*సాహసనారి చిన్నారి (జానపద బాల నవల ఆరవభాగం - చివరి భాగం )* డా.ఎం.హరికిషన్ - కర్నూలు -9441032212.

 భైరవకోన.
నల్లమల అడవుల మధ్యన వున్న ఒక చిన్న రాజ్యం.
దానికి రాజు కాలభైరవుడు.
అతనికి ఎప్పటినుంచో ఈ ప్రపంచాన్నంతా జయించి తన పాదాల కిందకి తెచ్చుకోవాలని ఒకటే కోరిక.
కానీ అది అంత సులభమైన విషయం కాదు.
దానికి కావలసిన పరాక్రమం గానీ, తెలివితేటలు గానీ, పట్టుదలగానీ, సైనికులు గానీ, ఆయుధాలు గానీ అతని వద్ద లేవు.
దాంతో ఆయుధబలంతో కాక మంత్రబలంతో తన కోరిక సాధించుకోవాలి అనుకున్నాడు.
సన్యాసిలా వేషం వేసుకొని అనేక మంది సాధువులను, మునులను కలిసి వారిని సేవిస్తూ చిన్న చిన్న మంత్రాలు నేర్చుకున్నాడు.
కానీ అవేవీ అతని కోరిక తీర్చడానికి పనికిరాలేదు.
అటువంటి సమయంలో సదానందమహర్షి గురించి కొందరి ద్వారా తెలిసింది.
అతనికి అనేక శక్తులు వున్నాయని, అనేక మంత్ర తంత్రాల గురించిన సమాచారం అతని దగ్గర భద్రంగా వుందని తెలుసుకున్నాడు.
సదానందమహర్షి మంత్రతంత్రాలు మనచుట్టూ వున్న మనుషులు సంతోషంగా బ్రతకడానికి ఉపయోగపడాలి గానీ, స్వార్థం కోసం ఉపయోగించకూడదు అని అభిప్రాయపడేవాడు.
అందుకే వాటిని ఎవరికి పడితే వారికి నేర్పించేవాడు కాదు.
శిష్యులకు అనేక పరీక్షలు నిర్వహించి, వాళ్ళకు నేర్పిస్తే సమాజానికి ఉపయోగపడతాయని భావించినప్పుడే నేర్పించేవాడు.
అది గూడా తనకు తెలిసినవన్నీ నేర్పించేవాడు కాదు.
ఎవరికీ హాని కలగనివి మాత్రమే నేర్పించేవాడు.
ఆ మహర్షి దగ్గర ఒక అపూర్వమైన గ్రంథాలయం వుంది.
తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అది సంక్రమిస్తూ వస్తుంది.
అందులో అద్భుతశక్తులు ఎలా సంపాదించవచ్చో తెలియజేసే గ్రంథాలు కొన్ని వున్నాయి.
కానీ అవి పవరైనా మూర్ఖులు, దురాశపరుల చేతుల్లో పడితే లోకానికి హాని కలుగుతుందని భావించి ఎవరూ కనుగొనలేని రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు.
కాలభైరవుడు సదానందమహర్షి వద్ద శిష్యునిగా చేరాడు.
అత్యంత వినయంగా వుంటూ, చెప్పిన పని మారుమాట్లాడకుండా చేస్తూ, ఎప్పుడూ మౌనంగా తపస్సు చేస్తున్నట్లు నటిస్తూ అతి త్వరలోనే మంచిశిష్యునిగా అందరిలోనూ పేరు సంపాదించాడు.
దానితో సదానంద మహర్షి కాలభైరవున్ని తనతో పాటు ఆశ్రమంలో తన వద్దనే వుంచుకునేవాడు.
గురువుకు నిరంతరం పాదసేవ చేస్తూ, కావలసిన ఆహార పదార్థాలు సమకూరుస్తూ, చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా నేర్చుకుంటూ, ఎంత కష్టమైన పని అప్పజెప్పినా ఏమాత్రం విసుక్కోకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో చేస్తూ గురువును మెప్పించాడు.
దాంతో గురువు తాను ఎక్కడికి వెళ్ళినా కాలభైరవున్ని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు.
ఎల్లప్పుడూ గురువుగారి మంచం పక్కనే నేల మీద చాప పరుచుకొని నిద్రపోయేవాడు.
సదానందమహర్షి అప్పుడప్పుడు అర్ధరాత్రి లేచి ఒక్కడే చేతిలో పుస్తకం పట్టుకొని కుటీరం వెనుకవైపుకు పోవడం గమనించాడు.
