మా వూరి పలుకుబడి : - వి. ఆర్ . గణపతి

తాత : సేతిల పిస్పి వట్టుకొని యాడికి పోతున్నవ్ రా వారి? (చేతిలో సంచి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావురా  ఒరేయ్?)
మనుమడు : సోపలకు వోతున్ననే తాత !(బడికి వెళ్తున్నాను తాతా!)  
తా: పిస్పి ల ఏమున్నయిర పోడా ?(సంచీ లో ఏమున్నాయిరా పిల్లోడా?)
మ: వయ్యిలు. పలక.(పుస్తకాలు. పలక.)
తా: బలుపాలు ఏయిరా? (బలపాలు ఎక్కడరా?)
మ: అంగి కీసల ఉన్నై. (చొక్కా/షర్ట్ జేబులో ఉన్నాయి.)
తా: ఎన్నోది పట్టినవుర ఇప్పుడు?(ఎన్నోది చదువుతున్నావురా ఇప్పుడు?)
మ: నాలుగోది. (నాలుగవ తరగతి.)
తా: సక్కగ సదువుతున్నావ్ ర? (బాగా/సక్రమంగా చదువుతున్నావట్రా?)
మ: ఔ (ఔను).  మా కిలాస్ ల నేనే పెబ్బను (మా క్లాస్ లో నేనే మానిటర్ ను). మా పెద్ద సారు నన్ను ‘అందరి కన్న నువ్వే ఉషారు అని మెచ్చుకుంటడు ( మా హెడ్ మాష్టరు నన్ను ‘అందరి కన్నా నువ్వే క్లెవర్/తెలివైన వాడివి’ అని మెచ్చుకుంటాడు).
తా: పెబ్బవా?(మానిటర్ వా?). పెబ్బ ఏం పనులు జెయ్యాల్రా(మానిటర్ ఏం పనులు చెయ్యాలిరా?).
మ: ఏమేం జెయ్యాల్నంటే..పొద్దుగాల్నే సోపకు వోవాలె(బడికి పోవాలి). దారిల మంచి బరిగె (బెత్తం) తెంపుక పోవాలె. సారు రాకముందే బోరట(బోర్డు) మీద రాసినయి అన్ని మలిపెయ్యాలె(తుడిపెయ్యాలి).
తా: అట్లనా..(అలాగా)? ఎట్లా మలుపుతవ్రా(ఎలా తుడిపేస్తావురా)?
మ: గట్టి వెట్టి మలుపుత(గట్టి తో తుదిపెస్తాను)(కొన్నిరకాల ఆకులని రాతితో దంచి ‘గట్టి’ని తయారు చేస్తారు). ఆకులు దంచి బోర్డు మీన రుద్దుతం. రాతంత మాసిపోయ్యి (తుడిపేయ బడి),  కర్రెగ(నల్లగా) ఉంటది బోర్డు.
తా: సరే. ఇంకా?
మ: సారు(టీచరు) అచ్చేదాంక(వచ్చేవరకు) పోరగాండ్లు(పిల్లలు) లొల్లివెట్టకుంట(అల్లరి చేయకుండా), గాయిగాయి(గొడవ గొడవ) చెయ్యకుంట సూడాలె(చెయ్యకుండా చూడాలి).
తా: అవుర(అవునోరెయ్), మీ సోపల బాత్ర్రూంలు ఉన్నాయిర(మీ స్కూల్ లో బాత్రూం లున్నాయట్రా)?
మ: ఉన్నై. మొగపోరగాండ్లకు(మగ పిల్లలకు), ఆడోళ్ళకు(అమ్మాయిలకు) వేరే వేరే ఉన్నై.
తా: సారు పాటం చెప్తుండంగ ఎవల్లకన్న బాత్రూం కస్తే సారు పంపిస్తడా(టీచరు పాఠం చెబుతూ ఉండగా ఎవరికన్నా బాత్రూం కు వెళ్ళాల్సి వస్తే పంపిస్తాడా)?
మ: పంపిస్తడు. మనం సప్పుడుజేక(మాట్లాడకుండా/నిశ్శబ్దంగా) నిలవడాలె(నిలబడాలి). ఒంటేలుకస్తే (మూత్రానికొస్తే) మిగిలిన నాలుగేల్లు మూసి సిన్నేలు(చిటికెన వేలు) ఒక్కటే సూపియ్యాలే(చూపించాలి). సెంబట్కకస్తే(దొడ్డికి(చెంబు పట్టుకుని) వెళ్లాల్సి వస్తే) బొటనేలు, నాలుగోది, సిన్నేలూ మూసి రొండోది, మూడోది సూపియ్యాలె.
తా: దూపకు(దప్పికకు) ఏం జెయ్యాలె?
మ: దూపకు బొటనేలు మూసి మిగిలిన నాలుగేల్లు సూపియ్యాలె. 
తా: సరే పోయిరార బిడ్డ!