నడుస్తున్న కాల ముద్ర : - వారాల ఆనంద్

తెల్లవారుతోంది పొద్దు గుంకుతోంది 
కాలాన్ని నేనసలు దర్శించలేదు 
పెద్దగా గమనించలేదు  గణించనేలేదు 
కాలం నన్ను తోసుకు వెళ్లిపోతున్నదన్న 
సోయే లేదు 
నిద్రలో ముడుచుకుని 
మెలకువలో నడిచి అంతా యదాలాపమే 
దాటేసుకు పోతున్న 
కాలాన్ని పిడికిట్లో ఎట్లా బంధించను 
కానీ ఈ గడుసు కాలం 
విచ్చుకోవడం ఒక్క చోట కనిపిస్తున్నది 
ఉయ్యాలలో ముసి ముసి నవ్వులు నవ్వినవాడు 
ముచ్చట్లు పెడుతున్నాడు 
తాతా మాస్క్ అంటున్నాడు 
బిడ్డ కొడుకును రారా పోరా అనొద్దు అన్నది 
మా అమ్మమ్మ చూపిన బాట 
చిన్నోడు  ప్రద్యుమ్న 
పెద్దోడవుతున్నాడు 
ఇవ్వాళ రెండు దాటి 
మూడింట అడుగు పెడుతున్నాడు 
నడుస్తున్న కాల ముద్ర  
తన ముఖం మీద మెరుస్తూ కనిపిస్తున్నది