సాహసనారి చిన్నారి (జానపద నవల రెండవ భాగం)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  *'నల్లత్రాచులు'* ఇది ఒక భయంకరమైన బందిపోటు దొంగలముఠా పేరు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజ్యాన్ని ఎంచుకొని ప్రజలమీద పడి దోచుకునేవాళ్ళు.
వాళ్ళకు జాలి, దయ అంటూ ఏమీ లేవు.
అడ్డొచ్చిన వాళ్ళను, ఎదురు తిరిగినవాళ్ళను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తారు. ఆ ముఠాలో దాదాపు అరవైమందిదాకా వున్నారు.
ఎంతో మంది రాజులు ఈ దొంగలను పట్టుకోవాలని ప్రయత్నించారు గానీ చేతకాలేదు.
దట్టమైన నల్లమల అడవుల్లో స్థావరం ఏర్పరచుకొని తాము దోచుకున్న సొమ్మునంతా అక్కడ ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టేవాళ్ళు.
ఆ నల్లత్రాచుల కన్ను కందనవోలు రాజ్యంపైన పడింది.
పంటలు బాగా పుష్కలంగా పండడంతో, రాజు పన్నుల పేరుతో ప్రజలను పీడించక పోవడంతో ఆ రాజ్యంలో చాలామంది సంపన్నులు అయ్యారు.
ఆడవాళ్ళ మెడలన్నీ బంగారు హారాలతో కళకళలాడేవి.
ఇళ్ళనిండా ధాన్యపురాసులు గుట్టలుగా వుండేవి.
వ్యాపారస్తుల గల్లాపెట్టెలు బంగారు వరహాలతో ఘల్లుఘల్లుమంటూ మోగుతుండేవి. దానితో అడవి చుట్టు ప్రక్కల గ్రామాలలో దొంగతనాలు, దోపిడీలు మొదలుపెట్టారు.
ఏ వూరిమీద దాడి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ వూరిలో ధనవంతుల ఇళ్ళు ఎక్కడ వున్నాయి, వాళ్ళు డబ్బు ఎక్కడెక్కడ దాచిపెడుతున్నారు, వూరిలో ఎవరైనా తిరగబడేవాళ్ళు, వీరులు, సైనికులు వున్నారా... ఇలా అన్ని విషయాలు ముందే సేకరించి ఒక్కసారిగా విరుచుకుపడేవాళ్ళు.
కళ్ళు మూసి తెరిచేలోగా అరవై మంది ఆయుధాలతో భీకరంగా అరుస్తూ కనబడినవాళ్ళనంతా కత్తులతో గాయపరుస్తూ దాడి చేసేవాళ్ళు.
ఒక్కొక్కడు కండలు తిరిగి, పెద్ద పెద్ద మీసాలతో, మొహాలకు నల్లని రంగు పూసుకొని యమకింకరుల్లా వుండే వాళ్ళు.
అందరి గుండెల మీద బుసలు కొడుతున్న నల్లత్రాచు బొమ్మ ధగధగా మెరుస్తుండేది.
ప్రజలు వాళ్ళను చూస్తూనే భయంతో కొయ్యబారిపోయేవాళ్ళు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, మారు మాట్లాడకుండా తమ దగ్గరున్నవన్నీ తీసి వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు.
విషయం సైనికులకు తెలిసి వాళ్ళు వచ్చేలోపల దొంగతనం పూర్తి చేసి మాయమయ్యేవాళ్ళు.
వాళ్ళను పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కరు గూడా చిక్కలేదు.
అడవికి దగ్గరగా వుండే గ్రామాల ప్రజలు భయంతో వూర్లు ఖాళీ చేసి నగరాలకు తరలిపోవడం మొదలుపెట్టారు.
