గంజాయివనంలో తులసిమొక్క (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు


 సురేంద్ర మంచి స్వభావం కల విద్యార్థి. పాఠాలను శ్రద్ధగా వింటూ ఒక్కసారి వినగానే అర్థం చేసుకుంటూ, ఇంటివద్ద మళ్ళీ కొద్దిసేపు మాత్రమే ఆ పాఠాలను చదువుకొని, మళ్ళీ మరచిపోయేవాడు కాదు. ఆ పాఠశాలలోనే శ్రీహరి, మోహన్, రాజేంద్ర, బలరాం తదితర విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి, చదువుకోకుండా గంటల తరబడి ఆటలతో కాలక్షేపం చేస్తూ, చెడు వ్యసనాలకు బానిసలు అయ్యారు. ఉపాధ్యాయులు తరచూ మందలించేవారు. బుజ్జగించి చెప్పేవారు. కఠినంగా శిక్షించేవారు. అయినా ఈ అల్లరి బృందం తమ తీరు మార్చుకోలేదు. తరచూ సురేంద్రను మెచ్చుకోవడం తమను దూషించడం వారు సహించలేకపోయారు. 


         సురేంద్రతో స్నేహం చేసి, సురేంద్రను ప్రతి చిన్న విషయానికి బాగా పొగడటం మొదలు పెట్టారు. దీంతో సురేంద్ర వారికి మంచి స్నేహితుడు అయినాడు. సురేంద్ర తీరిక వేళల్లో వారితోనే తిరుగుతూ, వారితోనే గంటల తరబడి ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అమరేంద్ర అనే విద్యార్థి సురేంద్రను దగ్గరకు పిలిచి, "మిత్రమా! నువ్వు మంచిగా చదివేవాడవు, మంచి స్వభావం కలవాడివి దుర్మార్గుల సహవాసం చేస్తున్నావు. వారు నిన్ను, చెడగొట్టడమో, మోసం చేయడమో జరుగుతుంది. వాళ్ళకు దూరంగా ఉండు." అని హెచ్చరించాడు. సురేంద్ర ఈ మాటలను తేలికగా తీసుకున్నాడు. 

       ఒకసారి ఈ అల్లరి బృందం ఒకచోట చేరి, చెడు వ్యసనాలతో కాలక్షేపం చేస్తున్నారు. అది బలరాం తండ్రి కంట పడింది. బలరాం తన కొడుకును శిక్షించడమే కాక వీరందరిపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు. ప్రధానోపాధ్యాయుడు వాళ్ళందరినీ పిలిచి, టి..సి. లు ఇచ్చి పంపిస్తానని, ఇక పాఠశాలకు రానక్కరలేదని అన్నాడు. వారు తమ తప్పేమీ లేదని, తమకు ఈ చెడు అలవాట్లు బలవంతంగా సురేంద్రనే నేర్పించాడని చెప్పారు. మీ తీరు మార్చుకోకపోతే మీకు టి. సీ. ఇవ్వడమే కాక మరెక్కడా చదువుకునే అవకాశం లేకుండా చేస్తానని హెచ్చరించాడు. సురేంద్రను పిలిచి, తన తప్పేమీ లేదని సురేంద్ర చెప్పినా వినిపించుకోకుండా పదిహేను రోజుల పాటు అతణ్ణి పాఠశాల నుంచి సస్పెండ్ చేశాడు. సురేంద్ర జరిగింది తన తల్లిదండ్రులకు చెప్పాడు.
 సురేంద్ర తల్లిదండ్రులు కుమారుని కూర్చోబెట్టి జరిగింది నీ మంచికే. ఇది నీకు గుణపాఠం కావాలి. ఇంకెప్పుడూ ఆ దుర్మార్గులతో మాట్లాడకు. మంచి స్నేహితుల సంపాదించి, సమయాన్ని సద్వినియోగం చేసుకో‌. ఈ పదిహేను రోజులు అమరేంద్ర ఇంటికి వెళ్ళి, ఏ రోజు జరిగిన పాఠాలు ఆరోజు నేర్చుకో అని చెప్పారు. సురేంద్ర అప్పటి నుంచి చెడు స్నేహితులకు దూరంగా ఉన్నాడు.