వైద్యంనేర్చినకోతి:-డి.కె.చదువులబాబు


మసికన్నుఅనే అడవిలో ఒక కోతి ఉండేది. అది చెట్లపై దుమికేది.కొమ్మలు పట్టుకుని ఊయల ఊగేది.ఆకులు తుంచేది. కోతిచేష్టలతో, తుంటరిపనులతో సరదాగా గడిపేది. అలాంటి కోతి ఒకరోజు దిగులుగా ఉండటం ఉడత గమనించి కారణమడిగింది.

" కోయిల పాటను, నెమలి నాట్యాన్ని, చేప ఈతను,లేడి పరుగును,సింహం రాజసాన్ని, పులి ఠీవిని అందరూ ప్రశంసిస్తున్నారు.నన్ను ఏఒక్కరూ అభినందించడంలేదు."అంది.

"కోతి చేష్టలను, తుంటరి పనులనూ ఎవరూ అభిమానించరు.ప్రజ్ఞతోనే ఘనత లభిస్తుంది."అంది ఉడత.

ఆరోజునుండి ఏదోఒక రంగంలో సాధనచేసి తనప్రజ్ఞను ప్రదర్శించి అందరి మెప్పునూ పొందాలనుకుంది.బాగా ఆలోచించి అడవినుండి ఒకపల్లెకు వెళ్లిపోయింది. అక్కడ ఒక ఆయుర్వేద వైద్యుడి వద్దకు వెళ్లింది.

"అడవిలో జంతువులు జబ్బులతో, పుండ్లతో, గాయాలతో బాధలు పడుతున్నాయి.నాకు వైద్యం నేర్పితే వాటికి సేవలందిస్తాను"అంది.

కోతి  కోరికకు వైద్యుడికి ముచ్చటేసింది. అలాగే నేర్పుతానన్నాడు. ఆరోజునుండి వైద్యుడికి సహాయపడుతూ వైద్యం నేర్చుకుంది.

ఓరోజు వైద్యుడి అనుమతి తీసుకుని అడవికొచ్చింది.కనపడకుండా పోయిన కోతి తిరిగి రావడంతో జంతువులన్నీ చుట్టుముట్టి "ఎక్కడికెళ్లావు?ఎలాగున్నావు?"అని కుశలప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోతి వాటికి తన సంగతులు చెప్పింది. జంతువులన్నీ సంతోషపడ్డాయి.కోతి అడవిలో తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలను సేకరించుకుంది.

ఆహారం జీర్ణంకావడంలేదని గుర్రం కోతి దగ్గరకొచ్చింది.దంతం నొప్పిగా ఉందని ఏనుగు వచ్చింది. కాలు విరిగినట్లుందని జింక వచ్చింది. వీపుపై పుండు లేచిందని ఉడత వచ్చింది. కాలికి గాయమైందని కుందేలు వచ్చింది. అలా రకరకాల సమస్యలతో చిన్న ,పెద్ద జంతువులు వైద్యంకోసం వస్తున్నాయి. కోతికి గౌరవంతో నమస్కరిస్తున్నాయి.ప్రశంసిస్తున్నాయి.సమస్య తీరగానే కృతజ్ఞతలు చెబుతున్నాయి. కోతికి ఇప్పుడు ప్రశంసలకంటే తాను చేస్తున్న సేవ ఎక్కువ తృప్తినిస్తోంది. తనకు మంచిమాట చెప్పిన ఉడతకు కృతజ్ఞతలు చెప్పింది కోతి.

'ఏంతో కష్టపడి కృషిచేసి సాధించిన ప్రజ్ఞతోనే ఘనత లభిస్తుంది. ఆప్రజ్ఞ పదిమందికీ ఉపయోగపడితే అంతకుమించిన తృప్తి, మనశ్శాంతి ఎక్కడా లభించవనుకుంది కోతి.

ఈవిషయాన్ని జంతువులకన్నింటికీ చెప్పింది.కోతి మాటలతో ప్రభావితమైన జంతువులు పదుగురికీ ఉపయోగపడే మంచిపనులు చేయసాగాయి.

డి.కె.చదువులబాబు

3/528-2.వై.యం.ఆర్. కాలనీ. ప్రొద్దుటూరు.కడపజిల్లా--516360.

.9440703716.