బాలల నిర్ణయం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు


  హరి, సోము, రంగ, శివ, వాసు, రాము, విష్ణు తదితర స్నేహితులు ప్రతిరోజూ పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ బయటకు వెళ్ళి గంటన్నర పాటు క్రికెట్ ఆడేవారు. సెలవు రోజుల్లో మూడు, నాలుగు గంటలు క్రికెట్ తప్ప మరో లోకం లేదు. కొందరి తల్లిదండ్రులు విసుక్కునేవారు. క్రికెట్ తప్ప మరో ఆట లేదా అని. మరికొందరు ఇంట్లో తోడబుట్టిన వారిని వదిలేసి బయటివాళ్ళతో ఆపలేమిటని తిట్టేవారు. అయినా మనవాళ్ళు లెక్క చేయరు. 


      ‌ కోవిడ్ విజృంభణతో లాక్డౌన్ విధించడంతో ఈ అల్లరి బృందం ఇంట్లోనే కొట్టేసినట్లు ఉండాల్సి వచ్చింది. తరచూ తోబుట్టువులతో టి. వి. రిమోట్ కోసమో, సెల్ ఫోన్ల కోసమో కొట్లాటలే. రాము, వాసులు మాత్రం తమ చెల్లెళ్ళతో ఆడుతున్నారు. లాక్ డౌన్ సడలించడంతో రాము, వాసులు తప్ప మిగతా వాళ్ళందరూ మళ్ళీ క్రికెట్ మొదలు పెట్టారు. ఇరుగుపొరుగు వాళ్ళు వీళ్ళను తిడుతున్నా వీళ్ళు లెక్క చేయడం లేదు. రాము, వాసులను కూడా పిలిచే ప్రయత్నం చేశారు. "కరోనా రోజు రోజుకూ పెరిగిపోతోంది. మన పెద్దలు అనేక పనులపై చాలా ప్రాంతాలు తిరిగి వస్తున్నారు కదా! వారిలో ఎవరికీ కరోనా సోకినా అది మనందరికీ అందుకోవడం ఖాయం. మనతో మన ఇంట్లో వారందరికీ వ్యాపిస్తుంది. ఎన్ని బాధలు పడుతామో, ఎంత ఖర్చు అవుతుందో? ఎవరికైనా ఒంట్లో ఇతర జబ్బులు ఉన్నా, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా వారి ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఇంత కష్టం అవసరమా?" అన్నాడు రాము. దాంతో మరికొన్ని రోజులు ఆటలకు దూరంగా ఉన్నారు.

       కరోనా కేసులు దేశవ్యాప్తంగా బాగా తగ్గు ముఖం పడుతున్నాయని తెలియడంతో మళ్ళీ క్రికెట్ మొదలు పెట్టారు. ఇది తెలిసి వాసు, రాములు తమ మిత్ర బృందం వద్దకు వెళ్ళారు. "ఆన్ లైన్ తరగతులు జరుగుతున్నాయి కదా! దాని మీద చర్చిద్దాం. అందరూ బాగా వింటూ అన్ని సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్ అయితే మళ్ళీ మనం ఆటలు మొదలు పెట్టుకుందాం. మనం ఇప్పుడు క్విజ్ పోటీ పెట్టుకుందామా?" అన్నాడు వాసు. అందరూ నోరెళ్ళబెట్టారు. "చూడండి. ఆన్ లైన్ తరగతులు మిస్ అయితే మనం చాలా నష్టపోతాము. వచ్చే సంవత్సరం తదుపరి తరగతిలోకి ప్రమోట్ అయినా అన్ని సబ్జెక్టులు మనకు భారం అనిపిస్తాయి. కాబట్టి తేలికగా తీసుకోక ఈ ఆన్ లైన్ తరగతులను సీరియస్ గా తీసుకుందాం. మనకు అర్థం కాని విషయాలను ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల ద్వారా ఫోన్ల ద్వారా చెప్పించుకుందాం. ఫోన్ల ద్వారా మనమూ చర్చించుకుందాం‌. కొన్నాళ్ళు ఓపిక పడుదాం." అన్నాడు వాసు. "నేను, వాసు తీరిక సమయాల్లో మా చెల్లెళ్ళతోనే ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాం. వెనుకటి కాలంలో ప్రాచుర్యం పొంది, ఇప్పుడు మరచిపోతున్న రకరకాల ఆటలనూ ఆడుతున్నాం. దీంతో బోలెడంత వినోదం. మా పెద్దలతో కథలు చెప్పించుకుంటున్నాం. మన ఇంట్లో వాళ్ళతో మనం ఆడుకోకపోతే మరి వారితో గడిపేది ఎవరు? కరోనా పూర్తిగా తగ్గేవరకు మనం ఇండ్లలోనే ఉందాం. చదువును నిర్లక్ష్యం చేయవద్దు. ఇంట్లో వాళ్ళతో ఆనందంగా గడుపుదాం." అన్నాడు రాము. అందరికీ ఈ మాటలు నచ్చి, తామూ ఇల్లు కదలకుండా ఇంట్లో వాళ్ళతో బోలెడన్ని ఆటలు ఆడుకోవాలని, కష్టపడి చదువుకోవాలని అనుకున్నారు.