తిరిగి వచ్చేటప్పుడు అతని చేతిలో మరొక కొత్త పుస్తకం వుండేది.
దానితో ఆ కుటీరం వెనుకనే రహస్యంగా గ్రంథాలయం వుందనే విషయం గ్రహించాడు.
ఒకరోజు అర్ధరాత్రి ముని నిద్రలేచి కుటీరం వెనుకవైపుకు వెళ్ళగానే, కాలభైరవుడు గూడా అడుగులో అడుగు వేసుకుంటూ రహస్యంగా అనుసరించాడు.
ముని వెనుకవున్న తోటలోకి వెళ్ళి అక్కడ వున్న వేపచెట్టు తొర్రలో చేయి పెట్టి ఒక మీట నొక్కగానే దాని పక్కనే వున్న పెద్ద పూలకుండీలు పక్కకు జరిగి, లోపలికి పోవడానికి ఒక చిన్న మెట్ల మార్గం కనబడింది.
ముని లోపలికి పోగానే అది మరలా మూసుకుపోయింది.
కాసేపటికి మహర్షి మరో కొత్త పుస్తకంతో బైటకు వచ్చాడు.
కాలభైరవుడు ఇదంతా గ్రహించి సమయం కోసం ఎదురుచూడసాగాడు.
ఒకసారి సదానందమహర్షి ఒక యజ్ఞం చేయించడానికి కొందరు శిష్యులతో పక్కనేవున్న రాజ్యానికి బైలుదేరుతూ కాలభైరవుని పిలిచి ''నేను తిరిగి రావడానికి పదహైదు రోజుల దాకా పడుతుంది. అంతవరకు ఈ కుటీర బాధ్యతలు నీకు అప్పగిస్తున్నా. నీమీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టు. శిష్యులందరినీ జాగ్రత్తగా చూసుకో'' అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆరోజు రాత్రే కాలభైరవుడు రహస్యంగా గ్రంథాలయంలో చొరబడ్డాడు.
అక్కడున్న పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదవసాగాడు.
అందులో ఒకచోట దేవేంద్రుని దగ్గరున్న రెక్కలగుర్రం ప్రస్తావన వుంది.
ఎవరైతే అపూర్వమైన ఆ రెక్కలగుర్రాన్ని బంధించి, పున్నమికి తరువాత రోజున కాళికాదేవికి బలిస్తారో వాళ్ళ కోరికలన్నీ ఆ దేవత తీరుస్తుంది అంటూ ఆ పూజా విధానమంతా వివరించి వుంది.
తాను ప్రపంచవిజేతగా మారడానికి కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడమే సరియైన మార్గమని భావించాడు కాలభైరవుడు.
రహస్యంగా ఆ పుస్తకంలోని విషయమంతా అక్షరం పొల్లుపోకుండా కొత్త తాటాకుల మీద రాసుకున్నాడు.
ఏ మాత్రం అనుమానం రాకుండా పుస్తకాన్ని యధాతధంగా పెట్టేశాడు.
గురువు తిరిగి రాగానే వూరి వద్ద తల్లిదండ్రులకు అనారోగ్యంగా వుందని సమాచారం అందిందని, ఇంటికి వెళ్ళి వారికి సేవ చేసుకుంటానని చెప్పి అనుమతి తీసుకొని బైలుదేరాడు.
రాజ్యానికి తిరిగి వచ్చిన కాలభైరవుడు రెక్కలగుర్రం గురించిన వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు.
అది ప్రతినెలా పున్నమికి అర్ధరాత్రి దేవలోకం నుంచి కుందేళ్ళరాజ్యం చేరుకొని, అక్కడ పాలకొలనులో స్నానం చేసి, తెల్లవారముందే తిరిగి వెళ్ళిపోతుందని గ్రహించాడు.
దాంతో దాన్ని బంధించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని తన సైనికులతో ఆ లోయ పైభాగంలో చెట్ల మీద కాపు కాశాడు.
ఈ విషయం రెక్కలగుర్రానికి గానీ, దాని మీద ఎక్కి ఆనందంగా ఎగురుతూ వస్తున్న యువరాణి లాస్యకు గానీ తెలియదు.
వాళ్ళు లోయ నుంచి బైటకు వచ్చిన మరుక్షణం చెట్ల మీద సిద్ధంగా వున్న సైనికులు వేగంగా పెద్ద పెద్ద వలలు ఒకదానిమీదొకటి ఎటూ తప్పించుకొని పోవడానికి వీలులేకుండా వరుసగా విసిరారు.
