బాల సాహిత్యంలో కథా ఎత్తుగడ-ముగింపు: జాని తక్కెడశిల --ప్రతిలిపి తెలుగు వెబ్సైట్ మేనేజర్ --725951195

కథా ప్రారంభాన్ని ఎత్తుగడ అంటారు. ఏ కథకైనా ఎత్తుగడ సింహద్వారం లాంటిది. ఎత్తుగడ ఆకర్షణీయంగా ఉండాలి. ఎత్తుగడలో చెప్పే మొదటి సంఘటన ఉత్కంఠభరితంగా సాగితే పాఠకులు కథలను చదవడానికి మక్కువ చూపుతారు. ఇక్కడ పాఠకులు పెద్దలా? చిన్నపిల్లలా? అన్నది ముఖ్యం కాదు. ఉత్కంఠభరితంగా కథను ప్రారంభిస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు. బాల సాహిత్యంలో ఎక్కువగా అనగనగా ఒక అడవి, ఒక రాజు, ఒక రాజ్యం, ఒక పాత్ర పేరు చెప్పి గత మూడు దశాబ్దాలుగా ఒకే మూసలో కథ యొక్క ఎత్తుగడను ప్రారంభిస్తున్న బాలసాహిత్యవేత్తలు చాలామందే ఉన్నారు. కథ యొక్క ప్రారంభమే కథకుడి సమర్థతను నిర్ణయిస్తుంది. కథను ఎలా ఎత్తుకోవాలో? ఎలా నడపాలో? తెలియకపోతే… ఆ రచయితకు వస్తువు పట్ల అస్పష్టత ఉన్నట్లే మరియు తీసుకున్న వస్తువును ఎలా ప్రారంభించాలి? ఎలా మలుపు తిప్పాలి? ఎక్కడ ముగించాలనే విషయాలు… రచయిత కథ ప్రారంభించక ముందే ఏర్పాటు చేసుకోవాలి.


కథలో ఏమి చెప్పాలనుకున్నారో? అదే విషయం ఎత్తుగడలో ఉండకూడదు. అలా ముందే విషయం చెప్పేస్తే బాలలు కథను చదవరు. బాలల కథలను సన్నివేశం, పాట, గేయం, సామెత, సంభాషణ లాంటి ఎత్తుగడలతో రాయవచ్చు. కథా ఎత్తుగడ పిల్లల బుర్రల్లో విత్తనంలా నాటుకుపోవాలి… అప్పుడే ఆ కథ… మొక్కై ,వృక్షమై పిల్లల మనసులో విస్తరిస్తుంది. కథను ఎలా మొదలు పెట్టినా…? పర్వాలేదు కాని అందంగానూ, ఆకర్షణీయంగానూ, మర్యాదగానూ, ఆసక్తిగానూ ఉండాలి. మన ఇంటికి ఎవరైనా… అతిధులు వస్తే… ఎలా ఆహ్వానిస్తామో? కథ యొక్క ఎత్తుగడతో పిల్లలను అలా ఆహ్వానించాలి. బాలసాహిత్యంలో కథ చివరిలో సందేశం వస్తుంది. ఆ సందేశం వరకు పిల్లలు చదవాలంటే ఎత్తుగడ చక్కగా ఉండాలి. అప్పుడే ఆ కథలోని సందేశాన్ని పిల్లవాడు గ్రహించగలడు. లేదంటే ఆది లోనే హంస పదం అన్నట్లు అవుతుంది.


