గీ సలి కాలం ల
ఎగిలివరంగ లేసే టోల్లం
ఇంట్ల ఏమన్న పనుంటే సేసే టోల్లం
బజార్ల సిన్న పిరగాండ్లం
సొప్పతోనో , అరిగడ్డి తోనో
కట్టెపుల్లల తోనో
మంట వెట్టుకోని
సేతులు, పెయి, కాళ్ళు గుడ
కాపు కునెటోల్లం
పెద్దోళ్ళు గుడ అచ్చి
సేతులు ఎచ్చగ జేసుకొని పోయేటోల్లు
ఇగ మేం కొంచెం పొద్దెక్కినంక
కట్టెల తోని నీళ్ళు కాగ వెట్టుకొని
బొగ్గు తోనో, యాప పుల్ల తోనో
పండ్లు తోము కోని
ఉడుకుడుకు నీళ్ళతో తానం జేసి
ఉతికిన బట్ట లేసుకొని
కూర కాకపోతే
కారమో, మిరమో, తోక్కో
పెరుగో ఏసుకొని
జెప్ప జెప్పా తిని బడికి
ఉరికే టోల్లం
ఒక్క ఇంట్ల తప్ప
సుట్టాల ఇండ్లల్ల లగ్గాలైన
పండుగలు , పబోజనాలైనా
ఎక్కువగ పోయే టోల్లం కాదుల్లా!
ఎందుకో ఎరికెనావుల్లా?
బడికి పోక పోతే
సోపతి గాళ్ళు ' బడి దొంగ' అని
దెప్పే టోల్లు, సార్లు గుడ తిట్టేటోల్లు
గందుకనే బడికి తప్పకుంట పోయే టోల్లం
శానా మంది పొరగాండ్లు
పరీచ్చలల్ల పాస్ గాక పోయిన గని
రోజూ బడికోవుట్ల ఉత్త హాజిరి తోని
ఒకటి నుంచి ఆరో తరగతి దాక
గిట్లనే పాస్ అయేటోల్లం. కాని..
ఏడో తరగతి పరీచ్చలు మాత్తురం గొట్టుగ ఉండేటివి.
ఏడో తరగతి కన్న పదో తరగతి ఇంకా బగ్గ గొట్టు ఉండేది.
గప్పట్ల పది పాసయినోడు గొప్పోడే!
ఔ మల్ల!
ఔ మల్ల:-- బాలవర్ధి రాజు మల్లారం