యువరాణి లాస్యకు ఇదంతా చాలా అవమానంగా అనిపించింది. ఆ దొంగలముఠా ఆటకట్టించి వాళ్ళు కొల్లగొట్టిన ధనమంతా తిరిగి ప్రజల వద్దకు చేర్చాలి అనుకుంది.
కానీ ఆ ప్రయత్నం తన ప్రాణాలమీదకే వస్తుందని యువరాణి అప్పట్లో వూహించలేదు.
               ********    
అది దట్టమైన నల్లమల అడవి.
ఆ అడవిలో ఒక పెళ్ళిబృందం జోలాపురం నుంచి కందనవోలు వైపు పోతూ వుంది. అందులో దాదాపు వందమంది దాకా వున్నారు.
అందరూ చానా ఖరీదయిన పట్టుబట్టలు, బంగారు నగలు ధరించారు.
వారికి కాపలాగా కొంతమంది యువకులు వెనుకా, ముందూ కత్తులు చేతబట్టి నడుస్తున్నారు.
మధ్యలో వున్న పల్లకీలో పెళ్ళికూతురు సిగ్గుపడుతూ తల వంచుకొని, ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చుంది.
పల్లకిని కొందరు బోయీలు మోస్తూ వున్నారు.
పల్లకీ వెనుక ఆడవాళ్ళు కిలకిలకిల నవ్వుకుంటూ, ఏవేవో పాటలు పాడుకుంటూ, సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పోతున్నారు.
అక్కడంతా సంబరంగా వుంది.
కోలాహలంగా వుంది.
తరువాత రోజు కందనవోలులో పెండ్లికుమారుని ఇంట్లో వివాహం. అందుకే మేళతాళాలతో, పెళ్ళి కానుకలతో ప్రయాణిస్తున్నారు.
కానీ వాళ్ళ మొహాల్లో ఆ ఆనందం ఎంతసేపు వుంటుందో, వాళ్ళు పెళ్ళి కూతురుని తీసుకొని ఇంటివరకు క్షేమంగా వెళతారో వెళ్ళరో ఆ దేవుడు గూడా చెప్పలేడు.
ఎందుకంటే ఆ అడవిలో ఎవరు అడుగు పెట్టినా నిమిషాల మీద దొంగలముఠాకు తెలిసిపోతుంది.
పెళ్ళిబృందం అడవిలో అడుగు పెట్టిన విషయం తెలియగానే ముందుగా అన్ని విషయాలు వివరంగా గమనించి రమ్మని ఒక దొంగని పంపించారు.
వాడు దూరం నుంచే ఈ పెళ్ళి బృందాన్ని అణువణువూ బాగా పరిశీలించాడు.
కొత్తబట్టలతో, విలువైన హారాలతో వున్న వాళ్ళను చూడగానే అది చానా ధనవంతుల పెళ్ళని అర్థమైంది.
సంబరంగా పరుగుపరుగున వెళ్ళి ఆ విషయాన్ని నాయకునికి చేరవేశాడు.
''ఎంత మంది వున్నారు ఆ పెళ్ళి బృందంలో'' ప్రశ్నించాడు నాయకుడు.
''దాదాపు వందమంది దాకా వున్నారు నాయకా''
''ఆయుధాలున్నాయా''
''ఒక ఇరవైమంది దగ్గర వుండొచ్చు. వాళ్ళు పెళ్ళిబృందానికి కాపలాగా పది మంది ముందు, పదిమంది వెనుక ఆయుధాలు చేతబట్టి నడుస్తున్నారు.
''వాళ్ళ శరీర నిర్మాణం ఎలా వుంది. సాధారణంగా అందరి మాదిరే వున్నారా లేక కండలు దీరి వున్నారా''
''మామూలుగానే వున్నారు నాయకా''
''పెళ్ళివాళ్ళు ఎలా వున్నారు''
''వాళ్ళు గూడా మామూలుగానే వున్నారు నాయకా. అంతేగాక అందులో సగం మంది ఆడవాళ్ళే. అసలు వాళ్ళు ఈ లోకంలో లేరు. సంబరంగా ఆడుతూ పాడుతూ వుల్లాసంగా వున్నారు'' అంటూ తాను చూసిందంతా పూసగుచ్చినట్టు వివరించాడు.