ఊహించని ఆపదను ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకు అర్థమయ్యేలోపల బందీలుగా చిక్కుకుపోయారు.
రెక్కలగుర్రాన్ని,
యువరాణి లాస్యను,
అటూయిటూ ఇంచు గూడా కదలకుండా తాళ్ళతో కట్టేసి కాలభైరవుని ముందు ప్రవేశపెట్టారు.
కాలభైరవుడు ఆ రెక్కలగుర్రాన్ని ఆనందంగా చూస్తూ ''ఇది మామూలు అలాంటిలాంటి అల్లాటప్పా రెక్కలగుర్రం కాదు.
మన అదృష్టదేవత.
దీనివల్ల మరికొద్ది రోజుల్లో ప్రపంచమంతా మన చెప్పుచేతల్లోకి రాబోతుంది.
ఆ మరుక్షణం ఇన్ని రోజులు సేవ చేసినందుకు గానూ...
మీ అందరి దోసిళ్ళు నవరత్నాలతో నింపి,
మీరెంత బరువున్నారో అన్ని బంగారు వరహాలు కానుకగా ఇస్తాను'' అన్నాడు.
ఆ మాటలు విని సైనికులంతా ఆనందంగా
''కాబోయే ప్రపంచాధినేతకు జయహో''
కాలభైరవ మహారాజుకూ జయహో'' అంటూ బిగ్గరగా అరిచారు.
''ఈ రెక్కలగుర్రాన్ని జాగ్రత్తగా బంధించి రేపు బలిపీఠం వద్దకు తీసుకురండి'' అంటూ లాస్య వంక తిరిగి చిరునవ్వుతో ''ఆడపిల్ల... ఇదేం చేస్తుంది గానీ... దీనిని తీసుకుపోయి కారాగారంలో బంధించండి. రెక్కలగుర్రాన్ని బలిచ్చాక ఈమె సంగతి చూద్దాం'' అన్నాడు.
కానీ... అదే అతను చేసిన పొరపాటు.
యువరాణి లాస్య అందరిలాగా మామూలు ఆడపిల్ల కాదు.
అగ్గిబరాటా అనే విషయం తరువాతరోజు గానీ కాలభైరవునికి అర్థం కాలేదు
*********      ********
లాస్యను ఒక చీకటి గదిలో బంధించారు.
చుట్టూ ఎత్తయిన నున్నని గోడలు...
ముందు ఇనుప ఊచల వాకిలి వున్నాయి.
ఒక ఒంటికంటి రాక్షసున్ని కాపలాగా వుంచారు.
లాస్య తప్పించుకోవడానికి చుట్టూ చూసింది.
గదిలో తాగడానికి ఒక నీళ్ళకుండ తప్ప ఏమీ లేవు.
దాన్ని చూడగానే ఆమెకు ఒక ఉపాయం తట్టింది.
వెంటనే ''రేయ్‌... నన్ను వదులు. లేకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు'' అంటూ గట్టిగా అరుస్తూ ఆ నీళ్ళకుండను తీసి గట్టిగా గదిమధ్య బండకేసి దభీమని బాదింది.
అది పగిలి ముక్కలుముక్కలయి గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి.
ఆ చప్పుడుకు ఒంటికంటి రాక్షసుడు కోపంగా అక్కడకు వచ్చి ''ఒసే పిచ్చిదానా... నువ్వు ఎంత అరిచి గోల చేసినా ఇక్కడ నిన్ను పట్టించుకునేవాళ్ళుగానీ, జాలిపడి వదిలి పెట్టేవాళ్ళుగానీ ఎవరూ లేరు. నోరు మూసుకొని మూలన పడుండు. ఇంగోసారి తిక్క తిక్క పనులు చేసినావనుకో... బల్లెంతో కసుక్కున ఒక్క పోటు పొడుస్తా చూడు... చచ్చూరుకుంటావు'' అన్నాడు.
లాస్య భయపడుతున్నట్టు నటిస్తూ వణుకుతూ ఒక మూలకు వెళ్ళి కూర్చుంది.
ఒంటికంటి రాక్షసుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
వెంటనే లాస్య పగిలిన పెంకులను పరిశీలనగా చూసింది. మూడు నాలుగు పెంకులు బాగా కొశ్శగా కనబడ్డాయి.
వాటిని తీసి జాగ్రత్తగా దాచి అవకాశం కోసం ఎదురుచూడసాగింది.
చీకటి పడగానే బైట డప్పుల శబ్దం మొదలైంది.
