో కొస్తానన్నట్టు వరద నీరు అలలతో పడవను ఉయ్యాల లూపుతూ...  
అక్కడ జామ, సపోటా, మామిడి. తోటలు ఉన్నాయి.కోతులు ఉన్నాయి. పడవ అలా వెళుతూనే వుంది. నీటి వడి పెరుగుతోంది. నీళ్ళు పడవలోకి వస్తే – పడవ మునిగిపోతే – అమ్మో.... భయం పెరిగింది. అప్పుడే డబ్ మని ఏదో పక్కనున్న చెట్టు కొమ్మ నుండి పడింది. భయంతో కేకలు పెడుతూ ఇద్దరు పిల్లలు లేచి నిలబడ్డారు. చూస్తే కోతి. ‘దానికి భయంగా వున్నట్టుంది.  పడవను చెట్టు దగ్గరగా పోనీ కోతి వెళ్ళిపోతుంది.’  అన్నారెవరో. పడవ నడిపే అబ్బాయి అలానే చేశాడు. కోతి కొమ్మ పట్టి వెళ్ళిపోయింది.  అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పడవలో వుంటే ఆ కోతి  ఏం చేసేదో.... పడవ డొంక సందులో మలుపు తిరుగుతుంటే సగం పడిపోయిన రాతి గోడ మీద చలికి వణుకుతూ రెండు కుక్కపిల్లలు.... పడవలో ఉన్న వారందరికి ప్రతి సంవత్సరం అనుభవమే కాబట్టి నింపాదిగా కూర్చున్నారు. నాకు మాత్రం అలజడిగా, అయోమయంగా భయంగా ఉన్నా పైకి మాత్రం  భయమే లేదన్నట్టు జరిగేవన్నీ చూస్తూ కూచున్నా. కోరి వచ్చా కదా. చిన్న పిల్లయినా ఎంత నిబ్బరంగా కూచుంది అనుకున్నారంతా. 


నెమ్మదిగా పడవ అవనిగడ్డ  కరకట్ట సులోచి దగ్గరకు వచ్చి ఆగింది. బతుకు జీవుడా అనుకుంటూ భయం గుప్పిట్లోనుండి  గుండె బయటపడినట్టు కరకట్ట ఎక్కి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. 


మంచి అనుభవం కదా. ఎప్పటికీ మరిచిపోలేని  ఓ స్మృతి’.