ఎటువంటి ఎత్తుగడతో ప్రారంభిస్తే బాలలు కథలను చదువుతారు?. మన తాతముత్తాతలు అనగనగా అన్నారని బాలసాహిత్య కథలు అలానే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పటి కాలానికి, అప్పటి పిల్లలకు అలా చెప్పడం సరే కానీ… ఇప్పటి పిల్లల నాలుకలకు కొత్త తరహా కథలను ఎందుకు ఇవ్వకూడదు? ఒకే సిలబస్ ని దశాబ్దం పాటు కొనసాగించడం ఎంత తప్పూ… ఒకే రకమైన ఎత్తుగడను ఇంకా కొనసాగిస్తూ ఉండటం కూడా అంతే తప్పు. బాలసాహిత్య కథల ఎత్తుగడల్లో మార్పు రావాల్సి ఉన్నది. ప్రతి రోజు అన్నం, పప్పు పిల్లవాడికి తినిపిస్తే కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు అన్నం తినడం మానేస్తాడు. ఒకే రకమైన కథలను రాస్తూ పోవడం వల్లే తెలుగు బాలసాహిత్యం జాతీయ వేదికలో చతికిలపడింది. తెలుగు కథలను తెలుగు పిల్లలే చదవడం లేదు ఇక అనువాదాలు ఎలా జరుగుతాయి? వాస్తవానికి బాలసాహిత్యాన్ని పిల్లలు చదవడం లేదు అని చెప్పే దానికంటే పిల్లలకు అవసరమైన బాలసాహిత్యాన్ని బాల సాహిత్యవేత్తలు రాయడం మానేసారంటే సరిపోతుంది.


బాలసాహిత్య కథలు వర్ణనలతో ప్రారంభం కావడం జరగకూడదు. ఎందుకంటే? బాలసాహిత్య కథ యొక్క నిడివి చాలా చిన్నది కనుక కథలలో వర్ణనలకు చోటు ఇవ్వకూడదు మరియు పిల్లలకు వర్ణనలు అర్థం కావు కూడా. కనీసం పరిసరాల వర్ణన కూడా అవసరం లేదు. పాత్రల స్వభావం కూడా ఒక పదంతోనే తెలియజేయాలి. ఆ పదం సూటిగా పిల్లలకు అర్థమయ్యేదిగా ఉండాలి. ఉదాహరణకు “పులివెందుల పట్టణంలో చరణ్ అనే సోమరిపోతు ఉండే వాడు.” ఇక్కడ సోమరిపోతు అనే పదం తోటే పాత్ర యొక్క సంపూర్ణ స్వభావాన్ని తెలియజేశాము. అలా కాకుండా “చరణ్ అనే యువకుడు ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు, మంచి కండ పుష్టి కలవాడు, అయినా కూడా పనికి చేయడు, ఒట్టి సోమరిపోతు” అని రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే చరణ్ పాత్ర శారీరకంగా ఎలా ఉన్నా? పిల్లవాడికి అది అనవసరం, సోమరితనానికి శరీరంతో సంబంధం లేదు. శరీరం ఎలా ఉన్నా?, ఎత్తు ఎంత ఉన్నా? సోమరిగా ఉండటం మంచిది కాదు.


కథ ప్రారంభాన్ని ఎత్తుగడ అనుకుంటే తర్వాతి భాగం కథలోని మొదటి సంఘటన లేదా సన్నివేశం. సాధారణంగా బాలసాహిత్యంలో ఎక్కువగా కథ ప్రారంభంలోనే ప్రాంతాన్ని, లేదా పాత్రను ప్రవేశపెట్టడం జరుగుతోంది. ఇది చాలా రోజుల నుండి చాలామంది బాలసాహిత్యవేత్తలు అనుసరిస్తున్న శైలి. బాల సాహిత్యం అనగానే అలానే రాయాలేమోనని కొత్తగా బాల సాహిత్యం రాస్తున్న వారికి అనుమానాలు వస్తాయి. వాస్తవానికి అలాంటి నిబంధన కాని, సూత్రం కానీ లేవు. కాకపోతే బాల సాహిత్యాన్ని ఒక వైపు నుండే చూసే రచయితలు ఇంకా ఆ పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. అదే పద్దతి అనుసరించాల్సిన అవసరంలేదు. గొప్ప సంభాషణ, మంచి వాక్యాలు, ఆసక్తికరమైన విషయాలు ఇలా ఎన్నో మార్గాలతో కథను ప్రారంభం చేయవచ్చు. కథ ప్రారంభం అయిన తర్వాత మొదటి సంఘటన పాత్రల పరిచయం, ప్రాంతాల పరిచయమే ఉండవలసిన అవసరం లేదు. ఏ ఇతర పధ్ధతిలోనైనా రచయితలు కథను నడపవచ్చు. బాల సాహిత్యంలో ఎత్తుగడ మారాల్సిన అవసరం ఉన్నది.