బలికి అంతా సిద్ధమవుతున్నట్లుగా వుంది. డప్పులు చెవులు చిల్లులు పడేటట్లు మోగుతున్నాయి.
ఇదే మంచి సమయం అనుకుంది.
దాచిపెట్టిన కుండపెంకులు తీసి  నేల మీద చిన్నగా నూరుతూ బాగా పదునుగా పిడిబాకుల్లా తయారుచేసింది.
బైట మోగుతున్న డప్పుల శబ్దాలలో ఈ చప్పుడు ఆ రాక్షసునికి వినిపించలేదు.
లాస్య ఒంటికంటి రాక్షసుని వంక చూసింది.
వాడు ఒక మూలన కూర్చుని అడవిపంది మాంసం పెరుక్కొని తింటూ వున్నాడు.
ఒక కుండ పెంకు తీసుకొని విసిరింది.
అది పోయి వాని పక్కనే పడి భళ్ళుమని పగిలింది.
ఆ చప్పుడుకి వాడు తలతిప్పి చూశాడు.
అంతే...
లాస్య చేతుల్లోంచి పిడిబాకులా వున్న కొశ్శని కుండపెంకు ఒకటి సర్రున గాలిని చీలుస్తూ దూసుకుపోయింది.
కళ్ళు మూసి తెరిచే లోపల...
జరగబోయే ఆపద పసిగట్టే లోపల...
అది సక్కగా వచ్చి వాని కంట్లో దిగింది.
అంతే...
ఆ దెబ్బకు వాడు విలవిలలాడుతూ చూపు కనబడక గట్టిగా అరవడానికి నోరు తెరిచాడు.
తెలివైనవాళ్ళు జరగబోయేది ముందుగానే వూహించి అందుకు సిద్ధంగా వుంటారు.
యువరాణి విసిరిన రెండో పెంకు సర్రున పోయి వాని నోట్లో దిగింది.
మూడవది పొట్టలోకి దూసుకుపోయింది.
అంతే...
వాడు ఎక్కడివాడక్కడే కుప్పకూలిపోయి చప్పుడు చేయకుండా ప్రాణాలు వదిలాడు.
గది బైట వున్న ఇనుప ఊచలకు తాళం వేసివుంది.
లాస్య తన తలవెంట్రుకలు వూడిపోకుండా పెట్టుకునే పిన్ను తీసింది.
ఎటువంటి తాళాలనైనా అవలీలగా తీయడం, ఎంత ఎత్తయిన గోడలనైనా క్షణాల్లో ఎక్కడం క్రూరజంతువులతో వుత్తచేతులతో పోరాడడం ఇలాంటివన్నీ లాస్యకు వెన్నతో పెట్టిన విద్య.
గురుకులంలో ఎప్పుడో నేర్చుకుంది.
ఐదు నిమిషాల్లో తాళం వూడి చేతికొచ్చింది.
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గదిలోంచి బైటపడింది.
                *******      ********       ********      
భైరవకోనంతా కోలాహలంగా వుంది.
సైనికులంతా ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు.
అక్కడంతా జాతర వాతావరణం అలుముకుంది.
కాళికాదేవి విగ్రహం ఎత్తుగా, నల్లగా నాలుక బైటకు చాచి... చూచేవాళ్ళ గుండెలు భయంతో కొట్టుకునేలా వుంది.
విగ్రహం మెడలో పుర్రెలు, నిమ్మకాయలు వేలాడుతున్నాయి. ఎర్రని కుంకుమ, పసుపు బొట్లతో దేవతనంతా అలంకరించారు.
చుట్టూ వెలుగుతున్న కాగడాలు ఆ ప్రదేశమంతా చీకటిని దూరం చేసి వెలుతురును చిందిస్తున్నాయి.
దేవత ముందు ఒక ఎత్తయిన ప్రదేశంలో ఒక పెద్ద ముగ్గు మీద రెక్కలగుర్రం ఇనుపగొలుసులతో కట్టేయబడివుంది.
ఒక యజ్ఞగుండం ముందు కూర్చొని అనేకమంది మాంత్రికులు పూజలు చేస్తూ వున్నారు.
కాలభైరవుడు తలస్నానం చేసి, నుదుట అరచేయంత వెడల్పుగల ఎర్రని బొట్టు పెట్టి, మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు ధరించి, ఎర్రని పంచ కట్టుకొని, చేతుల నిండా పసుపు కుంకుమలు తీసుకొని, దేవత మీద చల్లుతూ పెద్దగా మంత్రాలు జపిస్తున్నాడు.
