అనగనగా బాటసారి
ఒంటరిగా బయలుదేరి
కడు దూరం సాగి పోయె
మిట్ట మధ్యాహ్న మది//
నింగిలోన ఎండ చూడ
నడవ లేక అతడు చూడ
సేద తీర తలచెనపుడు
చెంత నున్న చెరువు చేరె//
గటగటమని నీరు త్రాగి
గట్టున చెట్టు నీడ కేగి
విశ్రమింపగ కొంత తడవు
చెట్టు క్రిందన పక్క వాలె//
ఎదుట నున్న గుమ్మడి పాదు
కాయలేమొ అతి పెద్దవే
మీదనున్న మర్రి చెట్టుకు
పండ్లేమో మరీ చిన్నవి//
ఏమిటి ఈ విపరీతం
ఎందుకింత వ్యత్యాసం
అంత పెద్ద చెట్టుకేమి
ఇంత చిన్న కాయలేమి//
నేలను ప్రాకే పాదుకు
అంత పెద్ద గుమ్మడి
బ్రహ్మకైన తెలియ వలద
అని తలచె బాటసారి//
అలసి సొలసి వచ్చెనతడు
నిదుర లోకి జారు కొనియె
కాలమెంతో గడిచి పోయె
పెనుగాలి,సుడిగాలిలా//
చెట్టుపైన మర్రిపండ్లు రాలె
బాటసారి ఉలిక్కి పడిలేచె
కనులు తెరిచి నిజము చూడగను
తనలో తానై కలవర పడెను
మర్రికే గుమ్మడిలున్నచొ
గాలికి పడి నా తల పగులు
ఔను కదా! బ్రహ్మ సృష్టి!
అద్భుతమ్ము దూరదృష్టి!!
దూరదృష్టి (బాలగేయ కధ) : -- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెం:9290061336