మా బడి కతలు : -ఉండ్రాళ్ళ రాజేశం-బాలసాహితీవేత్త-సిద్దిపేట

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిపల్లి అశోకన్న అంటే తెలియనివారు లేరు. నిత్యం బాలసాహిత్య కార్యశాలలతో పాటుగా బాలలు రాసిన పుస్తక సంకలనాలు ప్రచురితం కావడానికి ముందు నిలిచి, ప్రేరేపించే అశోకన్న అంటే అందరికీ ఆత్మీయత. తాను పట్టిన పట్టు వదలకుండా బాలల పుస్తకాలు రచనలు నిత్యం పలు పాఠశాలకు పంపుతున్నట్టి బాలల రచనా సృజనాత్మకతకు దివిటీ గరిపల్లి అశోకన్న.
                బాలసాహిత్యంలో ఎందరినో ప్రోత్సహించడమే కాకుండా తాను సైతం కలం కదిలించిన పదిహేను కతల సమాహారమే మా బడి కతలు. ఇట్టి కతలన్నీ కూడా తను పనిచేసిన పాఠశాల విద్యార్థుల స్థితిగతులే కతలైనయి. బాలలతో  అనుభవమే బడిపిల్లల కతలైనయి.  ప్రస్తుతం అశోకన్న ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసిన బాలల లోకంలో ఎప్పుడు బాలకృష్ణుడిలా విహరిస్తూనే ఉన్నాడు.
            మా బడి కతలు సంపుటిలో ప్రతి కతలో నీతి, న్యాయం, ధర్మం కంఢ్ల ముందు మెదలాడుతది. కరపత్రం, బొంతలు, నీళ్ళు, కాగితాలు, బుట్టలు, ఆకులు, వరుగులు, నిజాయితీ ఇలా ప్రతి కత బాలల ఎదలో చేరుతుంది. బాల సాహిత్యం ప్రోత్సహించడమే కాకుండా అశోకన్న  ఎనాటినుంచో రాస్తున్న రచనలు పుస్తక రూపం దాల్చడం సంతోషదాయకం. మరిన్ని కత సంపుటిలు అశోకన్న కలం నుండి జాలువారి బాలల లోకంలో సింగిడవ్వాలని ఆశిస్తున్నా....