కనకపు సింహాసనమున: ఎం . బిందుమాధవి

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభలగ్నమునన్
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను! వినురా సుమతీ"


విజయ్ వాళ్ళ ఆఫీస్ లో ప్రమోషన్ ప్రక్రియ నడుస్తున్నది.


ఉన్నత పదవుల ఖాళీలని భర్తీ చేసే విధానంలో భాగంగా కొంతమందిని సీనియారిటీ ప్రకారం వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


ఈ పూర్తి సీనియారిటీ బ్యాచ్ లో జగన్నాధ రావు గారు పదోన్నతి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీతం పెద్ద గా పెరగకపోయినా ఇతర సదుపాయాలు వస్తాయని ఆయన ఆశ!
అసలు ఆయనకి ఇప్పటివరకూ పదోన్నతి రాకపోవటానికి కారణం పై అధికారులతో ఉండే ఆయన అవిధేయత. సాటి కొలీగ్స్ పట్ల సర్దుబాటు లేని ధోరణి. ఇది కాక బయటి క్లయింట్స్ తో కుమ్మక్కయి ఆఫీస్ సొమ్ము దుర్వినియోగం చెయ్యటం.


రెండు మూడు సార్లు సస్పెండ్ కూడా అయ్యాడు.


సరే, యూనియన్ నియమ నిబంధనలని బట్టి గత్యంతరం లేక ఆయనకి పదోన్నతి ఇచ్చి పక్క ఊరిలో ఉన్న బ్రాంచ్ హెడ్ గా వేశారు.


ఇహ, పదవి చేతిలో ఉన్నది కాబట్టి రిజర్వాయర్ గేట్లు ఎత్తేసినట్లు అధికార దుర్వినియోగం చెయ్యటం మొదలు పెట్టారు.


ఆఫీస్ లో స్టాఫ్ గుస గుసలాడుకుంటున్నా వినీ విననట్లు "దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవాలని" తన పనిలో తను ఉండేవాడు.


"ఏ కట్టెకి అంటుకున్న నిప్పు ఆ కట్టెనే కాల్చదు"అన్నట్లు ఒక్కోసారి మిగిలిన సిబ్బందికి ఈ కారణం వల్ల ఇబ్బంది కలిగేది. ఎక్కడ ఈ అవినీతి చట్రంలో తము ఇరుక్కుంటామో అని హడిలిపోయే వారు.


పరిస్థితి అదుపు తప్పేసరికి పై అధికారులు కలగ చేసుకుని జగన్నధ రావు గారిని డిస్మిస్ చేశారు.


పదోన్నతి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడ్డ విజయ్, ఇంకా అతని స్నేహితులు తమలో కొందరు ఇంటర్వ్యూ దగ్గర నెగ్గక ప్రమోషన్ పోగొట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగాలి కదా అని బాధ పడుతూ ఉంటే, ప్రమోషన్ వచ్చిన జగన్నాధ రావు గారు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి డిస్మిస్ అయ్యేసరికి


"కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి, శుభలగ్నమునం
..................


అన్నట్టు మాలో ఒకరికి అవకాశం పోయింది. అవకాశం వచ్చిన ఆయన తినే అన్నం లో మట్టి పోసుకున్నారు అనుకున్నారు.