''సరే... ఐతే మనమంతా కలసి వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళమీద దాడి చేద్దాం. వాళ్ళు పెళ్ళి గొడవలో మునిగి తేలుతున్నారు కాబట్టి మన దాడిని వూహించలేరు.
మనలో సగం మంది రెండు బృందాలుగా విడిపోయి, ఆ పెళ్ళిబృందానికి కాపలాగా ముందూ వెనుకా వున్నవాళ్ళ మీద దాడి చేయాలి.
వాళ్ళు మనల్ని గమనించేలోపలే వాళ్ళను హతమార్చడమో, బందీ చేయడమో జరిగిపోవాలి.
మిగతావాళ్ళు ఆ పెళ్ళిబృందం ఎటూ పారిపోకుండా ఆయుధాలతో చుట్టూ కవచంలా నిలబడాలి.
అందరి దగ్గరున్న బంగారు ఆభరణాలన్నీ దోచుకున్న మరుక్షణం ఒక్క నిమిషం గూడా ఆగకుండా ఒకేసారి అందరం మాయం కావాలి. ఈ దోపిడీ అంతా అరగంటలో పూర్తి చేయాలి''
అంటూ ఎవరెవరు ఏమేమి చేయాలో వివరించి బృందాలుగా విభజించాడు.
వెంటనే వాళ్ళు ఆయుధాలు తీసుకొని వేగంగా అడ్డదారుల వెంట బైలుదేరారు.
అరగంటలో పెళ్ళిబృందం వద్దకు చేరుకున్నారు.
నాయకుడు సైగ చేయగానే వెంటనే భయంకరంగా అరుస్తూ ఒక్కసారిగా పెళ్ళిబృందం మీద దాడి చేశారు.
అప్పుడు జరిగింది ఒక వూహించని సంఘటన.
తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వుంటాడట.
దొంగలు అనుకున్నట్లుగా ఆ పెళ్ళిబృందంలో ఎవరూ భయపడి పారిపోలేదు.
చెల్లాచెదురు కాలేదు.
అసలు వాళ్ళు పెళ్ళిబృందమే కాదు.
ఆడవాళ్ళతో సహా అందరూ కందనవోలు సైనికులు.
ఒకొక్కడు ఒక్కొక్క మహావీరుడు.
ఒంటిచేత్తో పదిమందిని మట్టుపెట్టగల శూరులు.
ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న అనుభవజ్ఞులు.
దొంగలను పట్టుకోవడానికి పెళ్ళిబృందంగా మారువేషాలలో వచ్చారు.
వాళ్ళు పన్నిన వలలో దొంగలు చిక్కుకున్నారు.
వెంటనే ఆ సైనికులు అంతవరకూ దుస్తుల మాటున దాచిపెట్టిన ఆయుధాలు ఒక్కసారిగా సరసరసర బైటకు తీశారు.
ఎగిరి దొంగలమీదకు దూకారు.
దొంగలకు విషయం అర్థమయ్యేలోపలే సగం మంది తలలు తెగి కిందపడ్డాయి.
దొంగల నాయకుడు గట్టిగా ''రేయ్‌... మనం మోసపోయాం. వెంటనే అందరూ పారిపోండి'' అంటూ మిగతా దొంగలను హెచ్చరిస్తూ వెనక్కు తిరిగాడు.
అడ్డమొచ్చిన సైనికులను ఆయుధాలతో గాయపరుస్తూ పారిపోపోసాగాడు.
వాని ధాటికి ఎవరూ నిలబడలేకపోతున్నారు.
అంతలో పల్లకీలోంచి పెళ్ళికూతురు లేచి శివంగిలా ఎగిరి దొంగలనాయకుని ముందు దూకింది.