కాళికాదేవి కాళ్ళ ముందు బలివ్వడానికి సిద్ధం చేసిన పెద్ద కత్తి తళతళలాడుతూ మెరుస్తూ వుంది. రాజ్యంలోని సైనికులంతా అక్కడ చేరి ఆనందంతో జరగబోయేది నిశ్శబ్దంగా చూస్తూ వున్నారు.
యువరాణి లాస్య ఒక చెట్టు పైకెక్కి ఇదంతా గమనించింది.
ఆ రెక్కలగుర్రాన్ని చూస్తే బాధ కలిగింది.
వీరులెవరైనా సరే స్నేహితులు ఆపదలో వున్నప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేసి తమదారి తాము చూసుకోరు.
ఎలాగైనా సరే రెక్కలగుర్రాన్ని బలివ్వకముందే తప్పించాలి అనుకొంది.
కానీ తాను చూస్తే ఒక్కతే.
ఆ సైనికులేమో కొన్ని వేలమంది.
మరి వాళ్ళ కన్ను గప్పి ఆ రెక్కలగుర్రంతో ఎలా ఎగిరిపోవాలి.
తీవ్రంగా ఆలోచించసాగింది.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక వుంటుంది. మూర్ఖులు తొందరపడతారు. తమకు ఆపద తెచ్చుకోవడమే గాక తన వెంట వున్నవాళ్ళను గూడా ఆపదలోకి నెడతారు. కానీ తెలివైనవాళ్ళు మంచీ చెడూ ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకుంటారు.
అది ఎండాకాలం కావడంతో అడవిలో చాలా చెట్లు ఆకులు రాలి ఎండిపోయి వున్నాయి. రాజ్యంలో అనేక భవనాలు చెట్ల కలపతో తయారై అందంగా రకరకాల రంగులతో మిలమిలా మెరిసిపోతున్నాయి.
వాటిని చూడగానే లాస్య పెదవులపై తళుక్కున చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా చెట్టు దిగింది.
అదే సమయంలో ఒక సైనికాధికారి చేతిలో బల్లెంతో గుర్రమ్మీద చెట్టు కిందికి వస్తూ కనబడ్డాడు.
ఒక పెద్ద కట్టె తీసుకొని ఎగిరి వాని ముందుకు దుంకింది.
దుంకడం దుంకడం చేతిలోని కట్టెను పైకెత్తి బలమంతా వుపయోగించి అత్యంత వేగంగా వాని తలపై కొట్టింది.
ఆ దెబ్బకు వాడు తట్టుకోలేక ఎక్కడివాడక్కడ కుప్పకూలిపోయాడు.
వెంటనే లాస్య వాన్ని ఒక దట్టమైన గుబురు పొదల్లోకి లాక్కొనిపోయింది. కాళ్ళూ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వాని దుస్తులు తాను వేసుకొంది.
ఇప్పుడు లాస్య అచ్చం కాలభైరవుని సైనికాధికారి మాదిరే వుంది.
గుర్రమ్మీద ఠీవిగా కూర్చుని ఆయుధాలు దాచిపెట్టిన గది దగ్గరికి పోయింది.
ఏమాత్రం తడబాటు లేకుండా బైటవున్న సైనికులతో ''రేయ్‌... మన మహారాజు రెక్కలగుర్రాన్ని బలిచ్చే ముందు కాళికాదేవి కాళ్ళముందున్న వందదీపాలను బాణాలతో వెలిగించి ప్రసన్నం చేసుకోవాలట. వెంటనే ఒక మంచి కొత్త విల్లు, వంద బాణాలు తీసుకొని త్వరగా రండి'' అంటూ గంభీరమైన స్వరంతో మగవానిలా ఆజ్ఞాపించింది.
వాళ్ళు వెంటనే తలూపుతూ పరుగుపరుగున లోపలికి పోయి వందబాణాలు ఒక అపూర్వమైన విల్లు తీసుకొచ్చి ఆమె ముందు పెట్టారు.
లాస్య వింటినారి సరిచూసి ''ఈ వంద బాణాలకు నూనెలో ముంచిన గుడ్డలు కట్టి గుర్రమ్మీదకు చేర్చండి'' అంది.
వాళ్ళు మారుమాట్లాడకుండా వినయంగా ఆమె చెప్పినట్టే చేశారు.
యువరాణి ఒక కాగడా తీసుకొని అక్కడనుంచి బైలుదేరింది. నగరం నడిమధ్యలో వున్న ఒక ఎత్తయిన భవనం మీదకు చేరుకుంది.
