ధనపతి సఖుడై యుండియు: -ఎం బిందుమాధవి

ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్;
దనవారికెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తధ్యము;సుమతీ! "


సాక్షాత్తు ధనపతి అయిన కుబేరుడు చెలికాడై ఉండి కూడా శివుడు తన అవసరాలకి భిక్షమెత్తవలసివచ్చింది.


అలాగే తన తల్లిదండ్రులకి-తోబుట్టువులకి, ప్రాణ స్నేహితులకి ....ఎంత సిరి సంపదలున్నా తన వ్యక్తిగత అవసరాలకి....తన భాగ్యం తనకి ఉండటమే ముఖ్యం.


ఈ విషయం ఇంకొంచెం వివరంగా ఈ కధ ద్వారా తెలుసుకుందామా!!


********


లత వివాహ సమయానికి మురళి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నలుగురు పిల్లల్లో ఆఖరివాడు .మురళి తండ్రి ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. అన్నగారు చార్టర్డ్ అకౌంటెంట్.


కాస్తో కూస్తో స్థిరాస్థి కూడా ఉన్నది. వరునికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మురళికి కూతురినిచ్చి వివాహం చేశాడు, లత తండ్రి వెంకటేశ్వర రావు.


లత కూడా పెళ్ళి నాటికి ఓ హాస్పిటల్లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఉద్యోగం చేస్తున్నది.


పొరుగూరు అత్తవారింటికి వెడుతూ ఉద్యోగం మానేసింది. కాకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఒకటో రెండో సాఫ్ట్ వేర్ కోర్సులు కూడా చేసి ఉన్నది కాబట్టి అత్తగారి ఊర్లో ఉద్యోగం సంపాదించటం పెద్ద కష్టం కాలేదు.


మురళి పెళ్ళైన కొన్నాళ్ళు అంతా సజావుగానే సాగింది.
బాస్ తో మాట తేడా వచ్చి మురళి ఉద్యోగం మానేశాడు.
మళ్ళీ సీరియస్ గా ప్రయత్నం చేసినా వెంటనే అనువైన ఉద్యోగం దొరకలేదు.
భార్య ఉద్యోగం చేస్తున్నది కాబట్టి జరుగుబాటుకి లోటు లేదు.
'ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తావు? ఏదైనా కన్సల్టెన్సీ పెట్టు. పది రూపాయలు కళ్ళ చూడచ్చు ' అని మిత్రులిచ్చిన సలహా తలకెక్కించుకుని ఆ ప్రయత్నాల్లో పడ్డాడు.


ఏ రకమైన బిజినెస్ అయితే..... పెట్టుబడి తక్కువ.... లాభం ఎక్కువ ఉంటాయి?
అసలు పెట్టుబడి డబ్బులు ఎలా సంపాదించాలి? ఇత్యాది లెక్కలు తేలక ఒక సంవత్సరం గడిచిపోయింది.


ఇలా ఖాళీగా ఉండి, భార్య ఉద్యోగానికి వెళ్ళాక నిదానంగా లేచి తయారయి, భోజనం చేసి రోడ్డు మీదికెళ్ళి అలా కాసేపు తిరిగి సాయంత్రం భార్య వచ్చేటైం కి ఇంటికొచ్చేవాడు.


ఇంతలో తల్లి-తండ్రీ కూడా కాలం చేశారు.
ఇతని గురించి పట్టించుకుని, బాధ్యతగా హెచ్చరించే వారెవరు? ఎవరి లోకం వారిది.


ఓనాడుఅనుకోకుండా మురళిని కలిసిన బాల్య స్నేహితుడు మధుసూధన్ -విషయం తెలుసుకుని , 'భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికే వాడిని ఎవరు గౌరవిస్తార్రా? భార్యకి-పిల్లలకి కూడా లోకువ అవుతావు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విలువ కట్టరు. రేపు పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా కష్టమవుతుంది ' అన్నాడు.


'మీ మామగారు బాగా ఉన్నవాడే కదా! నీ చేత వ్యాపారం పెట్టించటానికి ఏం సహాయం చేస్తాననలేదా? .అసలు నీ గురించి మీ అన్నగారు కూడా ఏమీపట్టించుకోడా అని కూడా అడిగాడు.


అపుడు నోరువిప్పి మురళి తనగోడు వెళ్లబోసుకున్నాడు మిత్రునితో !


'ఆ.....మామావగారికి యెంతవుంటే మాత్రం ....అడిగి మనం మర్యాద పోగొట్టుకుంటామా?


'అయినా తన పుట్టింటికెళ్ళి మురళికి ఉద్యోగం లేదనీ, పెట్టుబడి సహాయం చేస్తే స్వంత వ్యాపారం చేసుకోవాలని ఉన్నదనీ అడగటం లత యిష్టపడదు .


పోనీ తన ఆఫీస్ లో లోన్ లేవైనా తీసుకున్నా ...ఆ కాస్తా సరిపోదు.'


'హీ..అర్థమైంది ...చూడూ ..నీ సమర్ధత మీద, నిజాయితీ మీద నాకు నమ్మకం ఉన్నది. ఎంతో కొంత సొమ్ము సమకూర్చుకో వాలి .
రెడ్డి ల్యాబ్స్" , "అరవిందో ఫార్మా "వాళ్ళ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకో, ఫిక్స్డ్ మార్జిన్స్ ఉంటాయి .అందులో అయితే బాగా ఎదిగవచ్చుకూడా ...అని సలహా ఇచ్చాడు.
అదే సొమ్ము సమకూర్చుకోవడం యెలా ... అని


సాహసించాలోయ్ ... తెగువకావాలి . చూడూ ..
నీ పేరున బేంకులోను నేను యేర్పాటు చేస్తాను .ఫార్మాలిటీస్ అవీ నేను హెల్ప్ చే స్తాను .లతని ఆఫీస్ లో పర్సనల్ లోన్ పెట్టమను ..మార్జిన్  మనీ కి పనికొస్తుంది... మా ఇంటికి దగ్గరలో ఒక గోడౌన్ ఉన్నది. అది అద్దెకు తీసుకుందాము. మిగిలిన ఆఫీస్ వ్యవహారాలన్నీ మీ ఇంటినించే నిర్వహించుకోవచ్చు.' అని మధుసూధన్ సలహా ఇచ్చి మురళిని కార్యోన్ముఖుడిని చేశాడు.


"తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకు గాక తధ్యము సుమతీ"


అని బద్దెన మహాకవి చెప్పినట్లు తన వారికెంత భాగ్యమున్నా వ్యక్తిగతంగా నీ సంపాదన, నీ ప్రయోజకత్వమే ప్రజల ముందు నిన్ను నిలబెడుతుంది కానీ.....అటు తల్లిదండ్రులది కానీ, ఇటు అత్తవారిది కానీ నీకు ఉపయోగపడదు, అని మెత్తగా చివాట్లేసి మిత్రుడికి తన నిజమైన స్నేహమాధుర్యాన్ని చూపించాడు, మధుసూధన్.


ఈ విషయాలు విన్న లత యెంతో సంబరపడుతూమిత్రుడు మధుసూదన్  స్నేహమాధుర్యాన్ని మెచ్చుకుంది .