వానికి పద్దెనిమిది ఏళ్లు గూడా వుండవు.మూతి మీద చిన్నగా కోరమీసాలు మొలిచాయి.బట్టలన్నీ మట్టిగొట్టుకు పోయాయి.ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తం కారుతూ వుంది.తల ఒకపక్కకు ఒరిగిపోయింది.స్పృహలో లేనట్టున్నాడు.సైనికులు గది తలుపులు తెరచి దొంగ పక్కనే ఒక మూలకు విసిరి పడేశారు.వాడు ఎటువంటి చలనమూ లేకుండా చచ్చిన శవంలా పడివున్నాడు.సైనికులు బళ్ళాలతో వాన్ని అటూ యిటూ కదిపి చూశారు. లేవకపోవడంతో బైటకు వచ్చి తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయారు.దొంగ ఆ యువకుని వంకే పరిశీలనగా చూడసాగాడు.బ్రతికాడో చచ్చాడో అర్థం కాలేదు.దగ్గరికి పోయి నెమ్మదిగా భుజం తట్టబోయాడు.అంతలో ఆ యువకుడు కళ్ళు తెరచి ఆ దొంగ వంక చూస్తూ కన్నుకొట్టాడు.''సైనికులు ఇంకా వున్నారా... వెళ్ళిపోయారా గురూ'' అన్నాడు గుసగుసగా.దొంగ బైటకు చూసి ''లేరు వెళ్ళిపోయారు'' అన్నాడు.''హమ్మయ్య'' అంటూ చిరునవ్వుతో లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు.దొంగ వాని వంక ఆశ్చర్యంగా చూస్తూ ''అరే... అంత హుషారుగా వున్నావే. నేను చచ్చిపోయావేమో అనుకున్నాను'' అన్నాడు.దానికి ఆ యువకుడు పకపకపక నవ్వుతూ ''చూడు గురూ... నేనలా నటించకపోతే ఇంకా నాలుగు తన్నులు ఎక్కువ తినాల్సి వచ్చేది అనవసరంగా. ఏమంటావు'' అన్నాడు.దొంగ కూడా చిరునవ్వు నవ్వుతూ ''నిజమే. అవునూ ఇంతకీ నిన్ను ఎందుకు బంధించారు'' అన్నాడు కుతూహలంగా.దానికా యువకుడు ''కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు గదా గురూ పెద్దలు. కొట్టబోయా... పట్టుబడ్డా! అంతే'' అన్నాడు.దొంగ అయోమయంగా మొహం పెట్టి ''కొంచెం అర్థమయ్యేలా వివరంగా చెప్పు'' అన్నాడు ముందుకు జరుగుతూ.''ఏమీ లేదు గురూ... చిన్న చిన్న దొంగతనాలు చేసీ చేసీ విసుగు పుట్టింది. ఒక్కసారి దొంగతనం చేస్తే జీవితాంతం కాలు మీద కాలేసుకొని బ్రతికేయాలి అని అనిపించింది. ఆలోచిస్తే రాజుగారి అంతఃపురం గుర్తుకు వచ్చింది.అక్కడైతే అత్యంత విలువైన రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు కుప్పలు కుప్పలుగా వుంటాయి.అందుకని సైనికుని వేషం వేసుకొని అంతఃపురంలోకి అడుగుపెట్టా. విలువైన మణులు, మాణిక్యాలు మూట గట్టేశా. ఇక బైటికి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో దురదృష్టం కొద్దీ రాణిగారి పరిచారిక నేనొక రత్నాలహారాన్ని కొట్టేయడం గమనించింది. అంతే గట్టిగా అరిచి కేకలు పెట్టింది. దాంతో ఇదుగో ఇలా దొరికిపోయా'' అన్నాడు.''రాజుగారి అంతఃపురంలోనే దొంగతనమా... ఐతే ఇక నీవు జన్మలో బైటపడలేవు. చచ్చేంతవరకూ ఇక్కడే ఇలాగే మగ్గిపోవలసిందే'' అన్నాడు దొంగ.దానికి ఆ యువకుడు విలాసంగా నవ్వి ''చూడు గురూ...నాది బుడదమట్ట జాతి.దొరికినట్టే దొరుకుతూ సర్రున జారిపోతా.దొంగతనం చేయడమే గాదు... పట్టుబడితే ఎలా పారిపోవాలో గూడా ముందే నిర్ణయించుకొని బైలుదేరుతా.