కరిగింది కాలమేకానీ.. ఙ్ఞాపకం కాదుగా: -కీర్తన'సీ'రామ్

సెల్ఫీల్లేని ఙ్ఞాపకాలు
           మీకెన్ని గుర్తున్నాయో కానీ
                                    నాకన్నీ గుర్తేగా


అప్పుడెప్పుడో చిన్నప్పుడు
మిద్దె మీద నిద్ర


హద్దులు సరిహద్దులు లేని
విశాల ప్రపంచంలా ఆకాశం


చుట్టూ అన్నదమ్ములక్కచెళ్ళెళ్ళు 
మిత్రులు సన్నిహితులు ఎన్నెన్ని కబుర్లూ..


అర్ధరాత్రికి అలుపొచ్చేవరకూ
ఆకాశం ఇక చాలు పడుకోండ్రా అనేవరకూ      
     
ఛాయా చిత్రాలేం దిగలే, ఙ్ఞాపకాలే అన్నీ


అమ్మమ్మ నాన్నమ్మలు
కలిపి పెట్టిన ముద్దపప్పు ఆవాకాయ అన్నం


ఆ కమ్మదనం నెయ్యిదా
కలిపిన చేతిదా చూద్దామంటే ప్రింట్లేమీ లేవు
ఙ్ఞాపకాల తడే అంతా


నెమరేసుకుంటే
పొట్టినిక్కర్లతో పంచుకున్న
కారమద్దిన మామిడి ముక్కలు పుల్లైసులు


చీమ చింత కాయలు
పనసతొనలు తాటిచాపలు
తీయని ఫోటోలు తియ్యని ఙ్ఞాపకాలు


ఏసీలేని రైల్లో చెక్క బల్లెక్కి అమ్మకట్టిచ్చిన చద్దన్నం తింటుంటే ఓహ్, ఆ మహా తల్లి..


మమతానురాగాలు ఏ పాళ్ళలో కలిపిందో
తలచుకుంటే ఇప్పటికీ.. కడుపు నిండుతోంది


వేటికీ  ఫోటోలు లేవు
అవి లేవన్న దిగులూ లేదు


అయినా కరిగింది కాలమే కానీ
ఙ్ఞాపకం కాదుగా


అందుకే ఫీల్లేని సెల్ఫీల కన్నా.. సెల్ఫీల్లేని నా ఙాపకాలే నాకిష్టం.. ఇప్పటికీ ఇక ఎప్పటికీ