చమురులో ముంచిన ఒక్కొక్క బాణాన్ని తీసి కాగడాతో అంటిస్తూ... తన బలమంతా వుపయోగించి నాలుగువైపులా వున్న భవనాలపైకి ఎండిపోయిన చెట్లమీదకు వదలసాగింది.
కాగడా పడిన భవనాలు, చెట్లు నెమ్మదిగా కొంచం కొంచం అంటుకోవడం మొదలుపెట్టాయి.
ఎవరూ దానిని గమనించడం లేదు.
అంతా మైదానంలో కాళికాదేవి ముందు నిలబడి జరుగబోయేది ఆనందంతో చూస్తూ వున్నారు.
మంటలు నెమ్మది నెమ్మదిగా పక్కనున్న ఇళ్ళకు, చెట్లకు వ్యాపించసాగాయి.
అరగంట దాటేసరికి రాజ్యం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది.
అప్పటికి గానీ మైదానంలో వున్న ప్రజలు, సైనికులు దాన్ని గమనించలేదు.
ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి. ఎవరికి వారు ఇళ్ళను, అందులోని విలువైన వస్తువులనూ కాపాడుకోవడానికి వేగంగా పరుగెత్తసాగారు.
నిమిషాల్లో అక్కడంతా అల్లకల్లోలంగా మారిపోయింది. కాలభైరవుడు గట్టిగా ''ఆగండి... ఆగండి'' అని అరుస్తూ వున్నాడు.
కానీ ఆ మాటలు ఎవరికీ వినబడడం లేదు.
మంటలు మైదానం దగ్గరికి వచ్చేస్తూ వున్నాయి.
వాటికి గాలి తోడయింది.
దాంతో మరింత విజృంభిస్తున్నాయి.
చెట్లు ఫెళఫెళఫెళమని ఒరిగి పోతున్నాయి.
పెద్ద పెద్ద ఇళ్ళు కాలిపోతున్నాయి.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరికి వారు తలా ఒక దిక్కు పారిపోతున్నారు.
ఆ గందరగోళంలో యువరాణి లాస్య వేగంగా ఒక్కొక్కరినే తప్పించుకుంటూ రెక్కల గుర్రం దగ్గరకు చేరుకుంది.
దాని చెవిలో నెమ్మదిగా ''నేను యువరాణి లాస్యను. ఎగిరిపోవడానికి సిద్ధంగా వుండు'' అంటూ  చెప్పింది.
అంతవరకూ చావు తప్పదని బాధతో దిగులుగా వున్న ఆ గుర్రం మొహం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది.
కళ్ళు సంతోషంతో మిలమిలా మెరిశాయి.
యువరాణి వేగంగా వెళ్ళి బలిపీఠం పక్కనున్న పెద్దకత్తిని అందుకొంది.
దానిని పైకెత్తి గుర్రాన్ని బంధించిన ఇనుపసంకెళ్ళ మీద విసురుగా ఒక్క వేటు వేసింది.
అంతే ...
అవి తెగి ఎగిరి పడ్డాయి. 
మరుక్షణం లాస్య అక్కడున్న కొన్ని బాణాలు రెండు పదునైన కత్తులు రెండు చేతులతోనూ అందుకొని ఎగిరి చెంగున గుర్రమ్మీద కూర్చొని ''ఛల్‌'' అంటూ అరిచింది.
అంతే రెక్కలగుర్రం ఒక్కసారిగా రెక్కలను విదిలించి సర్రున గాల్లోకి ఎగిరింది.
అదే సమయంలో దానిని గమనించిన కాలభైరవుడు జరిగిన మోసం అర్థమై ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి వేగంగా ముందుకు దూసుకువచ్చాడు.
ఆ దుర్మార్గుడు దగ్గరికి రాగానే యువరాణి తన బలమంతా వుపయోగించి వాని రొమ్ముమీద విసురుగా ఒక్క తన్ను తన్నింది
అంతే...
ఆ దెబ్బకు వాడు ఎగిరిపోయి దభీమని కాళికాదేవి కాళ్ళముందు పడ్డాడు.
ఆ అదురుకు అంత పెద్ద విగ్రహం ఒక్కసారిగా కదిలి అటూ యిటూ వూగింది.
కాళికాదేవి చేతుల్లోవున్న త్రిశూలం వదులై పట్టుజారి సర్రున వచ్చి కింద వున్న కాలభైరవుని గుండెల్లో దూసుకుపోయింది.
కాళికాదేవిని ప్రసన్నం చేసుకొని ప్రపంచాన్ని జయించాలని కలలుగన్న కాలభైరవుడు ఆఖరికి ఆమె కాళ్ళముందే రక్తం కక్కుకుని మరణించాడు.
