లోకజ్ఞానం: -సంగనభట్ల చిన్న రామకిష్టయ్య-9908554535-ధర్మపురి

  రామాపురానికి చెందిన పేరిశాస్త్రి ఒకసారి ఒక కుర్రవాడిని పిలిచాడు."ఒరే అబ్బాయి!నీ పేరేమిటి?"అని ప్రశ్నించాడు.ఆ బాలుడు "రాముడు"అని చెప్పాడు."అయితే నీకు ముందు ముందు కాబోయే భార్య పేరేమిటో చెప్పుకో"అని అన్నాడు పేరిశాస్త్రి. ఆ బాలుడు సిగ్గు పడుతూ "సరస్వతి"అని అన్నాడు."ఛీ!నీకు సీత భార్య అవుతుంది అని ఆయన అన్నాడు.
అప్పుడు ఆ బాలుడు "కాదండీ!నాకు సరస్వతి భార్య అవుతుందండీ" అని అన్నాడు."నీకు సరస్వతి ఏమిట్రా!
సీత అవుతుంది కానీ. రామాయణంలో రాముని భార్య పేరు సీత.నీవు తెలుసుకో"-అని అన్నాడు పేరిశాస్త్రి. అప్పుడు ఆ బాలుడు నవ్వి "ఆ రామాయణం గురించి నాకు తెలియదండీ!మా ప్రక్కింటి రాముని భార్య పేరు సరస్వతి. అలాగే మా ఎదురింటి రాముని భార్య పేరు కూడా సరస్వతే.సీత కాదుగా. అది మీరు తెలుసుకోండి"అని చెప్పి తుర్రుమన్నాడు.
     ఆ తర్వాత శాస్త్రిగారు మరొక కుర్రవాడిని పిలిచాడు."బాబూ!నీ పేరు ఏమిటి"? అని ప్రశ్నించాడు."శంకరం అండీ"అన్నాడు ఆ బాలుడు."అయితే నీకు పార్వతి భార్య అవుతుంది"అన్నాడు శాస్త్రి."కాదండీ!నాకు లక్ష్మి భార్య అవుతుందండీ"అన్నాడా బాలుడు."నీ మొహం.శంకరుని భార్య పేరు పార్వతి. ఎవ్వరినైనా అడుగు"అన్నాడు శాస్త్రి.
      మా బంధువు శంకరం భార్య పేరు లక్ష్మి గదండీ.అలాగే మా బావ శంకరం భార్య పేరు కూడా లక్ష్మి. అదేవిధంగా నాకు కూడా లక్ష్మి భార్య అవుతుందండీ"అన్నాడు ఆ బాలుడు. శాస్త్రిగారు ఈ జవాబు విని ఖంగుతిన్నాడు.వారికున్న లోకజ్ఞానం తనకు లేనందకు సిగ్గు పడ్డాడు."ఇది కలియుగం.ఆ యుగానికి, ఈ యుగానికీ సంబంధం లేదు.ఇలాంటి పేర్లు గలవారు భార్యా భర్తలు కావాలనే నిబంధన ఏమీ లేదు"అని గ్రహించాడు శాస్త్రి గారు.