ఎత్తుగడ, మొదటి సంఘటన ఒక పేరాలో రాసినట్లు అయితే…ఆ తర్వాత కథాంశం రెండు లేదా మూడు పేరాల్లో నడుస్తుంది. చెప్పే సంఘటనలు కథాంశానికి అతికినట్లు ఉండాలే కాని…చెప్పే సంఘటన వేరే ఉండి కథాంశం మరోలా ఉంటే… ఆ కథ బాలలకు చేరదు. కథాంశంలో స్పష్టత ఉండాలి. మంచి కథాంశం తీసుకొని చెడు సంఘటనల ద్వారా కథను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన విషయాన్ని మంచి కథాంశంతో చెప్పగలిగితేనే ఆ కథకు విలువ ఉంటుంది. కథలో క్లుప్తత కొరవడకూడదు. కథాంశంలో కథ యొక్క మూలం దాగి ఉంటుంది. ఆ మూలం మంత్రాలు, మాయలు, లాజిక్ కి అందని విషయాలపై, దెయ్యాలు, భూతాలపై, భావవాదంపై ఆధారపడేలా చేయకూడదు. కథాంశం యొక్క మూలం సహజంగా, నమ్మకంగా, నీతిగా, భౌతికంగా, నేటి సమాజ పరిస్థితులకు ప్రతిబింబంగా, ఆధునికమైన భావజాలంతో ఉండాలే తప్ప ఇంకా ఎప్పుడో పాత రచయితలు చెప్పి వదిలేసిన విషయాలపై ఉండకూడదు.


కథకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. ఆసక్తికరంగా ఆహ్వానం పలికిన పిల్లవాడికి విజ్ఞానవంతుడిగా చేసి నిష్క్రమించేలా చేయాలి. మంచి కథను చదివాననే సంతృప్తి పొందాలి, గొప్ప సందేశాన్ని తెలుసుకున్నానని అనుభూతి చెందాలి. ముగింపు ద్వారా మంచికి, చెడుకు పిల్లలు తేడా తెలుసుకోవాలి. పిల్లలు మంచి మార్గంలో ప్రయాణించడానికి కథ యొక్క ముగింపు నాంది కావాలి. ముగింపు సందేహాలకు, అనుమానాలకు, చెడు లక్షణాలకు, చెడు మార్గాలకు, అయోమయానికి, తికమకకు గురి చేయకూడదు. ముగింపు చదివిన పిల్లవాడు దిగులు చెందకూడదు, ఏడ్చేలా చేయకూడదు. కథ ముగింపు హాస్యంగా, నీతిగా, సంతోషంగా, నిజాయితీగా, విజేతగా, నైతిక విలువలు తెలిసేలా, అనుబంధాల విలువలు తెలిసేలా, ప్రేమను, గౌరవాన్ని పెంచేలా ఉండాలి. కథ చదివిన తర్వాత ఒక మంచి లక్షణం పిల్లవాడు నేర్చుకునేలా, నలుగురికి చెప్పేలా, చర్చించేలా ఉండాలి. జీవితాంతం ఆ కథ మనసులో ముద్ర పడిపోవాలి. ఆ కథ పిల్లవాడి ఎదుగుదలకు సహకరించాలి కాని తిరోగమనం వైపు నడిపించకూడదు. ముగింపులో సస్పెన్స్ ఉండవచ్చు కాని ఆ సస్పెన్స్ అయోమయానికి గురి చేయకుండా, ఆలోచించేలా చేయాలి. పిల్లలు థ్రిల్ అయ్యేలా కూడా ముగింపు ఇవ్వవచ్చు. ముగింపులో మూఢనమ్మకాలు, దేవుడిని నమ్మండి, దేవుడే సర్వసం లాంటి మాటలతో ముగించాల్సిన అవసరం లేదు. పిల్లలను భావవాద చట్రంలో పడేయకండి. దెయ్యాల కథలు రాసి దెయ్యాలు ఉన్నాయని నమ్మించకండి. దెయ్యాలను ఖండించండి. పిల్లల మనసులో ధైర్యాన్ని నింపండి. 


పిల్లల మనసు స్వచ్ఛంగా, ఖాళీ కుండలా ఉంటుంది. అందులో మంచి నీటిని నింపాలే తప్ప… మురికి నీటిని కాదు. 
   
6