ఈరోజు రాత్రికంతా ఇక్కడినుంచి ఎగిరిపోవడం ఖాయం.నన్ను ఈ ఇనుప వూచలు, ఇరుకు గదులు, కాపలా సైనికులు ఎవరూ ఏమీ చేయలేరు'' అన్నాడు గుసగుసగా వాని చెవి దగ్గరకు వచ్చి.దొంగ ఆశ్చర్యంగా ''నిజమా... ఎలా'' అన్నాడు చుట్టూ వున్న ఎత్తయిన గోడలు చూస్తూ.యువకుడు పకపకపక నవ్వుతూ ''అప్పుడే చెబితే మజా ఏముంటుంది గురూ. అదీగాక గోడలకు గూడా చెవులుంటాయి అంటారు పెద్దలు. నువ్వే చూస్తావు గదా నేనెలా తప్పించుకోని పోతానో'' అన్నాడు.ఆ యువకుని మాటల్లో వున్న నమ్మకం, ధైర్యం దొంగకు బాగా నచ్చాయి.దగ్గరకు వచ్చి ''మిత్రమా... నీతో బాటు నన్ను గూడా బైటకు తీసుకుపోయావనుకో... నీవు మోయలేనంత బంగారాన్ని బహుమానంగా ఇస్తా. ఇక నువ్వు కోరుకున్నట్లు జన్మలో దొంగతనం చేయాల్సిన అవసరం రాదు. హాయిగా జీవితాంతం కాలు మీద కాలేసుకోని బతకొచ్చు. ఏమంటావు'' అన్నాడు.''ఏంది గురూ... భలే సరదాగా మాట్లాడుతున్నావే. నిన్ను చూస్తే నీకే తినడానికి తిండి లేనట్లు వాడిపోయి కనబడతా వున్నావు. అట్లాంటిది నాకు మోయలేనంత బంగారం ఇస్తావా. నాకే మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించాలనుకుంటున్నావా. ఎట్లా కనబడతున్నా నీ కళ్ళకు'' అన్నాడు.అప్పుడా దొంగ ''నువ్వెప్పుడయినా నల్లమల అడవుల్లో తిరిగే నల్లత్రాచు దొంగల ముఠా గురించి విన్నావా'' అన్నాడు.''ఎందుకు వినలేదు గురూ... ఏ దొంగనడిగినా వాళ్ళ గురించి కతలుకతలుగా చెప్తారు. కానీ ఈ మధ్యనే పాపం మా యువరాణి లాస్య పన్నిన వలలో చిక్కుకొని అందరూ చనిపోయారంట'' అన్నాడు.ఆ దొంగ విచారంగా ''నువ్వు చెప్పింది నిజమే. ఆ ముఠాలో అందరూ చనిపోయారు. ఒక్కడు తప్ప'' అన్నాడు.''ఇంకా ఒకడు మిగిలాడా... ఎవడు వాడు'' కుతూహలంగా అడిగాడా యువకుడు.''నేనే'' అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆ దొంగ.''గురూ!... నీవెవరో తెలీక పొరపాటున నిన్ను ఇంతవరకూ ఏమయినా సరదాగా ఆటపట్టించి వుంటే మన్నించు. ఈరోజు సాయంత్రమే నాతో బాటు నిన్ను గూడా తప్పిస్తా. కానీ నీవు మాట ఇచ్చినట్టు బంగారం మాత్రం ఇవ్వాలి. సరేనా'' అన్నాడు.దొంగ చిరునవ్వుతో తలూపాడు.యువకుడు ఎలా తప్పించుకోవాలో వివరంగా చెప్పి అంగీ లోపల రహస్యంగా దాచిపెట్టిన చిన్నసీసా తీసి దొంగ చేతిలో పెట్టాడు.''ఇక మనం నాటకం మొదలుపెడదామా గురూ'' అన్నాడు యువకుడు చిరునవ్వుతో.''అలాగే'' అంటూ తలూపాడు దొంగ.ఆ యువకుడు అంగీ జేబులోంచి ఒక చిన్న కాగితపు పొట్లం తీశాడు.అందులో ఎర్రనిరంగు వుంది. దాన్ని నోట్లో వేసుకొని నోటినిండా నీళ్ళు పోసుకున్నాడు.గట్టిగా కేకలు పెడతా కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. నోట్లోంచి ఎర్రరంగు వుమ్మిస్తా వుంటే చూసేవాళ్ళకు వాడు రక్తం కక్కుకుంటున్నట్లు కనబడసాగింది.