దంతాల దర్పం : --డా.. కందేపి రాణీప్రసాద్.

ఒకానొకసారి మనిషి నోట్లో ఉండే నాలుకకు, దంతాలకు మధ్య మాటా మాటా వచ్చింది. మాటా మాటా పెరిగింది వాదులాట అయింది. ఇంతకీ విషయం ఏంటంటే దంతాలు, నాలుక కన్నా బలవంతులు, ద్రుడవంతులు కాబట్టి నాలుకను అణగదొక్కలని చూస్తున్నాయి. ఇది ఎక్కడైనా జరిగే విషయమే కదా! బలవంతులు, బలహీనులను తక్కువగా చూడటం మామూలే కదా! దంతాలు, నాలుక మీద పెత్తనం చేయాలనుకున్నాయి. కానీ నాలుక చాలా ఆత్మాభిమానం కలది. ఎవరు చులకనగా చూసినా సహించదు. అందుకే దంతాల అధికారా దర్పన్ని ఒప్పోకోలేదు. అందువల్లే రెండింటికి మధ్య తగాదాలు వచ్చాయి. 
 అప్పుడు దంతాలు ‘ఏయ్ నాలుకా! నీవు మెత్తగా ఉంటావు. మేమేమో ఎంత వాడిగా గట్టిగా ఉంటమో చూడు’ అన్నాయి. అయినా నాలుక ఏమి మాట్లాడలేదు. దాంతో ఇంకా దైర్యంగా ఇలా అన్నాయి. ‘ఏయ్ నాలుకా! ఊరికే ఎందుకు అటూ ఇటూ కదులుతావు. కొంచం మెల్లగా చూసుకొని నడువు. మా పళ్ళ కింద పడ్డానో విసురుపిసురు అయిపోతావు జాగ్రత్త అంటూ బెదిరించాయి.
 ఈ మాటలకు నాలుక ఏ మాత్రం బెదరకపోగా సౌమ్యంగా ఇలా అన్నది ‘మీరు ఎంత వాడిగా ఉన్న, దృడంగా ఉన్న కదలలేరు. నేను నోరంతా ఇష్టమోచ్చినట్లు తిరగగలను. మీరు ఎక్కడ ఉనవాళ్లు అక్కడే ఉండాలి. నేనలా కాదు. అటూ ఇటూ తిరిగి తప్పించుకోగలను’ ఈ మాటలకు దంతాలు హేళనగా నవ్వుతూ ‘మేము 32 మందిమి ఉన్నాం. నీవేమో ఒక్కదానివే ఉన్నావు. పైగా నీవు మా మధ్యలోనే ఉండాల్సిన డనివి. మేము ప్రహరీ గోడలా నీ చుట్టూ ఉన్నాం. మమ్మల్ని దాటి నీవెక్కడికి పోలేవు. మేం చెప్పినట్లు విన్నావా సరే లేదా నిన్ను కొరికి పారేస్తాం’ అంటూ హెచ్చరించాయి.
 అప్పటి నుంచి దంతాలు ఏ మాత్రంఅవకాశం వచ్చిన నాలుకను కొరికేయాలని చూస్తున్నాయి. నాలుక వాటి నుంచి తప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండసాగింది. అయినా వాటి ఆగదలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఇక లాభం లేదనుకున్న నాలుక వీటికి బుద్ది చెప్పాల్సిందే అనుకున్నది. అవకాశం కోసం ఎదురుచూడసాగింది.
 ఒకరోజు బయట నిలబడ్డపుడు ఒకతను నడుచుకుంటూ ఆ దారిన వెళుతున్నాడు. ఇదే సమయం అనుకున్న నాలుక వెంటనే ‘ఏరా ఒళ్ళు ఎలా ఉన్నది? నన్ను పలకరించకుండానే పోతున్నావు. నేను కనబడగానే నమస్కారం పెట్టాలని తెలీదా? దున్నపోతులా ఒళ్ళు పెంచవు కొంచెం కూడా బుర్రలో తెలివి లేదా?’ అంటూ ఆ దారిన పోయే దానయ్యను ఆగకుండా తిడుతూనే ఉన్నది. ‘తన మానాన తాను పోతూ ఉంటే ఈ తిట్లెమిటి? నేనేమీ మాట్లాడకపోయినా నన్నెందుకు తిడుతున్నాడు?’ అని ఆ దానయ్యకు విపరీతమైన కోపం వచ్చింది.
 అంతే వెంటనే వంగి కాలికున్న చెప్పు తీసుకొని ఆ దవడా ఈ దవడా ఎడా పెడా వాయించాడు. ‘ఏంట్రా! నన్ను తీడితే ఊరుకుంటూననుకున్నావురా?’ అంటూ ఉగ్రరూపుడై పోయాడు. అతను కొట్టిన దెబ్బలకు నాలుగు పళ్ళు రాలి నోట్లోంచి కిందపడ్డాయి. ఈ హఠత్ పరిణామానికి దంతాలు బిక్కచచ్చిపోయాయి. ఏం జరిగిందో అర్థం కావటానికి కాసేపు సమయం పట్టింది.
 ‘చూశారా నా ప్రతాపం. నేను తలుచుకున్నానంటే మీరు ఏమైపోతారో! అధికారం ప్రదర్శించాలని చూశారో జాగ్రత్త! ప్రతివారికి తామే సొంతమైన శక్తి ఏదో ఒకటి ఉంటుంది. ఎవరిని చులకన చేయకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకళ్ళకోకళ్ళు సహాయపడాలి. అయినా ఒక చోట ఉండేవాళ్లం కలిసిమెలసి ఉండాలి గాని వాదులాడుకోకూడదు’ అంటూ నాలుక పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది.
 ఆ దెబ్బతో దంతాలు సిగ్గుపడుతూ ‘సారి నాలుకా! ఇక నుండీ మనందరం కలిసి ఉందాం. ఇక ఇప్పుడు కొట్టుకోవద్దు’ అని చెప్పాయి. 
 అప్పటి నుంచీ దంతాలు, నాలుక ఎప్పుడు కొట్టుకోకుండా ఒకళ్ళకోకళ్ళు సహకరించుకుంటూ జీవించసాగాయి.