భాస్కర శతకము - పద్యం (౭౨ - 72)

ఉత్పలమాల : 
 *బంధురసద్గుణాఢ్యుఁ డొక | పట్టున లంపటనొందియైన దు*
*స్సంధిఁ దలంప ధన్యులకుఁ | జాలహితం బొనరించుగాక, శ్రీ*
*గంధపుఁ జెక్క రాగిలుచుఁ | గాదె శరీరుల కుత్సవార్ధమై*
*గంధము లాత్మఁబుట్టు దరు | గంబడుయుండుట లెల్ల భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..


చందనపు చెక్క తాను అరిహి, కరిగి పోతున్నా కూడా, తనను వంటికి రాసుకున్న ఇతరులకు మంచి వాసనను ఇచ్చును కానీ ఏమాత్రము చెడు చేయదు.  అలాగే, సద్గుణములతో వెలిగి పోతున్న వ్యక్తి, తనకు కష్టాలు వచ్చినా కూడా, ఎదుటి వారికి మంచే చెస్తాడు కానీ, వెడు చేయాలి అనే ఆలోచన కూడా తనకు రానీయడు.....అని భాస్కర శతకకారుని వాక్కు. 


*కొవ్వొత్తి, మనలను కన్న తల్లిదండ్రులు, మనమేలు, ఉన్నతి కోరుకునే మనకు చదువు చెప్పిన గురువు, నిష్కపటమైన స్నేహాన్ని పంచే మిత్రుడు...వీరందరూ కూడా మంచి గంధపు ముక్క కోవలోకే వస్తారు.  మనతో జీవనయాత్ర చేయడానికి వచ్చిన సహచరి/సహచరునితో సహా.  మన ఉన్నతికి సహాయపడాలి అనే తపన వున్నవారిలో మనపైన వున్న ప్రేమను మనం గుర్తించగలిగితే, మనం ధన్యలమే.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss