నేను-- నా బాలసాహిత్యం---60 (1): -శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి: ఫోన్ : 7013660252.

రచనలు చేయాలనే తపన మొదటి నుంచి నాలో ఉండేది. పి యు సి ( ప్ర్రీ యూనివర్సిటీ కోర్స్ ) చదువుతున్నప్పటి నుంచీ ఏవో రచనలు చేయాలనే కోరిక నాలో ఉండేది. మా స్వగ్రామం  ఒల్లరిగుడబ అయినా మా నాన్నగారి ఉద్యోగ
రీత్యా  కొమరాడలో టీచర్ గా పని చేసేవారు.ఆ కారణంగా నేను పి యు సి బొబ్బిలి రాజా ఆర్.ఎస్.ఆర్.కె రంగారావు కాలేజీలో చదివే వాడను. ఆ రోజుల్లో " పక పకలు " అనే మాస పత్రిక వచ్చేది. ప్రతీనెలా ఆ పత్రికను కొనేవాడను. అందులో జోక్స్ బాగా నాకు నచ్చేవి. నేను కూడా జోకులు వ్రాద్దామనే తలంపుతో ఉండేవాడిని.కానీ ఏ జోక్ వ్రాయాలో తెలిసేది కాదు. అయినా  ఏదో ఒకటి వ్రాసి పంపేవాడిని. నా జోకులు వారికి అర్థం అయ్యేవి కావేమో ! ఒక్క జోక్ కూడా ప్రచురించే వారు కాదు. చివరకు వారు విసిగిపోయారేమో ! ఉన్నట్టుండి ఒక నెలలో సత్యసాయిబాబా పుట్టినరోజు వచ్చింది. నేను శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఉత్తరాల శీర్షికలో ప్రచురించారు. అయితే నేను సత్య సాయిబాబా గురించి ఏమి రాయలేదు. అయినా నా బాధ భరించలేక సత్యసాయి బాబాపై నా పేరుతో లేఖల శీర్షికలో ఒక లేఖను ప్రచురించారని ఇప్పటికీ అనుకుంటున్నాను. నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటినుండి ఆ పత్రికకు మరి రాయడం మానేశాను. నాకే సిగ్గనిపించింది. మనది కానిది
మనది అని చెప్పుకున్నంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు. 
బయటకు చెప్పుకోలేని పరిస్థితి అది.  బి. ఏ  డిగ్రీ  మొదటి సంవత్సరం చదువుతున్న రోజులలో జయశ్రీ మాసపత్రిక వారు విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో  పాల్గొని నేను వ్రాసిన వ్యాసాన్ని సెలెక్ట్ చేసి ప్రచురించారు. అప్పటినుండి జయశ్రీ మాసపత్రికలోనే గాక ఆంధ్ర దినపత్రిక లో కూడా ఉత్తరాల శీర్షికన కొన్ని వ్యాసాలు రాశాను. వారధి అనే వారపత్రికలో ఫుల్ పేజీలలో   " విమర్శ కోసం విమర్శ"  అనే వ్యాసాన్ని ఒక వారం “ కాటక రంగంలో పడిన నాటక రంగం అనే వ్యసాన్ని మూడు వారాలు వేశారు. మధ్య మధ్యలో కవిత లు కూడా వ్రాసేవాడిని. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అల్లెన కృష్ణారావు గారు అనే ఆడిటర్ మా రూమ్ లో ఉండేవారు. అతను ఎక్కువగా కృష్ణాపత్రికలో రాసేవాళ్ళు. ఆనాడు కృష్ణాపత్రికలో  పడటం అంత ఆషామాషీ కాదు. అయినా తన గదిలో కూర్చుని ఏమి ఆలోచన చేయకుండా ఇట్టే వ్రాసి పడేసేవారు. మేము అప్పట్లో 17,18 సంవత్సరాల వయసుగలవారం. మా చేతికే 
అతను వ్రాసిన ఆర్టికల్  కవర్ పోస్ట్ లో వేయమని అందించే వారు.  పోస్ట్ లో వేసిన వారం పది రోజులలోనే అతని ఆర్టికల్ పత్రికల్లో వచ్చేది. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఆరోజుల్లో " మదర్ ఇండియా" అనే ఇంగ్లీష్ పత్రిక ఉండేది. 
దానికి బాబురావు పటేల్ ఎడిటర్ గా ఉండేవారు. కృష్ణా రావు గారు అందులో గల questions & answers శీర్షికకు మాచే ప్రశ్నలు రాయించేవారు. ఆ రోజుల్లో మదర్ ఇండియా ఎడిటర్ బాబూరావు పటేల్, బ్లిడ్జ్ ఎడిటర్ కరంజియాలు ఎంతటి ఉన్నత పదవులలో ఉన్నవారినైనా సరే  care చేసేవారు కాదు. ఎవరేమనుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా  ఉన్నదున్నట్టుగా వారి పత్రికలలో రాసేవారు.  వారిని వేరు వేరు ప్రభుత్వాలు  ఎన్నో సార్లు శిక్షించాయి. అయినా వారు చెప్పవలసిం దేదో పత్రికా ముఖంగా తమ విధులలో భాగంగా నిర్భీతిగా, కచ్చితంగా  తెలియజెప్పేవారు. అలానే illustrated weekly ఉండేది. ఇది సుతిమెత్తగా తప్పులు చేసే పెద్దలను చీవాట్లు పెట్టి వారిని బట్టబయలు చేసేది. అలానే రాజాజీ గారిచే నడపబడిన Bhavans Journal లో ఆధ్యాత్మిక వ్యాసాలను  ఆంగ్లంలో చాలా మృదువైన భాషను వాడి  ప్రచురించేది. అన్నింటికన్నా BLITZ భాష చాలా Standard తో కూడుకున్న భాషను వాడేది. Every man's అనే ఒక  ఆంగ్ల పత్రిక వచ్చేది. దీని ఖరీదు 25 పైసలు ఉండేది. పత్రిక చూస్తే చిన్నది. ఖరీదు తక్కువ. భాషా పటుత్వం ఎక్కువ. ఒక విధంగా చూస్తే మనం దీనిని సీమరపకాయతో పోల్చవచ్చు  ఇలా అనేక ఇంగ్లీష్ పత్రికలను కొని చదివేవాడిని. నాకు మొదటినుంచి ఉన్న ఒక అలవాటు ఏమిటంటే కొన్న పుస్తకం ఇచ్చిన సంతృప్తి అరువు తెచ్చుకున్న పుస్తకం సంతృప్తినివ్వదు. పైగా మన ఇంట్లో పుస్తకం ఉంటే మనం నెమ్మది నెమ్మదిగా ఎన్ని రోజులైనా చదవొచ్చు. ఎప్పుడైనా  రిఫరెన్స్ కోసం దానిని వెలుపలకు తీయొచ్చు.  కొన్ని తెలుగు పత్రికలకు నేను వ్యాసాలు రాసినా ఇంగ్లీష్ పత్రికల్లోనే అధికంగా వ్యాసాలు వ్రాశాను. నేను మొదటినుంచి నేను చదువుతున్న కళాశాల లైబ్రరీ నుంచి, పనిచేస్తున్న పాఠశాల లైబ్రరీల నుండి నేను ఆర్థికంగా తట్టుకోలేని  పుస్తకాలను మాత్రమే తెచ్చుకొని చదివేవాడిని. ఆ కారణంగా పుస్తకాలు చదవడం అనేటటు వంటిది విద్యార్థి దశ నుండే అలవాటు పడింది. ఇలా చదవడం నా భవితకు ఎంతో ఉపయోగపడింది. ( సశేషం )