ఆ అరుపులు విని సైనికులు పరుగెత్తుకొని అక్కడకకు వచ్చారు. వాని నోట్లోంచి కారుతున్న రక్తం చూసి వానికేమైందో ఏమో అనుకుంటా తాళం తీసి లోపలికి అడుగుపెట్టారు.వెంటనే దొంగ జేబులోంచి యువకుడు ఇచ్చిన చిన్నసీసా తీశాడు.అందులో తెల్లనిపొడి వుంది.దానిని అక్కడున్న నీళ్ళ చెంబులో పోశాడు.అంతే తెల్లనిపొడి నీటిలో కలిసిన మరుక్షణమే బుస్సుమంటూ పెద్ద పొగ బైటకు వచ్చి దట్టంగా ఆ గదంతా అలుముకోసాగింది.వెంటనే ఆ యువకుడు, దొంగ జేబుల్లోంచి రుమాళ్ళు తీసి పొగ లోపలికి పీల్చకుండా ముక్కుకు అడ్డంగా కట్టుకున్నారు.సైనికులు ఆ పొగ పీల్చగానే ఎక్కడివాళ్ళక్కడ దభీదభీమని పడిపోసాగారు.కాసేపటికి అక్కడ పొగంతా మాయమయ్యింది.వెంటనే దొంగ, యువకుడు సైనికుల బట్టలు విప్పి తాము తొడుక్కున్నారు.ఇద్దరూ దర్జాగా అడుగులు వేసుకుంటూ బైటకు బైలుదేరారు.వాళ్ళు సైనికుల వేషాలలో వుండడంతో తమవాళ్ళే అనుకొని ఎవరూ ఎక్కడా ఆపలేదు. అలా ఇద్దరూ బైటపడ్డారు.''ఏం గురూ... నేను నా మాట నిలబెట్టుకున్నాను. మరి నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావా...లేక నా దారి నన్ను చూసుకోమంటావా'' అన్నాడా యువకుడు.ఆ మాటలకు ఆ దొంగ ''ఎంతమాట మిత్రమా. జన్మలో కారాగారం నుంచి బైటపడలేననుకున్నా. కానీ నన్ను బైటకు తీసుకొచ్చేశావు. నీ మేలు జన్మలో మరచిపోలేను. రా నావెంబడి. అడవిలో ఒక గుహలో ఎక్కడెక్కడో దోచుకొచ్చిన సొమ్మంతా భద్రంగా దాచిపెట్టాము. తరతరాలు తిన్నా తరగనంత సంపద వుందక్కడ. నేనొక్కడినే అదంతా ఏమి చేసుకుంటాను. నువ్వు కూడా నీకు కావలసినంత తీసుకుని పోదువుగానీ'' అన్నాడు.ఆ మాటలకు ఆ యువకుడు సంబరంగా వాని వెంట అడవిలోకి బైలుదేరాడు.కొన్ని గంటల పాటు నల్లమల అడవుల్లో నడిచాక, దట్టమైన కీకారణ్యంలో మనుషులే గాదు జంతువులు గూడా అడుగుపెట్టని ఒక ప్రదేశంలో ఒక పెద్ద కొండదగ్గరికి పోయారు.దానికి ఒక మూల ఒక పెద్ద గుహ వుంది.అది కనబడకుండా రాళ్ళు చెట్టుకొమ్మలు అడ్డంగా వున్నాయి.అవన్నీ తొలగించుకొని లోపలికి పోయారు.లోపల చూస్తే ఆ యువకుని కళ్ళు జిగేల్మన్నాయి.ఎటు చూసినా వజ్రాలు, రత్నాలు, హారాలు కుప్పలు కుప్పలుగా బస్తాల నిండుగా పోసి వున్నాయి.అదంతా ప్రజల సొమ్ము.తినీ తినకా దాచుకున్న సొమ్ము కష్టపడి పనిచేసి సంపాదించుకున్న సొమ్ము.దొంగలు అవలీలగా వారి మీద దాడి చేసి దోచుకొని ఇక్కడ దాచుకున్నారు.వాటిని చూడగానే ఆ యువకుని కళ్ళు ఎర్రబారాయి.పళ్ళు ఆవేశంతో పటపటలాడాయి.''ఈ ధనం కోసం ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు మీరు. ఎన్ని జీవితాలు నాశనం చేశారు. అసలు మీకు మనసనేది వుందా'' అన్నాడు ఆవేశంతో వూగిపోతూ.ఆ మాటలకు దొంగ అదిరిపడ్డాడు.''ఏమయింది నీకు. ఏమిటలా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు నువ్వు. నిజంగా దొంగవేనా, దొంగలెవరూ ఇలా మాట్లాడరే'' అన్నాడు అనుమానంగా.వెంటనే ఆ యువకుడు మూతి మీద వున్న కోరమీసం పెరికి పక్కన పడేశాడు.