ఆ వేగానికి ఆమె కప్పుకున్న మేలిముసుగు తొలగిపోయింది.
ఆమె పెళ్ళికూతురు కాదు.
కందనవోలు యువరాణి లాస్య.
ఆమెని చూడగానే దొంగల నాయకుని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి.
గుండెలు దడదడలాడాయి.
ఆమె రెండు చేతుల్లోనూ రెండు కత్తులు తళతళా మెరుస్తున్నాయి.
ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యంలోనుంచి తేరుకోకముందే...
ఒక కత్తిని వాని చేతిలోని కత్తికి అడ్డం పెట్టి, మరో కత్తిని వేగంగా వాని గుండెల్లో దింపింది.
దాంతో వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
దొంగల నాయకుడు మరణించేసరికి మిగతా దొంగలంతా భయపడి తలా ఒక దిక్కు పరుగులంకించుకున్నారు.
కానీ వాళ్ళు తప్పించుకొని పారిపోతే, కొద్దిరోజులకు మరలా గుంపుగా ఏర్పడి కొత్త నాయకున్ని ఎన్నుకొని దొంగతనాలు తిరిగి చేయడం మొదలుపెడతారు.
అందుకని వెంటనే లాస్య పల్లకీలో సిద్ధంగా వున్న విల్లును అందుకొంది.
బాణాలు తీసి నలువైపులా వేగంగా ఒకదానిమీద ఒకటి వరుసగా సంధించింది.
దెబ్బకు ఒకడు చొప్పున అందరూ పిట్టల్లా రాలిపోయారు.
ఇక ఆ నల్లత్రాచు ముఠాలో ఒకడు మాత్రమే మిగిలాడు. సైనికులు వాన్ని చంపడానికి కత్తులు పైకెత్తగానే లాస్య వద్దని వారించింది.
''వాడు గూడా చనిపోతే ఆ దొంగలు ఇంతవరకు దోచుకొని దాచిపెడుతున్న బంగారు నిధిని కనుక్కోవడం కష్టం. వాడిని ప్రాణాలతో బంధించండి'' అంది.
వెంటనే కొందరు సైనికులు గుర్రాల మీద వాని వెంట పడ్డారు.
ఆ దొంగ పరుగెత్తీ పరుగెత్తీ అలసిపోయాడు.
కాళ్ళు తడబడుతూ వున్నాయి.
అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోతోంది.
ఆ సైనికుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అర్థమై, ఇక చేసేది ఏమీ లేక చేతులెత్తి లొంగిపోయాడు.
సైనికులు ఆ దొంగను బంధించి యువరాణి వద్దకు తీసుకువచ్చారు.
వాన్ని ఎంత బెదిరించినా, కొట్టినా, హింసించినా నోరు విప్పలేదు.
దొంగలు దోచుకున్న సొమ్ము ఏ ప్రదేశంలో దాచి పెట్టారో కనుక్కోవడం వాని నుంచి అసాధ్యం అని వాళ్ళకు అర్థమైంది.
దాంతో విసిగిపోయి వాన్ని రాజధానికి తీసుకు వచ్చి కారాగారంలో బంధించారు.
ఆ గది గోడలు చాలా ఎత్తుగా, నున్నగా, పటిష్టంగా వున్నాయి.
తలుపులు ఇనుముతో దృఢంగా వున్నాయి.
బైట సైనికులు కత్తులతో కాపలా కాస్తున్నారు.
ఇక ఈ కారాగారం నుంచి జన్మలో బైటపడలేను అని నిరాశపడ్డాడు ఆ దొంగ.
కానీ వూహించని విధంగా ఆ తరువాతరోజే వానికి కారాగారం నుంచి తప్పించుకొనే అద్భుతమైన అవకాశం వచ్చింది.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
     *మూడవ భాగం రేపు*