వీడి తండ్రే నయం.(పిల్లల కథ) - దార్ల బుజ్జిబాబు

 పూర్వం నల్లమల అడవుల్లో దొంగల భయం బాగా వుండేది. అడవిమార్గంలో వెళ్ళేవారిని కొట్టి దోచుకునేవారు. అందువల్ల వివిధ పనులకు వేరే ప్రాంతానికి ఆ మార్గంలో వెళ్లేవారు ఒంటరిగా కాక గుంపులుగా వెళ్లేవారు. అయినప్పటికీ ఒక్కొక్కసారి గుంపులపై కూడా దాడి జరిగేది. దాడి చేసేవారిలో గజదొంగ గంగులు ఒకడు. ఇతడు చాలా ధైర్యవంతుడు. కత్తులు కటారులతో కాక కండబలం, బుద్ధిబలంతోనే దాడి చేసేవాడు. ఎంతమంది ఉన్న కనుచూపుతో భయపెట్టి దోచుకునే వాడు. అతనిలో ఉన్న నీతి ఏమిటంటే ఎవరిని హింసించడు. సర్వం దోచుకుని వదిలేసేవాడు. అయిన  ఆ ప్రాతంలో ఆయనంటే పసిపిల్లలుకూడా ఉలిక్కి పడేవారు. మెలితిరిగిన మీసంతో గళ్లలుంగి బిగుతూ బన్నీ ధరించి భయంకరంగా వుండేవాడు.  చాలా మంది అతడిబారినపడి ఎంతోకొంత పోగొట్టుకున్నవారే. చెడ్డగా  తిట్టేవారే. 
     ఇలాంటి గంగులు ముసలివాడయ్యాడు. వృత్తి కొడుకుకు అప్పగించాడు.  కొడుకు జంగులు కూడా తండ్రి గంగులు లాగానే క్రూరంగా కనిపించేవాడు. తండ్రి గంగులు చనిపోతూ కొడుకును పిలిచి  "అయ్యా! జంగులు! ఇన్నాళ్లు నా వృత్తి ధర్మాన్ని విజయవంతంగా నిర్వర్తించాను. అందరూ పోవలసిన చోటుకు పోతున్నాను. జనం నన్ను క్రూరుడిగా ముద్రవేశారు. ఆ ముద్రను నీవు చేరిపేయాలి. వృత్తిలో నాకున్న చెడ్డపేరును తొలిగించి అందరిచేత గంగులు చాలా మంచివాడు అనిపించాలి. అయితే ఒక్క షరతు. బాటసారులేవరికి ఏ హాని తలపెట్టవద్దు. చిన్నగాయం కూడా చేయవద్దు అని కన్నుమూశాడు.
      గంగులుకున్న చెడ్డపేరును తొలిగించి అందరిచేత గంగులు చాలా మంచివాడు అనిపించాలని  ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు జంగులు.  ఇక వృత్తిలోకి వెళ్ళిపోయాడు. దోచుకోవటంలో కొత్త విధానం అవలంభించాడు. బాటసారులు కనిపించగానే వారిపై దాడిచేసేవాడు. దోచుకునేవాడు. వారికి ఎటువంటి హాని చేసేవాడు కాదు. కానీ దోచుకున్న తరువాత వారి దుస్తులు వూడ దీసేవాడు. దిసిమొలన పంపేవాడు. బాగా సిగ్గుపడేవారికి చిన్న గుడ్డముక్క చించి ఇచ్చేవాడు. గోసి పెట్టుకుని వెళ్లమనేవాడు. చేసేదిలేక వారు మొండిమొలనే వెళ్లేవారు. వెళుతువెళుతూ "వీడి తస్సదియ్య , వీడి  తండ్రే నాయంరా. పాపం చాలా మంచివాడు. దోచుకుని వదిలేవాడు. వీడు దోచుకుంది కాక మన పరువంతా తీస్తున్నాడు" అంటూ వెళ్ళసాగారు. జంగులు వారి మాటలు వింటూ తృప్తిగా నవ్వుకునేవాడు తన తండ్రిని వారి నోట మంచివాడు అనిపించినందుకు.