సిరి తా వచ్చిన వచ్చును: ఎం. బిందు మాధవి

"సిరి తా వచ్చిన వచ్చును
సరళమ్ముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మింగిన వెలగపండు కరణిని సుమతీ "


కొబ్బరికాయలో నీరు తెలియకుండా ఆశ్చర్యంగా తనంత తాను వచ్చి చేరుతుంది. అలా లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల సంపద మన దగ్గరకి చేరేటప్పుడు మనకి తెలియదు.


ఏనుగు మింగిన వెలగ పండు పైకి పండు లాగానే ఉంటూ లోపల డొల్లగా మిగులుస్తుంది. అలాగే మన వద్ద నుండి సంపద వెళ్ళిపోయేటప్పుడు కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది.


ఇక కధలోకొద్దామా!


బాబ్జి ఆ రోజు స్కూల్ నించి వస్తూనే తల్లితో 'అమ్మా ఈ రోజు నా ఫ్రెండ్ ఆకాశ్ చాలా డల్ గా మూడీ గా ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ లో ఏమయిందని అడిగితే తనని బస్ లో అందరు ఏడిపించారని చెప్పాడు.'


'నీకు తెలుసు కదమ్మా, ఆకాశ్ నాకు మంచి ఫ్రెండ్ అని. వాడు అలా ఉంటే నాకు ఏడుపొచ్చేసింది. అయినా రోజు "కార్" లో వచ్చేవాడు, ఈ రోజు 'బస్'లో ఎందుకొచ్చాడో తెలియలేదమ్మా అన్నాడు.


బాబ్జి తల్లి విమల, పిల్లవాడిని దగ్గరకి తీసుకుని 'అలా చిన్న చిన్న వాటికి బెంగ పడకూడదు' అని బుజ్జగించి 'ఆకాశ్ వాళ్ళ నాన్నగారికి వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు వచ్చి ఖర్చులు తగ్గించుకోవటానికి కొన్నాళ్ళపాటు డ్రైవర్ ని తీసేశారు. ఆయనకి ఆఫీస్ పన్లు ఉంటాయి కాబట్టి ఆకాశ్ ని ఈ రోజు నించి బస్ లో పంపిస్తున్నారు,' అని కొడుకుని ఊరడించింది.


'అమ్మా' వ్యాపారంలో నష్టాలంటే ఏంటి' 'అలా అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవా'? ఇంక నించి ఆకాశ్ బిస్కెట్లు, బుక్స్ కొనుక్కోలేడా? అసలు డబ్బులు ఎలా వస్తాయి, అవి ఎందుకు పోతాయి?' అని ప్రశ్నల వర్షం కురిపించాడు బాబ్జి.


విమల వాడి చిన్న బుర్రకి అర్ధమయ్యేట్లు ' మొన్న మనం గుడికెళ్ళినప్పుడు అందరూ కొబ్బరికాయలు కొడుతుంటే, అందులోంచి వచ్చే నీళ్ళు చూసి 'అమ్మా నువ్వు వాటర్ బాటిల్ లో పోసినట్టు కొబ్బరికాయల్లో నీళ్ళెవరు పోస్తారు, ' అని అడిగావు, గుర్తుందా? అని అడిగి బాబ్జీతో


సిరి తా వచ్చిన వచ్చును
నారికేళ సలిలము భంగిన్
..............


'అని నీ చేత పద్యం చదివించాను కదా! ఆ పద్యంలో చెప్పినట్లు కొబ్బరికాయలో నీళ్ళు ఎవరు పొయ్యకుండా, మనకి తెలియకుండానే ప్రకృతి సహజంగా వస్తాయి. అలాగే ఏనుగు వెలగపండు పగలకొట్టకుండానే పండు పండుగా ఉంచి లోపలి గుజ్జుని జుర్రేస్తుంది.'


'అలా సిరిసంపదలు ఎవరి జీవితంలో అయినా ఎలా వస్తాయో, ఎప్పుడు పోతాయో తెలియదు.'


'అలా జరిగినప్పుడు నిబ్బరంగా ఉండటమే మనం నేర్చుకోవలసింది!' అని ముగించింది.