భాస్కర శతకము - పద్యం (౭౦ - 70)

ఉత్పలమాల : 
*ప్రేమను గూర్చి యల్పునకుఁ | బెద్దతనంబును దొడ్డవానికిం*
*దా మతి తుచ్ఛపుంబని నె | దం బరికింపగ యీయరాదుగా*
*వామకరంబుతోడఁ గడు | వం గుడిచేత నపానమార్గముం*
*దోమఁగవచ్చునే మిగులఁ | దోచని చేఁతగుగాక  భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


ఒక వ్యక్తి ఎంత నీచపు స్వభావము కలవాడు, తెలివిలేక, పనిచేయగల సామర్ధ్యము లేని వాడు అయినా,  అతని యందు అభిమానముతో గొప్ప గొప్ప పనులు అతనికి అప్పగించడం, తెలివి, సామర్థ్యం, బుద్ధి కుశలత వున్నవారికి వారు చేయగూడని పనులు చేయమని చెప్పడము, ఆ చెప్పిన వాని ఆలోచనా రాహిత్యాన్ని తెలియచేస్తుంది. ఎలాగంటే, ఎడమచేయి చేయవలసిన పనులు కుడిచేతితో, కుడిచేతితో చేసే పనులు ఎడమచేతితో చేసే మనిషిని బుద్ధి లేనివానిగానే చూస్తాము గదా అలా.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*మన వాళ్ళు చెపుతుంటారు కదా, "గాడిద చేసేపని గాడిద, కుక్క చేసేపని కుక్క చేయాలని".  ఏ వ్యక్తికి అయినా, ఆ మనిషి సామర్థ్యాన్ని తెలుసుకుని పని ఒప్పచెప్తే, ఆ పని సుళువుగా, తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. రావలసిన ఫలితం వస్తుంది. దీనినే ఇప్పుడు, HR Management అని చెపుతారు.* ఇది సత్యం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss