చుట్టాల సురభి.: - వసుధా రాణి

 మొన్నామధ్య ఓ ఆత్మీయురాలితో ముచ్చటిస్తున్నప్పుడు చుట్టాల సురభి అన్న పదం వాడాను. ఆవిడ ఆ పదం భలే ఉంది అని సరదా పడ్డారు.అది చిన్నప్పుడు నా నిక్ నేమ్ .ఆవిడ అయితే ముచ్చట పడ్డారు గానీ ఈ బిరుదు మా అమ్మ నాకు ఇచ్చినది.అంతే కాక నా చుట్టాల సురభి లక్షణం వల్ల ఆవిడ పాపం ఇబ్బంది కూడా పడి ఉంటుంది.చిన్నప్పుడు తెలియలేదు కానీ గృహిణిగా మారాక బాగా అర్థం అవుతోంది.
బంధువులు ,స్నేహితులు,హితులు అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చ ఇష్టం.కాస్త ముఖపరిచయం ఉన్న వాళ్ళు కనపడినా నేనే ముందు నవ్వుతూ పలకరించేస్తూ ఉంటాను.ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే నాకు మహా ఆనందంగా ఉండేది .ముఖ్యంగా పెద్దవాళ్ళు అమ్మమ్మలు,బామ్మలు,ఆమ్మలు,తాతయ్యలు ఇలాటి క్యాటగిరీ వాళ్ళయితే వాళ్ళు మా ఇంట్లో ఉన్నన్ని రోజులూ వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండేదాన్ని.
వాళ్ళు మా ఇంట్లో ఉన్నంత కాలం నా ఈడు పిల్లలంతా దిగువ తరగతి వాళ్ళలా అనిపించే వాళ్ళు. నేను మాత్రం ఏదో మేధోతరగతి మనిషిని అనుకునే దాన్ని (బడిలో సి సెక్షన్ అయినా సరే).వారికి ఇష్టమైనవి చేసిపెట్టాలనే అత్యుత్సాహంతో బామ్మా నీకు అవిసపూలు ఇష్టమా?
అమ్మమ్మా నీకు అరటి దూట ఇష్టమా ? అంటూ అవి తెచ్చిపడేస్తే.పాపం నా మెహర్బానీ కోసం ఆ కష్టమైన కూరలు మా అమ్మ వండాల్సి వచ్చేది.
చుట్టాల సంగతి ఇలా ఉంటే ఇక స్నేహితుల దగ్గర త్యాగరాణినే.బలపాలతో మొదలైన త్యాగం పెన్సిళ్లు,రబ్బర్లు,రిబ్బన్లు ఇలా కొనసాగింది.మొన్నా మధ్య నా చిన్నప్పటి స్నేహితురాలు నన్ను ఫేస్బుక్ లో వెతికి పట్టుకుని నీ లంచ్ బాక్స్ లో గోంగూర,చింతకాయ, ఆవకాయ అన్నాలన్నీ నేనే సగం తినేసే దాన్నే అని అంటే ఎంత ఆనందం వేసిందో.
ముఖపరిచయం ఉన్న వారిని కూడా వదల్లేదీ చుట్టాల సురభి.ఓ సంవత్సరం వరి పంటకు తెగులు వచ్చి పశువులకు ఎండుగడ్డి కరువు వచ్చింది. మాకు వుండే రెండు గేదెల కోసం మేము రెండు సంవత్సరాలకు సరిపడా పెద్దగడ్డివాము వేసుకోవటంతో మాకు మాత్రం గడ్డి సమృద్ధిగా ఉంది.అది చూసిన పరిచయస్తుడు రాణెమ్మా ఓ పది ఎండుగడ్డి కట్టలు ఇవ్వవా మా గేదెలు పచ్చిగడ్డి తిని విసుగెత్తి పోయాయి అని అడిగాడు.ఇంకేముంది సీన్ కట్ చేస్తే గడ్డివాము నుండి గడ్డి దూస్తూ నేనూ,వెనుక మా అమ్మ ఎందుకే అంత గడ్డి దూస్తున్నావు ?
అంటూ.కరువు కాలంలో ముఖపరిచయస్తునికి గడ్డి దూసిపోసే నన్ను ఆశ్చర్యంగా చూస్తూ మా అమ్మ ఇంత చుట్టాల సురభివేమే ! అంది పాపం.
అయితే ఆ లక్షణం మాత్రం నన్ను వీడిపోలేదు.ఎక్కడ బంధువులు,మిత్రులు ఉన్నా ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళను తప్పకుండా కలిసే ప్రయత్నం చేస్తాను.అలాగే మా ఇంటికీ ఆహ్వానిస్తుంటాను.పెళ్లిళ్లు,సంబరాలు ఇలాంటి వాటికి వీలైనంత వరకూ హాజరు అవుతాను. మిత్రులను,బంధువులను కలుసుకునే ఏ అవకాశాన్నీ వదలను.మళ్ళీ నా తరువాత చుట్టాల సురభి మా అమ్మాయి మేఘన.