రెక్కలగుర్రం ఆకాశంలో హాయిగా ఎగురుతూ ''యువరాణీ... ఇదే నాకు ఆఖరిరోజు అనుకున్నా. కానీ నీవు తప్పించుకోవడమే గాక నన్నుగూడా మంత్రగాని బారి నుంచి తప్పించి ప్రాణభిక్ష పెట్టావు. ఏమిచ్చినా, ఎంత పొగిడినా నీ ఋణం తీరదు'' అంది.
దానికి లాస్య నవ్వి ''అంత మాట అనకు మిత్రమా... ఒకరికొకరు ఆపదల్లో సహాయం చేసుకోకుంటే ఈ జీవితం ఎందుకు. ఆ లోయ నుంచి నీవల్లనే గదా నేను బైటపడింది. అది నేనెలా మరచిపోగలను'' అంది కృతజ్ఞతగా.
రెక్కలగుర్రం చిరునవ్వు నవ్వి ''యువరాణీ నేను వెళ్ళేముందు నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు చేసి వెళతా'' అంది.
''మా కందనవోలు రాజ్యానికి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మా రాజ్యానికి నన్ను చేర్చగలవా'' అంది.
''అదెంత పని. వుండు నీ రాజ్యం ఎక్కడుందో... అక్కడ ఏమి జరుగుతుందో నా దివ్యదృష్టితో చూసి  నీకు చెబుతాను'' అంటూ కళ్ళు మూసుకుంది.
కానీ అక్కడ జరుగుతున్నది చూసి రెక్కలగుర్రం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి.
తాను ఒక్క క్షణం ఆలస్యం చేసినా కందనవోలు రాజ్యానికి పెద్ద అనర్థం జరిగిపోతుందని గ్రహించింది.
వెంటనే ''యువరాణీ... గట్టిగా పట్టుకో. మనకు సమయం లేదు'' అంటూ అత్యంత వేగంగా గాలిని చీల్చుకుంటూ సర్రున దూసుకుపోసాగింది.


                *******     *******      ********* 
కందనవోలు రాజ్యమంతా కోలాహలంగా వుంది.
రాజ్యంలోని వీధులన్నీ రంగురంగుల తోరణాలతో ముచ్చటైన రంగవల్లులతో సుందరంగా అలంకరించబడ్డాయి.
రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది.
యువరాణి లాస్య దొంగలదాడిలో మరణించి లోయలో పడిపోయిందని రాజుతో బాటు ప్రజలందరినీ మహీపాలుడు తన మాయమాటలతో నమ్మించగలిగాడు.
ఒక పక్క మహారాజు ఆరోగ్యం బాగాలేదు.
మరోపక్క యువరాణి లాస్య లేదు.
రాజులేని రాజ్యం కంచెలేని పొలం లాంటిది.
దాంతో అంతవరకూ భయంతో అణిగిమణిగి వున్న సామంత రాజులందరూ రాజ్యంమీదికి దండయాత్రలు చేయడానికి, స్వతంత్రత పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సింహాసనం ఖాళీగా వుందని తెలిస్తే ప్రతి ఒక్కనికీ ఆశ పుడుతుంది.
అది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
అందుకని మహారాజు విధిలేని పరిస్థితుల్లో మహీపాలున్ని కాబోయే రాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేశాడు.
ఆరోజు మహీపాలుని పట్టాభిషేకం.
రాజ్యంలోని ప్రముఖులు, సామంతరాజులు, ప్రజలు అందరూ ఆ ఉత్సవాన్ని చూడడానికి వచ్చారు.
మహీపాలుడు తన చిరకాలవాంఛ నెరవేరుతున్నందుకు చాలా ఉత్సాహంగా వున్నాడు.
ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
పెదవులపై చిరునవ్వులు ప్రవహిస్తున్నాయి.
ఖరీదైన కొత్త పట్టుబట్టలు ధరించి వేదపండితుల ఆశీర్వాదాల నడుమ సింహాసనంపై కూర్చున్నాడు.
మహారాజు బంగారు పళ్ళెంలో వున్న స్వర్ణ కిరీటాన్ని చేతుల్లోకి తీసుకొని మహీపాలుని శిరస్సుకు అలంకరించడానికి ముందడుగు వేశాడు.
అంతలో అక్కడంతా ఒక్కసారిగా కోలాహలం.
ప్రజలంతా ఆకాశంలోకి చూస్తూ కేకలు పెడుతున్నారు.
