పాత పుస్తకాలు: -- జగదీశ్ యామిజాల

హైదరాబాదులో నన్ను అమితంగా ఆకట్టుకున్నది అబిడ్స్ పేవ్మెంట్.....అదీనూ ఆదివారాలు మాత్రమే....


1982లో మొదటిసారిగా హైదరాబాదులో అడుగు పెట్టిన కొన్ని రోజులకే మా అన్నయ్య ఆనంద్ వల్ల అబిడ్స్ పేవ్మెంట్ గురించి తెలుసుకుని ఆదివారాలు తప్పనిసరిగా వెళ్తుండటం మొదలుపెట్టాను. డబ్బులున్నా లేకపోయినా బస్సు చార్జీలు పెట్టుకుని అబిడ్స్ చేరుకునే వాడ్ని. అబిడ్స్ పేవ్మెంట్లపై సెకండ్ హ్యాండ్ పుస్తకాలు చూస్తుంటే ఎంత ఆనందమో మనసుకి. కోఠీలో బస్సు దిగి అక్కడ మొదలుపెట్టిన నడక అబిడ్స్ జీపీవో దాకా నన్ను తీసుకుపోతుంది. పేవ్మెంట్లపై పుస్తకాలను చూస్తుంటే మిగిలినవేవీ గుర్తుకురాదు. 


కరోనా తాండవంతో ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత వెళ్ళని నేను నిన్న (6.12.20) అబిడ్స్ వెళ్ళాను. ఓ మూడు గంటలు గడిపాను. కొన్ని వేల పుస్తకాలు కళ్ళను స్పర్శించాయి. అక్కడికక్కడే కొన్ని పుస్తకాలు తిరగేశాను. 


తొలిరోజుల్లో కంటే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న పుస్తకాలు పిల్లలకు సంబంధించిన వాటితోపాటు కాలేజీ పుస్తకాలు. ఆ తర్వాత ఇంగ్లీష్ నవలలు. అక్కడక్కడా తెలుగు నవలలు...పది రూపాయలకూ ఇరవై రూపాయలకూ దొరుకుతున్నాయి. 


నేను చలం గారి ఉత్తరాల పుస్తకాలేవైనా దొరుకుతాయేమోననే వెళ్ళాను. కానీ ఒక్కచోటా దొరకలేదు.


చివరికి  ఓ చోట "చరిత్రలో ఈరోజు - సమయం సందర్భం" అనే పుస్తకం కొన్నాను. డెబ్బయ్ అయిదు రూపాయలకు కొన్నాను. నూట పాతిక చెప్పి చివరికి 75 రూపాయలకు ఇచ్చాడు. ఈ పుస్తక రచయిత మాదిరాజు గోవర్థన రావుగారు. ఇండియన్ రైల్వేలో పని చేసి రిటైరైన ఆయన ప్రముఖ గ్రంథాలయ సేవానిరతులు డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారి మార్గదర్శనంలో బాలసాహిత్యం, జీవిత చరిత్రల రచనల్లో విశేష కృషి చేశారు. చారిత్రక అంశాలపై ఆయనకున్న ఆసక్తి అనురక్తి రంగరించి అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజలకు విజ్ఞానదాయకంగా ఉండేలా "చరిత్రలో ఈరోజు" పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని వెలగా వెంకటప్పయ్య గారికి అంకితం చేశారు.


జనవరి ఒకటి మొదలుకుని డిసెంబర్ ముప్పై ఒకటి వరకూ ప్రతిరోజూ ఆయా రోజులలో నమోదైన ప్రముఖ సంఘటనలను ఈ పుస్తకంలో సంకలనపరిచారు. 


పుస్తకం చివర్లో జాతీయగీతం, వందేమాతరం, ప్రతిజ్ఞ, సారే జహాసే అచ్ఛా, మా తెలుగుతల్లి, తెలంగాణ తల్లిజన్మభూమి గీతాలు ఇచ్చారు. 


వస్తూ వస్తూ విశాలాంధ్రలో చలంగారి భగవాన్ స్మృతులు పుస్తకం కొన్నాను.