కొంగ స్నేహం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

అనగనగా ఒక అడవిలో పావురం, రామచిలక, కొంగ, పాలపిట్ట మంచి స్నేహితులు. అందులో పావురం, కొంగ ప్రాణ స్నేహితులు. వాటి అనుబంధం చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఒకదాన్ని విడిచి మరొకటి ఒక్క క్షణమైనా ఉండలేవు. అంతటి అనుబంధం పావురం, కొంగలవి. ఒకరోజు రామచిలుక చిన్న అపార్థంతో అకారణంగా పావురాన్ని తిట్టింది. పావురం ఎంతో బాధపడి తన బాధను తన ప్రాణ స్నేహితుడైన కొంగతో పంచుకుంది. రామచిలక పావురాన్ని తిట్టిన విషయం కొంగ పక్షిరాజైన గ్రద్దకు చెప్పింది. ఊహించని ఈ విషయానికి పావురం ఖంగు తిన్నది. నిజానికి చాడీలు చెప్పడం పావురానికి నచ్చదు. అక్కడే ఉన్న పాలపిట్ట చిలుక వద్దకు వెళ్ళి అమాయకమైన పావురాన్ని ఎందుకు నిందించావని రామచిలుకను తిట్టింది. అయితే రామచిలుక పావురమే కొంగచేత పక్షిరాజుకు తాను దూషించిన విషయాన్ని చెప్పించిందని అపార్థం చేసుకుంది. పావురంతో రామచిలుక మాటలు మానేసింది. అయితే కొంగతో తన చెలిమి చెడిపోవద్దని, తప్పు తనమీదే ఉంచుకుంది పావురం. 


 

       తన కారణంగా పావురం, రామచిలకల మధ్య మాటలు లేకపోవడం పాలపిట్టను ఎంత బాధ పెట్టింది. ఈ చిచ్చుకు కారణమైన కొంగ మాత్రం పావురం, రామచిలకలను కలిపే ప్రయత్నం చేయడం లేదు. తాను మాత్రం అటు అటు రామచిలుకతో ఇటు పావురంతో మాట్లాడుతుంది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. చివరకు పావురమే రామచిలుకతో మాటలు కలిపింది. పాలపిట్ట ఎంతో సంతోషించింది. మళ్ళీ ఈ నాలుగు పక్షులు విభేదాలు లేకుండా కలసిపోయాయి. 

 

     కాలం గడుస్తున్నది. ఒకరోజు కొంగ తాను చేయాల్సిన ఒక పనిని బద్దకంతో రామచిలుకను చేయమంది. రామచిలుక తన వల్ల కాదని చెప్పింది. కానీ కొంగ ఊరుకోలేదు. రామచిలుకను పదే పదే బ్రతిమాలి ఒత్తిడి చేసింది. చేయనన్న రామచిలుకను హేళన చేసింది. అనరాని మాటలు అన్నది. రామచిలుక మండిపడింది. కొంగ రామచిలుకల మధ్య మాటలు ఆగిపోయాయి. కొంగ ఊరుకోలేదు. తాను రామచిలుకతో మాట్లాడక పోగా మరికొన్ని పక్షులను రామచిలుకతో మాట్లాడవద్దని ఒత్తిడి చేసి, పూర్తిగా తనవైపు తిప్పుకుంది. రామచిలుకపై కొంగ యథాశక్తి దుష్ప్రచారం చేస్తుంది. కొంగ తన ప్రాణ స్నేహితుడైన పావురాన్ని సైతం చిలుకతో మాట్లాడవద్దని హెచ్చరించింది. కానీ ఆ రెండిటి మధ్య వైరం అయితే తాను ఎందుకు మాట్లాడవద్దు? ఆ రెండిటి మధ్య విభేదాలకు కొంగే కారణం. అందుకే పావురం కొంగ మాటలు వినలేదు. తాను మాత్రం రామచిలుకతో మాట్లాడుతూనే ఉంది. ఇది నచ్చని కొంగ పావురంతో నిష్టూరంగా మాట్లాడుతుంది. పైగా పావురాన్ని హేళన చేస్తుంది. మనసు నొచ్చుకున్న పావురం కొంగకు దూరంగా ఉంది. 

 

నీతి: ఎప్పుడైనా ఇద్దరి మధ్య గొడవలు వస్తే కలిపే ప్రయత్నం చేయాలి. అనవసరంగా ఒకరిపై చాడీలు చెప్పవద్దు. ఎవరు చేయాల్సిన పనిని వారే చేయాలి. తనవల్ల కాదన్నా ఇంకొకరిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దు. ఎవరినీ హేళన చేయవద్దు. ఒకరితో మనకు విభేదాలు వస్తే అది ఆ ఇద్దరి సమస్యగానే ఉండాలి. తప్పు తనదైతే క్షమాపణ చెప్పుకొని, మాటలు కలుపుకోవాలి. అంతేకాక తనకు నచ్చలేదని పదిమందికి వారిని దూరం చేయాలని ప్రయత్నిస్తే ఒక్కోసారి ప్రాణ స్నేహితులు సైతం తనకు దూరం అవుతారు.