చిలుకా:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 చిలుకాచిలుకా అందమైనచిలుకా

నీ సంగతేమిటో చెప్పమ్మా !!

ముచ్చటగొలిపే పచ్చనిరంగు

నీ వొంటికెలా వచ్చిందీ ?

పచ్చపచ్చని చెట్లల్లో తిరిగీతిరిగీ

నావొంటికి రంగు వచ్చిందీ !!

చక్కనైన ఎర్రనిరంగు

నీ ముక్కుకెలా వచ్చిందీ ?

ఎర్రఎర్రని పళ్ళను కొరికీకొరికీ

నాముక్కుకు రంగు వచ్చిందీ !!

హాయనిపించే తీయనిమాటలు

నీ నోటికెలా వచ్చాయీ ?

తీయతీయని పళ్ళను తినగాతినగా

నామాటలు తీయగ అయినాయి !!

నీ రంగులు మాటలు బాగున్నాయ్

మా పాపకు తోడూ ఉండవోయ్ !!