పుస్తకాలు - పిల్లలు : వేంపల్లి గంగాధర్


1
మీ పిల్లల్ని   కూర్చోబెట్టుకోండి. 
మీకు వచ్చిన ఏదో ఒక చిన్న కథ చెప్పండి.
అది ఏడు చేపల కథ కావచ్చు.  చీమ కథ కావచ్చు. కాకి- కుండలో నీళ్లు  కథ కావచ్చు. తిరిగీ ఆ కథను  పిల్లల్ని   చెప్పమని అడగండి.
అదే కథని మార్చి మరోవిధంగా చెప్పమనండి.
మరుసటి రోజు  నిన్న చెప్పిన    కథను  గుర్తుచేసి చెప్పమనండి.
ఈ విధంగా  పిల్లల్లో  కథాభిలాషకు పునాది వేయండి.
2
 పిల్లలకు బాల సాహిత్యాన్ని పరిచయం చేయండి. 
పిల్లల పెరుగుదల వారిలో వచ్చే మార్పులను బట్టి బాల్యాన్ని మూడు దశలుగా చెప్తారు.
పుట్టినప్పటినుంచి ఐదేళ్ల వరకు మొదటి దశ. ' శ్రవ్య'  ప్రధానంగా పిల్లలకు సాహిత్యాన్ని పరిచయం చేయాలి.   తల్లులు పాడే  లాలి పాటలు,  జోల పాటలు,  బువ్వ పాటలు,  చందమామ పాటలు ఈ కోవలోకి వస్తాయి. చిన్న చిన్న కథలు,  రంగుల బొమ్మలు,  వింత ఆకారాలు,  పిల్లలకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.
ఐదు నుంచి   పది దాకా రెండవ దశ. 'దృశ్య'  ప్రధానంగా  సాగుతుంది. చిన్న చిన్న పాటలు,  పొడుపు కథలు,  పశుపక్ష్యాదుల కథలు,   వేమన, సుమతి , శతక పద్యాలు పిల్లలకు పరిచయం చెయ్యొచ్చు.
పది నుంచి  పదిహేనేళ్ల  దాకా  మూడవ దశ.  'పఠనం'   ప్రధాన పాత్ర వహిస్తుంది. నీతి కథలు,  అద్భుత కథలు, చిక్కు ప్రశ్నలు , చిన్న చిన్న నాటికలు  పిల్లలకు  పరిచయం చేయవచ్చు.
3  
పిల్లలకి కథలు చెప్పండి. తిరిగి  ఆ కథల్ని  వారితో  చెప్పించండి. 
పిల్లల హృదయాలకు కథలు నైతికతను,  ఆత్మీయతను నేర్పిస్తాయి.
 తన చుట్టూ  ముళ్ళున్న  అందంగా పూసిన  గులాబీని  చూపించి   పిల్లలకు  ఈ రోజే  ఒక మంచి  కథను  చెప్పండి. 
పిల్లల  మనసుల్ని కూడా పూలవనం చేయండి.
ప్రియమైన  తల్లులారా... తండ్రులారా...   ఇది ఒక విన్నపం. 
రెండు చేతులు అడ్డుపెట్టి ఆరిపోతున్న  దీపాన్ని  కాపాడినట్టు మన 'బాలసాహిత్యాన్ని'  పదిల పర్చుకుందాం.
పిల్లల హృదయాల్లో కాంతి పూల పరిమళాలు వెదజల్లుదాం.  
ఇదే భావితరానికి మనం ఇచ్చే బంగారు కానుక.
(  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర విద్యాశాఖ  చేపట్టిన  మరో ప్రతిష్టాత్మకమైన  కార్యక్రమం '' చదవడం మాకిష్టం''.
 సమగ్ర శిక్ష,  గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో   'బాల సాహిత్యం'  పై  వర్క్ షాప్  ఏర్పాటు చేసినందుకు విద్యా శాఖ సంచాలకులు  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు.)