కొత్త కొత్తగా :-కె ఎస్ అనంతాచార్య.

 పాచి అన్నం చెత్తబుట్టను చేరినట్టు
 న్యూస్ పేపర్ లోని అక్షరాలు గోడ మీది సున్నం లా వెలిసి పోతాయి
పాఠం పాతబడి పోతుంది
అలవాట్ల    పొరపాట్ల లో 
 అసంతృప్తి భగ్గుమంటుంది! 
కాలెండర్ లోని డేట్లు బిక్క మొహం తో  కరిగిపోతూ కాలం ఒడిలో ఒరిగిపోతుంది!
 దేనికోసమో అరులు చాచే మనసు బూచి
ఆ నాటి సంబరం అదిరిపోయింది మరో రోజు పూసే రోజా పైనే కన్ను ముళ్లున్నా కావాలనే సాహసం! 
నిన్నటి ముద్రలు చేరిగిపోతూ ఇంకా ఏదో అందుకునే ద్రాక్ష ప్రయత్నం
 అందనిదానికోసం అర్రులు 
 కొత్తను నింపాలనే వెఱ్ఱి ఆశలు
ప్రతి నిత్యం  కొత్త కూర కోసం చవులూరినట్లు   పాత సామాన్లను వదిలించుకునే  ఆత్మానువాదం
సుఖాన్ని కోరే దేహం  నీటి పరుపు మీద దొర్లిపోతూ మైమరచి పోవాలనే కోరికల విహంగం
కొత్త ఇల్లు, కొత్త కారు.... అంతకన్నా ఎక్కువ కోరితే జీవితమే బెకార్
చిన్న తృప్తి చిలక నాలికను 
చుడితే చాలు కడుపు నిండిన తేన్పులు ఆదరించి అందించే కై మోడ్పులు