మహారాజు కూడా ఆశ్చర్యంతో పైకి చూశాడు.
తెల్లని రెక్కలగుర్రంపై యువరాణి లాస్య విల్లమ్ములు పట్టుకొని దూసుకొని వస్తూ వుంది.
గాలికి ఆమె వెంట్రుకలు ఎగిరెగిరి పడుతున్నాయి.
జరుగుతున్న మోసమంతా ముందే రెక్కలగుర్రం సహాయంతో తెలుసుకున్న లాస్య మొహం కోపంతో ఎర్రగా వెలిగిపోతోంది.
పెదవులు అదురుతున్నాయి.
ఆవేశంతో బుసలు కొడుతోంది.
మహీపాలుడు ఆమెను చూసి అదిరిపడ్డాడు.
చేతికి చిక్కబోతున్న సింహాసనం జారిపోతుందేమో అనిపించింది.
కానీ ఇటువంటి ఆపద ముందే గ్రహించి కొంతమంది విధేయులైన వీరులను సిద్ధం చేసి వుంచాడు.
వాళ్ళ వంక చూసి చేయి వూపాడు.
అంతే వాళ్ళందరూ చేత కత్తులు ధరించి ఒక్కసారిగా ముందుకు దూకారు.
లాస్య వాళ్ళని గమనించింది.
అంతకు ముందు అడవిలో దొంగలుగా దాడి చేసింది వీళ్ళే. 
ఆమె కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి.
ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా...
ఇంకా భూమ్మీద దిగకముందే...
గాలిలోంచే...
రెండు చేతులతో బాణాలు అందుకుంటూ...
ఒకదానిమీద ఒకటి వూహించనంత వేగంగా సరసరసర ప్రయోగించింది.
అంతే...
ఆ బాణపు వర్షానికి తట్టుకోలేక నిమిషాల మీద ఎక్కడి వాళ్ళక్కడ హాహాకారాలు చేస్తూ కుప్పకూలిపోయారు.
రెండు చేతుల్లో రెండు కత్తులు అందుకొని అపరకాళికలా ఎగిరి కిందికి దూకింది.
అడ్డొచ్చిన మహీపాలుని అనుచరులను దెబ్బకు ఒకరి చొప్పున తెగనరుకుతూ ముందుకు దూసుకుపోయింది.
మహీపాలుడు ఆవేశంతో సర్రున కత్తి దూసి లాస్యమీద దాడి చేయబోయాడు.
ఆవేశంతో వూగిపోతూ లాస్య కొట్టిన దెబ్బకు మహీపాలుని చేతిలోని కత్తి రెండు ముక్కలయ్యింది.
విసురుగా గుండెలమీద ఒక్క తన్ను తన్నింది.
అంతే ఎగిరి సభ మధ్యలో పడ్డాడు.
యువరాణి నిండుసభలో వాని గుండెలమీద కాలు పెట్టి కత్తి పైకెత్తింది.
మహీపాలుడు ప్రాణభయంతో గజగజలాడసాగాడు.
''ఛీ... నీచుడా రాజ్యం కోసం చెల్లెలినే చంపడానికి ప్రయత్నిస్తావా. నీదీ ఒక బ్రతుకేనా. కానీ నాకింత ద్రోహం చేసినా అన్నవైన నిన్ను చంపడానికి మనసు రావడం లేదు'' అంటూ కత్తి కిందికి దించింది.
జరిగిన విషయమంతా తెలుసుకున్న మహారాజు అడవిలో దొంగలు దాచిపెట్టిన నిధిని తీసుకురావడానికి కొందరు సైనికులను పంపించాడు. 
అదే ముహూర్తానికి ప్రజల జయజయధ్వానాల మధ్య యువరాణి లాస్యకు పట్టాభిషేకం చేసి మహీపాలునికి దేశబహిష్కరణశిక్ష విధించాడు.
ప్రజలందరూ సంతోషంగా ''మహారాణి లాస్యకు జై, వీరనారీమణికి జై'' అంటూ మిన్నుముట్టేలా  జయజయ ధ్వానాలు చేశారు.
*******************
సమాప్తం - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
********************
కథ ఆరు భాగాలు చదివిన స్నేహితులు , స్నేహితురాళ్లకు ధన్యవాదాలు. 
మా పాప పేరు *లాస్య* . 9వ తరగతి. నాన్నా నా పేరుతో ఒక పెద్ద జానపద కథ రాయి అని అడగడంతో ఈ చిన్న నవల రాశాను.
ఈ నవల అసలు పేరు *యువరాణి లాస్య.*