గిట్టల సడికిట్టదా: --కిలపర్తి దాలినాయుడు

గోవును గౌరవించమని
నేననడంలేదు
ఇంత కుడితిని పాలుగా
పచ్చిపూరిని
పేడగా మార్చగలవా?
అని అడుగుతున్నాను!
ఆవును ఆదరించమని
నిన్నడగడం లేదు
బిడ్డకు పాలలేమిని తీర్చే
మరో అమ్మను చూపగలవా
అని అడుగుతున్నాను!
మొదవును మ్రొక్కమని
నిన్ను అర్ధించడం లేదు
పంచగవ్య ఔషధాలను
పండించగలవా?
అని అడుగుతున్నాను!
గంగడోలును స్పృశించితే చాలు
మోరలెత్తి దీవిస్తుంది!
గరికను ఇంతవేస్తే చాలు
కట్టుబానిసై తీరుతుంది!
తనమగ బిడ్డలను నీకు
సాయంగా ప్రసాదిస్తుంది!
బండెడు సంసారం నువ్వు
మోస్తున్నావంటే ఆతల్లి చలవే!
వృద్ధాశ్రమంలో తల్లిలా
వణుకుతూ పశువుల శాలలో ఉంటుంది!
 గిట్టలు సవ్వడి నీకు గిట్టదు
కొమ్ముల గోపురాలను నువ్వు
దర్శించలేవు!
గోధూళిలో లక్ష్మిని సాక్షాత్కరించలేవు?
పేడకడిని సిరుల జడిగా తలచడంలేదు
అవసరమైతే తనను తాను
ఖండఖండాలుగా దానంచేయగల
శిబిని మించిన ఔదార్యశీలి!
చర్మం ఒలిచి చెప్పులు కాగల
సహృదయ మూర్తి!
మతం నీది మంత్రం నీది
గోమెధాల గోత్రం నీది
పాపం పశువు
దానికేం తెలుసు ఇన్ని రంగులు
గొడ్డు చాకిరీ కావాలిగానీ
గొడ్డును గౌరవించడం 
ఎందుకు రాలేదో నిన్నడుగుతున్నా!