నైతిక విలువల సారం రామాయణం: చిన్నారుల మనో భావాలు
 రామాయణం చదవడం ద్వారా అనేక జీవన విలువలను నేర్చుకోవచ్చని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. నాలుగవ తరగతి చదువుతున్న రాపోలు అద్విక్ రాసిన అద్విక్ రామాయణం పుస్తక ఆవిష్కరణ స్థానిక గ్రీన్ గ్రోవ్  పాఠశాల ఆవరణలో జరిగింది. పిల్లలే వక్తలుగా, పిల్లలే ఆవిష్కర్తలు గా వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమానికి పదవ తరగతి విద్యార్థిని మెండె  సహస్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ మాంట్ ఫోర్ట్ పాఠశాల విద్యార్థిని లాస్య మాట్లాడుతూ రామాయణం మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది అన్నారు. 8వ తరగతి చదువుతున్న అబ్దుల్ రఫూఫ్ అహ్మద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు విధిగా చిన్నప్పుడే పిల్లలకు రామాయణాన్ని నేర్పించాలని కోరారు. రెండవ తరగతి చదువుతున్న సాగర్ల శ్రీవర్ధన్ మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించడం, అన్నదమ్ములను ప్రేమించడం అనే సందేశాన్ని రామాయణం అందిస్తుంది అన్నారు. పాటి  భానుజ మాట్లాడుతూ అతి చిన్న వయసులో రాపోలు అద్విక్ పిల్లలకు అర్థమయ్యే సరళమైన భాషలో రామాయణం వ్రాసాడని అభినందించారు. పదవ తరగతి చదువుతున్న  ఋష్మిత మాట్లాడుతూ సందర్భానుసారంగా ఈ గ్రంథానికి హరిచందన బొమ్మలు గీసిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో రిత్విక, షన్మిత, సంజన, శ్రీనందన్, భాగీరధి సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు
నా జీవితంలో అద్భుతమైన అవకాశం: సహస్ర 
 నా పేరు సహస్ర. నేను పదవ తరగతి చదువుతున్నాను. ఒక సభకు అధ్యక్షత వహించడం నాకు వచ్చిన గొప్ప అవకాశం గా భావిస్తున్నాను. అతి చిన్న వయసులో అద్విక్ రామాయణం రాయడం,  అంతా నా స్నేహితులే సభలో వక్తలు గా ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సభ నడపడం వల్ల నాలో ఎంతో ఆత్మస్థైర్యం పెరిగింది.
అభినందన : హరి నందన
నా పేరు హరి నందన చిలుకూరి. అద్విక్ రాసిన రామాయణానికి సందర్భానికి తగిన బొమ్మలు గీశాను. నాకు ఆ అవకాశం కలిగించిన అద్విక్ కు ధన్యవాదాలు. జీవితంలో గొప్ప చిత్రకారిణి గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.
నాన్నే నాకు స్ఫూర్తి: అద్విక్ రాపోలు 
నాపేరు అద్విక్ రాపోలు. నాలుగవ తరగతి చదువుతున్నాను. మా నాన్న సీతారామ రాజు కవి. ఆయన పుస్తకం వేశారు. అది చూసినప్పటినుండి నేను కూడా అలా రాయాలి అనుకునేవాడిని. మా అమ్మ కోసం తో చిన్నప్పుడే రామాయణం నేర్చుకున్నాను. నాదైన శైలిలో నా తోటి స్నేహితులకు అర్థమయ్యే విధంగా సరళమైన ఇంగ్లీష్ భాషలో రామాయణం రాశాను. నన్ను ఆశీర్వదించిన అభినందించిన అందరికీ ధన్యవాదాలు
పిల్లలకు రామాయణం విధిగా నేర్పించాలి: అబ్దుల్ రవూఫ్ అహ్మద్ 
 నా పేరు అబ్దుల్ రఫూఫ్ అహ్మద్. ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. అద్విక్ రాపోలు రాసిన పుస్తకం నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. చిన్న వయసులో చక్కని పుస్తకం రాశాడు. తల్లిదండ్రులు పిల్లలకు రామాయణం నేర్పడం ద్వారా పిల్లల్లో మంచి లక్షణాలను పెంపొందించవచ్చు.
 జీవన విలువలు పెంపొందించేది రామాయణం. : లాస్య 
 నా పేరు లాస్య. ఆరవ తరగతి చదువుతున్నాను. అద్విక్ రాసిన రామాయణం సరళమైన భాషలో ఆకట్టుకునే విధంగా ఉన్నది. పిల్లలు ఇలాంటి పుస్తకాలు చదవడం ఎంతో అవసరం. మన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ పుస్తకాలు దోహదం చేస్తాయి. అద్విక్ జీవితంలో మరెన్నో పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను