బెలగాం భీమేశ్వరరావు,9989537835

202.మలుపు తిప్పిన పిలుపు(రెండవ భాగం):
పారినాయుడు మాష్టారు వెంటనే ' అన్నపూర్ణ
అర యెకరా పంటల నమూనా 'పుస్తకాన్ని నా
చేతికందించారు.ఇది చదవండి. మీకు కొంత
అవగాహన వస్తుంది.ఈ చుట్టుప్రక్కల రైతులు
అన్నపూర్ణ అర యెకరా పంటల నమూనాలో
పంటలు పండిస్తున్నారు. అవన్నీ దగ్గరుండి 
చూపిస్తాను.మీకు ఏ సందేహం వచ్చినా నన్నడగండి.పుస్తకం లోని విషయం రైతులకు
పిల్లలకు అవగాహన కావాలి.సరళమైన భాష
ఉపయోగించాలి.మరొక ముఖ్యమైన విషయం
ఏమంటే, నవలను పౌరాణిక పాత్రలతో నడిపించండి.రైతులు, పిల్లలు ఆసక్తిగా చదువుతారు.పదిరోజుల్లో వ్రాతప్రతిని తయారు
చెయ్యాలి. జనవరిలో పుస్తకావిష్కరణ. ఆరువేల
కాపీలు ముద్రించి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార
సంస్థకివ్వాలి.బడులకు,రైతులకు ఆ పుస్తకాలు
పంపిణీ చేస్తారట.మీరు రాయగలరు."అని నా మీద పెద్ద భారమే వేశారు. మాష్టారి మాటను
కాదనలేకపోయాను.రెండు రోజులు కురుపాం, గుమ్మలక్ష్మిపురం మండాలాలు తిరిగాం.అక్కడ
సాగుచేస్తున్న విధానాలు చూశాను. ఆ తరువాత
పురాణపాత్రలతో కథనెలా నడపాలని ఒక రోజంతా ఆలోచించాను.మనసులో ప్రణాళిక
తయారయింది. మర్నాడు ఉదయం నాలుగు
గంటలకు కూర్చున్నాను.మనసులో ఉన్న
ప్రణాళిక ప్రకారం రాయడం మొదలు పెట్టాను.
""దేవలోకంలో ఇంద్రసభ జరుగుతోంది! ఇంద్రుడు,
అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు,
కుబేరుడు, ఈశాన్యుడు అను అష్టదిక్పాలకులు
వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు.ఎవరి ముఖం
లోను కళ లేదు. అందరిలోనూ ఆవేదన, ఆందోళన!"అని నవలను ఆరంభించాను. వారం
రోజుల్లో నవల పూర్తయింది. నవలకు           "యజ్ఞ ఫలం" పేరు పెట్టాను.15 అధ్యాయాలతో నవలను ముగించాను.ఆ అధ్యాయాలు 1.కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది. 2.వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు 3.బోల్తా
కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట 4.సంభవామి యుగే
యుగే 5.ప్రకృతి వ్యవసాయం - ప్రోత్సహిస్తున్న
సంస్థలు 6.రాబడి పెంచే రాజీలేని సూత్రాలు
7.పంటలను కాపాడే మిత్రకీటకాలు 8.శత్రు కీటకాలు - రాక్షస లీలలు 9.యమగోల 10.
అన్నపూర్ణకు ఆహారం లోటా 11.వ్యవసాయం
కుదేలు - అర ఎకరా వరాలు 12.ఆకలి తీర్చే
అన్నపూర్ణే ఆయుష్షు పెంచే ఆరోగ్య పూర్ణ
13.కాలనిర్ణయ పట్టికలు - వ్యవసాయ ప్రగతికి
మెట్లు 14.పంటల యజ్ఞం - శాంతికి మార్గం 
15.భూలోక పర్యటనలో దేవతలు. ముందు మాటను ఫలశృతి పేరుతో వృక్ష ప్రేమికురాలు,
వ్యవసాయ ప్రేమికురాలు డా.యన్.మంగాదేవి
గారు రాశారు. ముఖచిత్రం, లోపలి బొమ్మలు
ప్రఖ్యాత చిత్రకారులు శ్రీ తుంబలి శివాజీ గారు
వేశారు. రంగుల ముద్రణతో పుస్తకం ఆకర్షణీయం
గా తయారయింది. రచయితగా చాలా సంతృప్తి
పొందాను.కాకినాడలో జరిగిన రైతు సదస్సులో
యజ్ఞఫలం రైతులకందింది. పార్వతీపురం లోని
జట్టు ఆశ్రమంలో 2016 ఫిబ్రవరి 17 న "యజ్ఞఫలం" పుస్తకావిష్కరణ కార్యక్రమం జట్టు
వ్యవస్థాపకులు శ్రీ డి.పారినాయుడు గారు తలపెట్టారు.ఆ రోజు జరిగిన పుస్తకావిష్కరణ 
కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ డి.పారినాయుడు గారున్నారు.ఆయన యజ్ఞఫలం పుస్తకం బడి నుండి పొలం బడికి కార్యక్రమంలో భాగంగా మూడవ వ్యవసాయ వాచకంగా తెచ్చామని అది పిల్లలకు రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కలిగించగలదని తెలియపరిచారు.అనివార్య కారణాల వల్ల జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎం.నాయక్ గారు,జాయింట్ కలెక్టర్ శ్రీ కేశ్ బి.లట్కర్ గారు రాలేకపోయారు. ఆత్మీయ అతిథిగా వచ్చిన పార్వతీపురం ఆర్.డి.ఓ. శ్రీ రోణంకి గోవిందరావు గారు పుస్తకావిష్కరణ చేశారు. ప్రముఖ కవి శ్రీ పక్కి రవీంద్రనాథ్ పుస్తక పరిచయం చేశారు.ప్రధాన వక్తగా హైదరాబాద్ నుంచి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ దాసరి వెంకట రమణ గారు యజ్ఞఫలం పుస్తకం గురించి మాట్లాడారు. పార్వతీపురం మున్సిపల్ ఛైర్ పెర్సన్ శ్రీమతి ద్వారపురెడ్డి శ్రీదేవి ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యత తెలిపారు. వక్తలుగా విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖ రచయిత, శ్రీవాణి పలుకు పిల్లల పత్రిక సంపాదకులు శ్రీ యం.వి.వి.సత్యనారాయణ గారు విజయనగరం నుంచి వచ్చిన నాని పిల్లల పత్రిక సంపాదకులు శ్రీ ఎన్.కె.బాబు గారు ప్రసంగించారు. ప్రముఖ కవులు శ్రీ గంటేడ గౌరునాయుడు,శ్రీ రౌతు వాసుదేవరావు గారలు ప్రముఖ బాలసాహితీవేత్తలు శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు, శ్రీ బి.వి.పట్నాయక్ గారలుకార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.యజ్ఞఫలం రాయడం వల్ల ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. మున్ముందు ప్రకృతి వ్యవసాయ రచనలు చేయడానికి పునాదయింది.
(సశేషం).