నెత్తిమీద వున్న తలపాగా తీసి జుట్టు ఒక్కసారిగా విదిల్చాడు.అంతే ఆ వెంట్రుకలు నడుం వరకూ చేరి గాలికి అటూ యిటూ వూగసాగాయి.''యువరాణీ... నువ్వా'' అన్నాడు దొంగ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి...ఈ సారి పట్టుబడితే ఇక జన్మలో బైటపడ్డం అసాధ్యం అని భావించిన దొంగ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే వున్న ఒక పెద్ద కత్తి తీసుకొని ఆమె మీద దాడి చేయబోయాడు.''నేనేరా... ప్రజల నుంచి దోచుకున్న ఈ సొమ్ము ఎక్కడ దాచారో తెలుసుకునేందుకే ఈ నాటకమాడా'' అంటూ నడుం దగ్గర దాచిపెట్టిన పిడిబాకును సర్రున తీసి బలంగా ఆ దొంగ మీదకు విసిరింది.అది ఏ మాత్రం గురి తప్పకుండా దూసుకొని పోయి ఛటుక్కున వాని అరచేతిలో దిగింది.అది మామూలు పిడిబాకు కాదు.అత్యంత భయంకరమైన కాలకూట విషం పూసిన పిడిబాకు.క్షణాల్లో ఆ విషం వాని శరీరమంతా పాకిపోయింది.ఆ దొంగ అట్లాగే ఆ బంగారు నాణేల మీదనే పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు.అంతలోపు ఒక పదిమంది సైనికులు బిలబిలమంటూ ఆ గుహలోకి వచ్చేశారు.లాస్య దొంగతో కారాగారం నుంచి బైటకు వచ్చినప్పటినుంచీ వాళ్ళు రహస్యంగా ఆ ఇద్దరినీ అనుసరిస్తున్నారు.పొరపాటున యువరాణికి ఏదయినా వూహించని ఆపద ఎదురైతే ఎదుర్కోవడానికి, కాపాడడానికి ఆ ఏర్పాటు.సైనికులు లోపలున్న సంపదను చూసి ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు.యువరాణి వాళ్ళవైపు తిరిగి ''ఈ చోటు బాగా గుర్తు పెట్టుకోండి.మనం రాజ్యానికి పోగానే సైనికులను పంపి ఈ సంపదంతా తరలించండి.ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ దొంగల బారిన పడ్డారో, ఎవరెవరి ఇంట్లో ఏఏ నగలు అపహరించబడ్డాయో ఆ వివరాలు, ఆభరణాల రూపురేఖలు గుర్తించి, వివరాలు నమోదు చేసుకోండి.ఇవన్నీ ఎవరివి వారికి తిరిగి అప్పజెబుదాం'' అంది.సైనికులు ''అలాగే యువరాణీ. ఇది గొప్ప విజయం. దొంగలపీడ శాశ్వతంగా తొలగిపోవడమే గాక, దొంగతనాల్లో పోయిన సొమ్ము తిరిగి వాళ్ళ చేతుల్లోకి చేరితే ప్రజల మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి.మీ వీరత్వాన్నే గాక, మానవత్వం గురించి గూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు.మీ పరిపాలనలో ప్రజలంతా హాయిగా గుండెలమీద చేతులు వేసుకొని సుఖశాంతులతో నిద్రపోతారు '' అన్నారు. లాస్య పెదవులపై విజయదరహాసం మెరిసింది.రాజ్యంలోకి అడుగుపెడితే ప్రజలు తనను ఎలా అభినందిస్తారో వూహించుకొని మురిసిపోయింది.కానీ ఆమెను అడవిలోనే అంతం చేయడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్న విషయం ముందుగానే వూహించలేకపోయింది.**************************డా.ఎం.హరికిషన్ -కర్నూలు-9441032212***************************నాలుగవ భాగం రేపు*
సాహసనారి చిన్నారి: (జానపద బాలల నవల మూడవ భాగం)- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212